డిసిసి అధ్యక్షులతో రాహుల్ టెలికాన్ఫరెన్స్. – ఐటి సెల్ చైర్మన్ కు రాహుల్ ప్రశంసలు.

న్యూఢిల్లీ;

దేశం నలుమూలల్లోని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితిని, పార్టీ బలోపేతానికి తీసుకోవలసిన చర్యల గురించి డిసిసి అధ్యక్షుల నుంచి రాహుల్ అభిప్రాయాలు సేకరించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తిస్ గఢ్, తెలంగాణా, మిజోరాం రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో రాహుల్ మాట్లాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, సాధారణ ఓటర్లతో కూడా నేరుగా సంభాషించే ‘చార్మ్’ అప్లికేషన్ ను కామారెడ్డి జిల్లాకు చెందిన కె. మదన్ రూపొందించారు.ఆయన గతంలో జహీరాబాద్ నుంచి టిడిపి తరపున లోక్ సభకు పోటీ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ తెలంగాణ ఐటి సెల్ వ్యవహారాలను చూస్తున్నారు. దేశవ్యాప్తంగా కిందిస్థాయి పార్టీ శ్రేణులతో రాహుల్ గాంధీకి ఈ తాజా ‘అప్లికేషన్’ తో ‘కనెక్టివిటీ ఏర్పడుతుంది. ‘చార్మ్’ సాంకేతిక విధానం వల్ల కలిగే ప్రయోజనాలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గత నెలలో తెలంగాణలో రెండు రోజుల పర్యటనలో ప్రయోగాత్మకంగా పరిశీలించినపుడు ఆశ్చర్యపోయారు. మదన్ ను, ఆయనతో పనిచేస్తున్న సోషల్ మీడియా సిబ్బందిని టూరిజం ప్లాజా లో అభినందించారు. వెంటనే మదన్ ను ఢిల్లీకి ఆహ్వానించారు. కొద్దీ రోజుల కిందట అధునాతన సాంకేతిక అప్లికేషన్ ‘చార్మ్’ ద్వారా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వున్న కాంగ్రెస్ పోలింగ్ బూత్ స్థాయి బాధ్యులతో రాహుల్ గాంధీ సంభాషించారు. ఏకకాలంలో వేలాది మందితో మాట్లాడగలిగిన ‘సాంకేతిక వ్యవస్థను’ కనుగొన్నందుకు గాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి గురువారం తన నివాసంలో అభినందించారు. ఇలాంటి అధునాతన సాంకేతిక పోకడలు ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాజకీయ పార్టీ ప్రచారానికి, పార్టీ శ్రేణుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి దోహద పడతాయని రాహుల్ అన్నారు. ఢిల్లీలోని ఏఐసిసి కి కూడా ‘సాంకేతికపరమైన’ సేవలు అందించాలని మదన్ ను రాహుల్ కోరారు. ‘చార్మ్’ ను మరింత బలోపేతం చేయడానికి, దాన్ని జాతీయ కార్యాలయంలో విస్తరించడానికి చర్యలు చేపట్టాలని కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు సూచించారు.