తెలంగాణలో మహాకూటమి జెండా ఎగురుతుంది..

హైదరాబాద్‌;

తెలంగాణలో మహా కూటమి జైత్రయాత్ర ప్రారంభమవుతుందని టిటిడిపి చీఫ్‌ ఎల్‌.రమణ వ్యాఖ్యానించారు. ఎలాంటి కారణాలు లేకుండా కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేశారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ని గద్దె దించేందుకు ప్రజలు కోరితేనే మహాకూటమి ఏర్పాటైందన్నారు. కూటమి తొలి జెండా జగిత్యాల గడ్డ మీద ఎగురవేస్తామని రమణ చెప్పారు. రూ.40 వేల కోట్ల రాఫెల్‌ వివాదంపై కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోడీతో కేసీఆర్ రహస్య ఒప్పందానికి ఇదే నిదర్శనమని మంగళవారం జగిత్యాలలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆరోపించారు. పేదవాళ్ల కాలిలో ముల్లు గుచ్చుకొంటే పంటితో తీస్తానని చెప్పి కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది చనిపోతే సీఎం కనీసం చూడటానికైనా రాలేదని విమర్శించారు.

ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలేవీ అమలు చేయలేదని ఆరోపించారు. దళితుడిని తొలి ముఖ్యమంత్రిగా చేస్తామని కేసీఆర్ మాట మార్చారని విమర్శించారు. కమిషన్ల కోసం మిషన్ భగీరథ మొదలు పెట్టారన్నారు. బడుగు బలహీన వర్గాల కోసమే స్వర్గీయ ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఎల్‌.రమణ గుర్తు చేసుకొన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు టీడీపీ ఎనలేని కృషి చేసిందన్నారు. హైదరాబాద్ లో ధర్నాలు ఉండవని చెప్పిన కేసీఆర్, రాష్ట్రంలో ధర్నాలు జరిగేలా చేశారని ఆరోపించారు.