తెలంగాణలో సోనియా టూర్ గజ్వేల్‌లో బహిరంగ సభ.

హైదరాబాద్:
ముందస్తు ఎన్నికల ప్రభావంతో రాజకీయాలు వాడీవేడీగా సాగుతున్నాయి. బలంగా ఉన్న అధికార పార్టీని దెబ్బకొట్టాలని, ముందస్తు ఎన్నికల ప్రచారానికి టీకాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తోంది. తెలంగాణపై టీ కాంగ్రెస్ సీరియస్‌గా దృష్టి సారించింది.ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీని బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేసింది. ముందుగా యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీని నెలాఖరున తెలంగాణలో పర్యటించేలా టీకాంగ్రెస్ ప్రణాళిక రచిస్తోంది.సూర్యాపేట లేదా గజ్వేల్‌లో ఎన్నికల ప్రచార సభను నిర్వహించనున్న నేపథ్యంలో ఆయా జిల్లాల నాయకులతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి గాంధీభవన్‌లో చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లో సోనియాగాంధీ బహిరంగ సభ పెట్టాలా లేక మెదక్ జిల్లాలోని వేరే ప్రాంతంలో పెట్టాలా అని నాయకులను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. అయితే కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లో సభ పెడితే కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేసినట్లు సమాచారం.