తెలంగాణారాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కల్వకుంట చంద్ర శేఖర్ రావుగారికి,

మూడున్నర కోట్ల మంది అహర్నిశలు పోరాడి, జీవితాలను త్యాగం చేసి తెచ్చుకున్న రాష్ట్రంలో విభజన సమస్యల పరిష్కారం కోసం ఏనాడూ పట్టించుకోని మీరు కుంభకర్ణుడు నిద్రలేచినట్లు నాలుగేళ్ల తరువాతైనా ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారికి సమస్యల చిట్టాను సమర్పించడం సంతోషకరం. నాల్గు నెలల్లో సాధించాల్సిన వాటిని కోసం ఇంత ఆలస్యంగా నలుబైఎనిమిది నెలల తరువాత మీకు మెలకువ రావడం బాధాకరం. పోనీ ఇన్నాళ్లకైనా ప్రజాసమస్యలను ప్రస్తావిస్తారని ప్రజలంతా వేయికళ్లతో ఎదురుచూస్తుంటే.. మీరేమో ప్రధాన సమస్యలను గాలికొదిలి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రధాన ఎజెండా గా తీసుకెళ్లాలని భావించడం మరింత దురదృష్టకరం. రాష్ట్ర ఏర్పాటు సమయంలో గత యూపీఏ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో అనేక కొత్త సంస్ధల ఏర్పాటును రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన్రు. అలాంటి వాటిలో ప్రధానంగా బయ్యారం ఉక్కు కర్మాగారం, ఖాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, ఉద్యాన విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం, వెనుకబడిన ప్రాంతాలకు జాతీయరహదారులతో అనుసంధానం లాంటి ముఖ్యమైన పనులను మీరు ఏమాత్రం పట్టించుకోకుండా.. అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలకు విలువ ఇవ్వకపోవడం మీ చిత్తశుద్దిని బహిర్గత పరుస్తుంది.ఇక మీరు ప్రధాని ముందు పెట్టిన పది అంశాల్లో ఐటీ ఐఆర్ విషయానికొస్తే..2013 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం 5లక్షల కోట్ల పెట్టుబడులు, 50 లక్షలమందికి ఉపాధి కల్పించే మహత్తర ప్రాజెక్ట్ ను తెలంగాణాకు కేటాయించింది. కాని మీరు అధికారంలోకి వచ్చాక మోడీ ప్రభుత్వం ప్రకటించిన మేకిన్ ఇండియా కు వత్తాసు పలికి తెలంగాణాకు వరప్రసాదం లాంటి ఐటీఐఆర్ ను పక్కన బెట్టిన్రు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను నిర్లక్ష్యం చేయ్యెద్దని విపక్షం గా మేము ఎన్నిమార్లు నినదించినా మీరు పట్టించుకున్నపాపాన పోలేదు. పైగా మీరు, మీ కొడుకు రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కల్వకుంట తారకరామారావు, మీ బిడ్డ ఎంపీ కల్వకుంట కవిత ప్రధాని మోడీని, ఇతర కేంద్ర మంత్రులను ఎన్నోమార్లుకలిసినా ఏనాడూ ఐటీఐఆర్ కోసం మాట్లాడిన పాపాన పోలేదు. కాని ఐటీ పేరిట వచ్చే అవార్డులకు మాత్రం తగుదునమ్మా అంటూ ఫోటోలకు ఫోజులిస్తూ, దేశ విదేశాల్లో ఐటీ ఘనతేదో మీరే సాధించినట్లు ప్రచారం చేసుకుంటున్రు. నిజానికి గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో చేపట్టిన నిర్ణయాలే వల్లే ఇవాళ ఐటీ రంగం అభివృద్దికి కారణమన్న కనీస ఆలోచన మీకు లేకపోవడం శోచనీయం. ఇక ఇన్నాళ్లూ మౌనంగా ఉండి, దాదాపు అటకెక్కించిన ఈ ప్రాజెక్ట్ గురించి నాలుగేళ్ల తర్వాత హఠాత్తుగా మీకు గుర్తుకు రావడం ఒకింత ఆశ్చర్యం కలిగించినా.. ఇదంతా రాబోయే ఎన్నికల కోసం మీరు వేస్తున్న స్టంట్(జిమ్మిక్కులని) అని తెలియనంత అమాయకులు తెలంగాణా ప్రజలు కారని తెలుసుకోండి.