ఢిల్లీకి వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్.

న్యూఢిల్లీ:
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల భారత పర్యటన కోసం గురువారం సాయంత్రం న్యూఢిల్లీకి చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు భారత్-రష్యాల మధ్య జరిగే వార్షిక సమావేశంలో పాల్గొంటారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఎయిర్ పోర్ట్ లో పుతిన్ కు స్వాగతం పలికారు. పుతిన్ పర్యటనలో రెండు దేశాల మధ్య ఎస్400 మిస్సైల్స్ కొనుగోలు ఒప్పందంపై సంతకాలు జరగవచ్చు. రక్షణ రంగంతో పాటు భారత్, రష్యాల మధ్య అంతరిక్ష, ఇంధన రంగాలలో కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. రష్యా అధ్యక్షుడితో పాటు విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, భారీ సలహాదారుల బృందం కూడా వచ్చింది. రష్యా అధ్యక్షుడు ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చే విందుకు హాజరవుతారు. రేపు హైదరాబాద్ హౌస్ లో ఇరు నేతలు అధికారిక చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో ప్రపంచంలోనే అత్యుత్తమ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్ సిస్టమ్ గా పేరొందిన ఎస్-400 కొనుగోలు ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. దీంతో పాటు ఇతర రంగాలలో సహకారంపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరగవచ్చని భావిస్తున్నారు.