ఢిల్లీలో మమత మంత్రాంగం.

న్యూఢిల్లీ:
రాబోయే సార్వత్రిక ఎన్నికలపై ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీకి పోటీగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు జోరందుకున్నాయి. కొంత కాలంగా కొత్త ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యుపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, జేడీఎస్ అధినేత, మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశమయ్యేందుకు ఢిల్లీలో మకాం వేశారు. మమత ఈ సాయంత్రం వరుస భేటీలు జరుపనున్నారు. 5 గంటలకు సోనియా గాంధీతో, 6 గంటలకు దేవెగౌడ, 8 గంటలకు కేజ్రీవాల్ తో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 4 గంటల వరకు వివిధ ప్రతిపక్ష పార్టీల ఎంపీలను కలుసుకొని చర్చలు జరుపుతారు. మమతా బెనర్జీ మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వచ్చారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు అన్ని ప్రతిపక్షాలతో కలిసి కూటమిని ఏర్పాటు చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. సోనియాతో మమత సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆమె చర్చలు జరపకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.