తెలంగాణలో ‘స్పెషల్ ఛబ్బీస్’!!

ఎస్.కె.జకీర్.
2013 లో విడుదలైన హిందీ సినిమా ‘స్పెషల్ ఛబ్బీస్’ సూపర్ డూపర్ హిట్ అయింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠను రేపుతుంది. అక్షయ్ బృందం నకిలీ ఇన్ కం ట్యాక్స్ అధికారులుగా అవతారమెత్తి దేశంలోని పలు రాష్ట్రాల్లో పట్టపగలే దర్జాగా ‘దోపిడీల’కు పాల్పడుతుంది. ‘వెడ్నెస్ డే’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన నీరజ్ పాండే ‘స్పెషల్ చబ్బీస్’ ను కూడా వినూత్న తరహాలో తెరకెక్కించారు. ఈ సినిమా ప్రస్తావన తాజాగా తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్నది. ఇదే సినిమా తరహాలో ఒక నకిలీ ఐ.టి. అధికారుల బృందం నాగోల్ లోని రణధీర్ రెడ్డి ఇంట్లోకి జొరబడి సోదాలు జరిపింది. నకిలీ అధికారులు రణధీర్ ఇంట్లో లభించిన నగదు, బంగారం, మొబైల్ ఫోన్లు… అన్నింటినీ తీసుకెళ్ళిపోయింది. ఈ ఘటన ఆదివారం జరిగింది. వారందరు అసలు ఐ.టి. అధికారులుగానే భావించినట్టు రణధీర్ రెడ్డి చెబుతున్నాడు. ఆదివారం తాము ఎక్కడా, ఎలాంటి సోదాలు జరపలేదని ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్పష్టం చేయడంతో రణధీర్ రెడ్డి కుటుంబసభ్యులు, ఆయన బంధువులు లబోదిబో మంటున్నారు. పైగా ఒకరు కాదు, ఇద్దరు కాదు , మొత్తం 20 మంది వ్యక్తులు తాము ఐ.టి. అధికారులమని చెప్పుకోవడం, ఐ.టి. అధికారుల లాగా ఇంట్లోకి రాగానే మొబైల్ ఫోన్లన్నీ తీసుకోవడం, దర్జాగా సోదాలు జరపడం వల్ల ఎలాంటి అనుమానం రాలేదని రణధీర్ అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటిపై ఇ.డి, ఐ.టి. పేరిట రెండు రోజుల పాటు సోదాలు జరిగినప్పుడే ఆయన బంధువులు, స్నేహితులు అయినా కొండల్ రెడ్డి, ఉదయ సింహ, సెబాస్టియన్ తదితరుల ఇళ్ళు, ఆస్తుల పైన కూడా దాడులు జరిగాయి. ఐ.టి. అధికారుల నోటీసు మేరకు సోమవారం నాడు ఉదయసింహ, సెబాస్టియన్, కొండల్ రెడ్డి బషీర్ బాగ్ లోని ఐటీ కార్యాలయానికి వచ్చారు. ఆదాయపు పన్ను అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ‘స్పెషల్ ఛబ్బీస్’ ఉదంతం చవిచూసిన రణధీర్ రెడ్డి ఉదయసింహ కు బావమరిది. రణధీర్ రెడ్డి ఇంట్లో సోదాలకు ఐ.టి. శాఖ అధికారులు, ప్రభుత్వం బాధ్యత వహించాలని ఉదయసింహ డిమాండ్ చేశారు. ఈ ఘటన పై సమగ్ర దర్యాప్తు జరపవలసి ఉందన్నారు. ఉదయసింహ డిమాండ్ సంగతెలా ఉన్నా నిజంగానే రణధీర్ రెడ్డి ఇంట్లో ‘నకిలీ ఐ.టి’ అధికారులు సోదాలు జరిపి ఉంటె, అటువంటి వారిని వెంటనే పట్టుకోని పక్షంలో హైదరాబాద్ వంటి ధనిక నగరంలో, తెలంగాణ వంటి ధనిక రాష్ట్రంలో ఇలాంటి ‘వైట్ కాలర్ ‘ ఘరానా దోపిడీలు సులువుగా జరుగుతాయి.