తూముకుంట నర్సారెడ్డి రాజకీయ విలాపం. గజ్వేల్ రాజకీయం గరం గరం.

ఎస్.కే. జకీర్.

గ‌జ్వేల్ మాజీ ఎమ్మెల్యే న‌ర్సారెడ్డి టీఆర్ఎస్ ను ఎందుకు వీడవలసి వచ్చింది? ఏ నాయ‌కుడైనా… ఏపార్టీలో ఉన్నా, ఆ పార్టీలో త‌న‌కంటూ ఓ హోదా కోరుకుంటారు. పైగా ఓసారి ఎమ్మెల్యేగా చేసిన వ్య‌క్తి అందులోనూ… ఎలాంటి రాజ‌కీయ నేప‌థ్యం లేకున్నా, గ్రామ వార్డు మెంబ‌ర్ నుండి స‌ర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, పీఎసీఎస్ చైర్మ‌న్, మెంబ‌ర్, డీసీసీబీ డైరెక్ట‌ర్, డీసీసీబీ చైర్మ‌న్ ఇట్లా… ఒక్కో మెట్టు ఎక్కుతూ, త‌న రాజ‌కీయ జీవితాన్ని నిర్మించుకున్న వ్యక్తి హ‌ఠాత్తుగా సీఎం నియోజ‌క‌వ‌ర్గంలో ఎందుకు పార్టీ మారారు, ఎందుకు ప్ర‌తిప‌క్ష పార్టీకి జైకొట్టాల్సి వ‌చ్చింది… అస‌లు తెర‌వెనుక ఏం జ‌రిగింది? 2014 ఎన్నిక‌ల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా న‌ర్సారెడ్డి కాంగ్రెస్ నుండి, టీడీపీ నుండి ప్ర‌తాప్ రెడ్డి బ‌రిలోకి దిగారు. టీఆరెఎస్ నుండి తొలిసారిగా కేసీఆర్ బ‌రిలో ఉన్నారు. త్రిముఖ పోరులో కేసీఆర్ గెలుపు కష్టమని కొన్ని సర్వేలు తెలిపాయి. టీడీపీ అభ్యర్థి ప్ర‌తాప్ రెడ్డి విజయావకాశాల గురించి ప్రచారము జరిగింది. దాంతో రాత్రికి రాత్రే కేసీఆర్, హరీశ్ రావు చ‌క్రం తిప్పారు. టీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ సీఎం అవుతారు, కాబ‌ట్టి త‌మ‌కు స‌హ‌క‌రించాలంటూ పోలింగ్ కు ముందే నర్సారెడ్డితో చ‌ర్చ‌లు జ‌రిపారు. దీంతో న‌ర్సారెడ్డి త‌న‌కు వేయ‌కున్నా ప‌ర్వాలేదు, కేసీఆర్ కు ఓటేయండి అని చెప్ప‌టంతో కేసీఆర్ 17వేల మెజారిటీతో బ‌య‌ట‌ప‌డ్డారు. ఆ ఎన్నిక‌ల్లో మూడో స్థానానికి ప‌రిమితం అయిన న‌ర్సారెడ్డికి 18 వేల‌కు పైగా ఓట్లు వ‌చ్చాయి. న‌ర్సారెడ్డి చివ‌రి మూడు రోజుల్లో మ‌రింత దూకుడుగా ప్ర‌చారం చేస్తే, కేసీఆర్ మెజారిటీ బాగా తగ్గి ప్ర‌తాప్ రెడ్డి గెలిచే వారన్న ప్రచారం సాగింది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. నర్సారెడ్డిని ప‌ట్టించుకోలేదు. పైగా గ‌జ్వేల్ అన్నీ తానే అయి చూసే హ‌రీష్ రావు కూడా న‌ర్సారెడ్డిని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశారన్న విమర్శలు వచ్చాయి.

