తప్పుడు ఓటర్ల జాబితా రూపొందించిన కాంగ్రెస్ పై చర్యలు!! – సుప్రీంకోర్టును కోరిన ఈ.సీ.

ప్రకాశ్, న్యూఢిల్లీ:
న్యాయస్థానాన్ని తప్పు దారి పట్టించేందుకు ప్రయత్నించినందుకు కాంగ్రెస్ పార్టీని శిక్షించాలని ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్ట్ ని కోరింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల ఓటర్ల జాబితాలో పేర్లను నకలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ కల్పిత ఓటర్ల లిస్ట్ తయారు చేసినందుకు ఆ రాష్ట్రాల కాంగ్రెస్ నేతలైన కమల్ నాథ్, సచిన్ పైలెట్లపై కేసు పెట్టాలని పేర్కొంది. మధ్యప్రదేశ్ ఓటర్ల జాబితాలో 60 లక్షల నకిలీ పేర్లు ఉన్నట్టు గుర్తించానని కమల్ నాథ్ వాదిస్తున్నారు.రాబోయే ఎన్నికల కోసం మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో ఓటర్ల పేర్లు నకలు చేశారని ఆరోపిస్తూ కమల్ నాథ్, సచిన్ పైలెట్ సుప్రీంకోర్ట్ లో పిటిషన్ వేశారు. దీనిపై వివరణ ఇవ్వాలన్న కోర్టు సూచనపై స్పందిస్తూ ‘తప్పుడు ఓటర్ల జాబితా తయారు చేసినందుకు కాంగ్రెస్ నేతలను శిక్షించాలని’ ఈసీ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. కాంగ్రెస్ మాత్రం తమ దగ్గర ఉన్న జాబితాలే ఎలక్ట్రానిక్ మీడియా, ఇతరుల వద్దా ఉన్నాయని తెలిపింది. ఈసీ నకిలీవని చెబుతున్న లిస్టునే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కు సీడీల రూపంలో అందజేశారని చెప్పింది.
కాంగ్రెస్ వాదనను ఎన్నికల సంఘం తోసి పుచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన జాబితాల్లో ఫోటోలు, పేర్లు అసత్యమని తెలిపింది. ఓ మారు కాంగ్రెస్ దగ్గరున్న జాబితాలను పరిశీలించాలని సుప్రీంకోర్ట్ ఈసీకి సూచించింది. ఈ కేసు తిరిగి సోమవారం విచారణకు రానుంది.