ట్రంప్ కు వీరాభిమాని.

జనగామ:
అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలంగాణలోని ఓ యువకుడికి దైవంగా మారారు. సంవత్సరకాలంగా ఆ యువకుడు ట్రంప్ ఫొటోకు నిత్య పూజలు, అభిషేకాలు చేస్తున్నాడు. ఓసారి రక్తాభిషేకం కూడా చేశాడు. విషయం తెలిసిన ట్రంప్ తన భక్తుడి కోసం తెలంగాణ వచ్చి కలుసుకుంటానన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి బస్సా కృష్ణ పదో తరగతి వరకు చదువుకున్నాడు. తర్వాత తమకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. గత ఏడాది కాలంగా కృష్ణ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫొటోకి పూజలు చేయడం మొదలుపెట్టాడు. స్తోత్రాలు పఠిస్తూ, హారతి ఇస్తూ నిత్యపూజలు చేస్తున్నాడు. ఓసారి చేతి వేలికి గాయం చేసుకుని ఫొటోకు రక్తాభిషేకం కూడా చేశాడు. కృష్ణ పూజలు చేస్తుండగా అతడి స్నేహితులు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు. ఇది వైరల్ అయి, అటుఇటు తిరిగి చివరికి ట్రంప్ వద్దకు చేరింది. అతడి భక్తిని చూసి పరవశించిపోయిన ట్రంప్ ఈ నెల 19న ట్విట్టర్‌ ద్వారా తన సందేశాన్ని పంపారు. కోట్లాదిమంది భారతీయుల్లో క్రిష్ (కృష్ణ) తన ప్రాణ స్నేహితుడని అందులో పేర్కొన్నారు. త్వరలోనే అతడిని కలుస్తానని పేర్కొన్నారు. ట్రంప్ సందేశంతో కృష్ణ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ట్రంప్‌లోని ముక్కుసూటితనం, చురుకుదనమే తనను ఆయన భక్తుడిగా మార్చాయని కృష్ణ పేర్కొన్నాడు.