తమిళనాడు లో కాల్పులు.11 మంది మృతి.

చెన్నై:
తమిళనాడులోని తూత్తుకుడిలో తమ జీవితాలను నాశనం చేస్తున్న స్టెరిలైట్‌ కంపెనీని మూసివేయాలంటూ నిరసన ప్రదర్శన చేసిన‌ వేలాదిమంది ప్రజలపై పోలీసులు కాల్పులు జరపడంతో 11 మంది మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.వేదాంత సంస్థ 1996లో స్టెరిలైజ్ ప‌రిశ్ర‌మ ప్రారంభించిన‌ప్ప‌టి నుంచీ భూగ‌ర్భ జ‌లాలు క‌లుషిత‌మ‌వుతున్నాయినీ, ప్ర‌జ‌ల‌కు శ్వాస సంబంధ‌మైన ఇబ్బందులు త‌లెత్త‌డంతో పాటు మ‌రిన్ని స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న‌ట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆ కంపెనీకి వ్యతిరేకంగా స్థానికులు చాలా కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎన్ని ఆందోళనలు నిర్వహించినా అటు కంపెనీ కానీ ప్రభుత్వం కానీ పటించుకోలేదు పైగా కంపెనీని విస్తరించేందుకు కుట్రలు ప్రారంభించారు. దాంతో మూడు నెలలుగా స్థానికులు కొంత కాలంగా తమ ఆందోళనలను తీవ్రం చేశారు. ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు ఈ రోజు కలక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చాయి. దాదాపు 20 వేల మంది ప్రజలు కలక్టర్ కార్యాలయం ముందు శాంతి యుతంగా ప్రదర్శన నిర్వహిస్తుండగా వేదాంత సంస్థకు అండగా అక్కడ మోహరించిన 4 వేల మంది పోలీసులు ఆందోళనకారులపై విరుచుకపడ్డారు. లాఠీచార్జ్ చేయడంతో ప్రజలు తిరగబడ్డారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పలు వాహనాలకు నిప్పటించారు. పోలీసులు ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోగా 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసు కాల్పులపై తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. కార్మిక సంఘాల పిలుపు మేర‌కు తూత్త‌కుడి ప‌ట్ట‌ణంలో దుకాణాలు మూసివేసి స్వ‌చ్ఛందంగా బంద్ పాటించారు. ప్రభుత్వ తీరును రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని రెచ్చగొట్టేవిధంగా ఆంక్షలు విధించి వారిపై అమానుషంగా దాడి చేయడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. సంఘటనా స్థలం వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు పోలీసులు భారీగా మోహరించారు.