తెలంగాణలో 34 అసెంబ్లీ సీట్ల పెంపు. హోంశాఖ పరిశీలన.

ప్రకాశ్, న్యూఢిల్లీ:

ఎంతో కాలంగా తమ అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంచాలని కోరుతున్న రెండు తెలుగు రాష్ట్రాలు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొర కేంద్రానికి వినిపించింది. అసెంబ్లీ స్థానాల ప్రతిపాదనను కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ పరిశీలనకు స్వీకరించింది. ప్రజాప్రాతినిథ్య చట్టంలో తగిన సవరణలు చేసి ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్ ఆమోదం పొందగలిగితే ఏపీలో 50, తెలంగాణలో 34 సీట్లు పెరుగుతాయి. అసెంబ్లీ స్థానాల పెంపునకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కి పార్లమెంట్ సవరణలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం 2021 జనాభా గణన జరిపి 2026లో ప్రచురించిన తర్వాత మాత్రమే అసెంబ్లీ స్థానాల పెంచే వీలుంది. అసెంబ్లీ స్థానాలను పెంచితే రెండు రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ స్థానాలను గుర్తించాల్సిందిగా హోం శాఖ ఎన్నికల సంఘాన్ని కోరింది. అయితే ఈ పెంపుదల కేవలం అసెంబ్లీ స్థానాలకే పరిమితం కానుంది. లోక్ సభ స్థానాలు యధాతథంగా కొనసాగుతాయి.