తెలంగాణలో నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్: 
నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేగాక ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అలాగే వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది వచ్చే 48 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో జోరుగా వర్షం కురుస్తోంది. లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో శుక్రవారం తెల్లవారుజామునుంచి వర్షం కురుస్తోంది.