న‌ర్సారెడ్డికి ఉన్న ఆద‌ర‌ణ దృష్ట్యా ఆర్డీసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. పేరుకే చైర్మ‌న్ ప‌ద‌వి, త‌న వ‌ర్గానికి న్యాయం చేయ‌లేక‌పోతున్నాన‌ని ఎన్ని సార్లు మొత్తుకున్నా తన ప‌ట్ల క‌నిక‌రం చూప‌లేద
న్నది నర్సారెడ్డి ఆరోపణ.సీఎం కేసీఆర్ ను ఎన్ని సార్లు ఆయన క‌లిసేందుకు ప్ర‌య‌త్నించినా ఫ‌లించ‌లేదు. ఇద్ద‌రివీ ప‌క్క ప‌క్క ఫాం హౌజ్ లే అయినా కేసీఆర్ న‌ర్సారెడ్డిని ద‌గ్గ‌ర‌కు రానియ్య‌లేదని నర్సారెడ్డి మద్దతు దారులు అంటున్నారు. హ‌రీష్ కు న‌ర్సారెడ్డి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా క‌నీసం ఒక్క స‌బ్సిడీ ట్రాక్ట‌ర్ కూడా ఇప్పించుకోలేని నిస్స‌హ‌య‌స్థితిలోకి నర్సారెడ్డి వెళ్లిపోయారు. ఒక‌ప్పుడు వైఎస్, కిర‌ణ్ లు సీఎంలుగా ఉన్న రోజుల్లో త‌న హ‌వా ఎలా ఉండేది, ఇప్పుడేలా అయిపోయింద‌ని నర్సారెడ్డి కుమిలిపోయారు.చేసేదేమి లేక‌, లోకల్ గా ప్ర‌తాప్ రెడ్డి వ‌ర్గంతో పోరాడుతూ వచ్చారు.
పైగా వెంట వ‌చ్చిన త‌న అనుచ‌రుల‌కు అందంలం ఎక్కిస్తూ తనను ప‌క్క‌న పెట్ట‌డాన్ని ఆయ‌న భ‌రించ‌లేక‌పోయారు. ఎన్నాళ్లు టీఆరెస్ లో కొనసాగిన రాజకీయంగా ఎలాంటి పురోగతి ఉండదని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.న‌ర్సారెడ్డి రోడ్డు ప్ర‌మాదంలో తీవ్ర గాయాల‌పాల‌య్యారు. ఇంగ్లాండ్ వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ప్ర‌తిరోజు త‌న ఇంటిముందు నుండే హ‌రీష్ సిద్దిపేట‌కు వెళ్తారని, కేసీఆర్ ఆయ‌న అనుచ‌రులు ఫాంహౌజ్ కు వెళ్తారని, క‌నీసం ప‌రామ‌ర్శ‌కు కూడా వాళ్ళు రాక‌పోవ‌టంతో న‌ర్సారెడ్డి అవ‌మానభారంతో కుంగిపోయారని ఆయ‌న అనుచ‌రులు వెల్ల‌డిస్తున్నారు. క‌నీసం ఫోన్ లో కూడా ప‌రామ‌ర్శించే స్థాయి తనకు లేదా అంటూ నేరుగా హ‌రీష్ రావును మొఖం మీదే అడిగేశారు. అప్ప‌టికే న‌ర్సారెడ్డి అసంతృప్తిని గ్ర‌హించిన కాంగ్రెస్ నేత‌లు ఆయ‌న‌తో ట‌చ్ లోకి వ‌చ్చారు. పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ రెండు సార్లు ఫోన్లో, ఒసారి స్వ‌యంగా న‌ర్సారెడ్డి ఇంటికి వ‌చ్చి ప‌రామ‌ర్శించారు. విజ‌య‌శాంతి కూడా న‌ర్సారెడ్డిని కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది.

అయినా సీఎంవో అధికారుల‌తో పాటు, ఎంపీ సంతోష్ తో తాను సీఎంను క‌ల‌వాలని విజ్ఞప్తి చేశారు.గ‌జ్వేల్ లో పార్టీ ప‌రిస్థితి బాగా లేదని చెప్పే ప్ర‌య‌త్నం చేసినా ఫ‌లించ‌లేదు. “నాకు సీఎంను క‌ల్పించండి, అంత‌కుమించి నాకు ఏ ప‌ద‌వి అవ‌స‌రం లేదు, అడ‌గ‌ను. సీఎంను క‌ల్పిస్తే… కేసీఆర్ కోసం మ‌ళ్లీ తిరుగ‌తా” అంటూ నర్సారెడ్డి కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. నాలుగు రోజుల్లో క‌ల్పిస్తా కేసీఆర్ అప్పాయింట్ మెంట్ ఇప్పిస్తానని హామీ ఇచ్చిన హ‌రీష్, ఆ త‌ర్వాత మెఖం చాటెసినట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. టీఆర్ఎస్ లో చేరి త‌ప్పుచేశాన‌ని న‌ర్సారెడ్డి బాధ‌ప‌డేవార‌ని ఆయ‌న ద‌గ్గ‌రి అనుచ‌రులంటున్నారు. త‌న కూతురు మెడిక‌ల్ సీటు విష‌యంలో కేసీఆర్ సంతోష్
కు చెప్పాడు. సీటు ప‌క్కా అని హ‌మీ ఇచ్చాడు. కానీ సంతోష్ ప‌నిచేలేదని తెలుస్తోంది. “వ‌చ్చే సంవ‌త్స‌రం చేస్తా” అని హమీ ఇవ్వ‌టంతో, ఓ సంవ‌త్స‌రం వృదా అయినా వెయిట్ చేశాడు. కానీ రెండో సంవ‌త్స‌రం కూడా అలాగే చేస్తా సీఎంకు చెప్పొద్దంటూ సంతోష్ అన్నట్లు సమాచారం. త‌న బిడ్డ చ‌దువులు పాడ‌వుతున్నాయ‌ని, విదేశాల‌కు పంపించి, చ‌దివిస్తున్నాన‌ని న‌ర్సారెడ్డి బాధ‌ప‌డేవారని ఆయ‌న అనుచ‌రులు వాపోతున్నారు. నర్సా రెడ్డి టీఆరెస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరడంతో గ‌జ్వేల్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోవచ్చు.