తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం: పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌ రెడ్డి .

హైదరాబాద్:

అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌ రెడ్డి అన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో జయశంకర్‌ భూపాలపెల్లి, జగిత్యాల జిల్లాల్లో పర్యటించారు. భూపాలపెల్లిలో గాంధీనగర్‌, మహదేవ్‌పూర్‌ మండలంలోని సూరారం, జగిత్యాల జిల్లాలో ధర్మపురి మండలం బుగ్గారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు, రవాణా, గోనె సంచులు వంటి అంశాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. తడిసిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో రైతులు ఆందోళన పడవల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి పూర్తిగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కొనుగోలు ప్రక్రియను కూడా వేగవంతం చేశామన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైసు మిల్లులకు తరలిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు.