తక్షణ సాయం 1200 కోట్లు; కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి.

అమరావతి;

తితలీ తుపాను కారణంగా అపార ఆస్తినష్టం నుంచి కోలుకోడానికి తక్షణ సాయంగా రూ.1,200 కోట్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ప్రాథమిక అంచ నా ప్రకారం రూ.2,800 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. పెనుతుఫాను తాకిడికి జనజీవనం అస్తవ్యస్తం అయ్యిందని, ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, కేంద్రం వేగంగా స్పందించి ప్రజలను ఆదుకోవాలన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో రోడ్లు, విద్యుత్‌ సరఫరా వ్యవస్థలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. దీంతో 2 జిల్లాల్లో జనజీవనం స్తంభించిందన్నారు. ”తుఫాను ఈనెల 11న ఈ రెండు జిల్లాలను తాకింది. గంటకు 165 కి.మీ. ప్రచండ వేగంతో గాలులు వీచాయి. దీనికి కుండపోత వర్షం తోడైంది. ఫలితంగా మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో పాటు పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. నష్టం రూ.2800 కోట్ల మేర ఉంటుందని ప్రాథమిక అంచనా. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. నేను జిల్లాలోనే ఉంటూ బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాను. తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన రాష్ర్టాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. పెను తుఫాను మిగిల్చిన నష్టాలను పూడ్చి, ప్రజల కష్టాలను కొంతమేరైనా తగ్గించి ఉపశమనం కలిగించేందుకు ఉదారంగా, వేగంగా స్పందించాలి ” అని సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు.