ఢిల్లీకి రాష్ట్ర హోదా లేనట్టే!! – సుప్రీంకోర్టు.

న్యూఢిల్లీ:

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్ట్ పెద్ద షాకిచ్చింది. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం తోసి పుచ్చింది. రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చిన తర్వాత దీనిపై విచారణ అనవసరం అని వ్యాఖ్యానించింది. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వలేమని రాజ్యాంగ ధర్మాసనం గతంలో తీర్పు చెప్పింది.జస్టిస్ మదన్ బి లూకూర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాల ధర్మాసనం ముందు ఇవాళ పిటిషన్ విచారణకు వచ్చింది. జూలై 4న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని తిరిగి సమీక్షించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. గతంలో ఇచ్చిన తీర్పుపై పునర్విచారణ అనవసరం అని బెంచ్ విచారణను తిరస్కరించింది.

దేశంలోని ఏ ప్రదేశమైన రాష్ట్రంగా కానీ, కేంద్ర పాలిత ప్రాంతంగా కానీ ఉన్నాయి తప్ప ఢిల్లీ మాదిరిగా జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) లేదని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత రాజ్యాంగ వ్యవస్థే ఎన్సీఆర్ లో సరైన పరిపాలన లేకపోవడానికి కారణమని ఆరోపించారు. వాయు కాలుష్యం, ట్రాఫిక్ ఇబ్బందులు, నీరు నిలిచిపోవడం, అక్రమ కట్టడాలు దీని పర్యవసానాలేనని తెలిపారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇచ్చినట్టయితే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందన్నారు.