ఉద్యమ సమయంలో ” బయ్యారం ఉక్కు తెలంగాణా హక్కు” అంటూ మూడున్నర కోట్ల మంది తెలంగాణా ప్రజలు ఉద్యమ సమయంలోనినదించిన బయ్యారం ఉక్కుకర్మాగారం కూడా కేవలం మీ నిర్లక్ష్యం వల్లే సాధ్యం కాలేదు. రాష్ట్రం ఏర్పడ్డాక ఆరునెలల్లోపు ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలని వత్తిడి చేయాల్సిన మీరు ఆదిశగా చేపట్టిన కార్యాచరణ శూన్యం. బయ్యారంలో ఉక్కుకర్మాగారం నిర్మాణం లాభసాటి కాదని అందుకే దాన్ని ఏర్పాటు చేయలేమని కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్ధానానికి లిఖిత పూర్వకంగ నివేదించిందనే విషయం మీరు ప్రదానితో సమావేశం కావడానికి ముందుగానే మీడియాలో ప్రధానంగా వచ్చినా మీరు మోడీ మోచేయి నీళ్లుతాగుతూ కూర్చున్నారే తప్ప హక్కుగా రావాల్సిన విషయంపై నిలదీసే ప్రయత్నం చేయలేదు. రైల్వే లైన్లను గురించి ఏదో సాధించినమని చెబుతున్న మీకు గత యూపీఏ హయాంలో కేటాయించిన ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వడం లేదని అడిగే తీరువాటం లేక పోవడం మీ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం గా ఆరునెలల్లో పరిశీలన జరిగి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన కోచ్ ఫ్యాక్టరీ అంశాన్ని మీరెందుకు కావాలని మరుగున పడేస్తున్నరో ప్రజలకు చెప్పండి.పునర్విభజన చట్టం ప్రకారంగా ఇప్పటికే ఏర్పాటు కావాల్సిన గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణానికి ఇంత వరకు స్ధలసేకరణ జరపలేదు. నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరయినా విడుదల కాలేదు. ప్రధానితో సమావేశం సందర్భంగా ఈ విషయం కూడా గుర్తుకు రాకపోవడం అత్యంత ఆక్షేపణీయం. కల్లబొల్లి మాటలతో గిరిజన బిడ్డలను కలవరపరుస్తున్న మీ మాటలపట్ల మీకున్న చిత్తశుద్దికి మీ భేటీ నిదర్శనం కాదా..ఎన్నికల్లో నన్ను గెలిపించండి నాలుగునెలల్లో 12 శాతం రిజర్వేషన్లు తెచ్చి చూపిస్తా అంటూ ముస్లీం మైనార్టీలను మోసగించి గాలి మాటలు మాట్లాడి అందల మెక్కిన మీరు నాలుగేళ్లు పూర్తవుతున్నా ఎందుకు ఆ అంశాన్ని మరుగుపరిచిన్రో వెల్లడించండి. అమాయక గిరిజన, ముస్లీం మైనార్టీ వర్గాల వారి రిజర్వేషన్ల పెంపు అంశంలో మీరు చెప్పిన మాటలకు.. మీ చేతలకు పొంతన లేదనే విషయం ప్రధానితో మీ సుధీర్ఘ భేటీ ద్వారా తేటతెల్లమయింది. గిరిజనులకు మీరే రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం ఉన్నా..ఇవ్వకుండా 9 వ షెడ్యూళ్లో పొందు పరిచి రాజ్యాంగ సవరణ అవసరమైన ముస్లీం మైనార్టీ రిజర్వేషన్లను ఒకే గాటన కట్టి బిల్లు తయారు చేయడం సరైంది కాదని న్యాయకోవిదులు ఘంటాపధంగా చేసిన సూచనను పక్కకునెట్టి నియంతృత్వ నిర్ణయం తీసుకుండ్రు. ఒకవేళ 6 శాతం ఉన్నగిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి , 4 శాతం ఉన్న ముస్లీం మైనార్టీ రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతూ మీరు తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించని పక్షంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని, పోరాడుతామని,మెడలు వంచైనా రిజర్వేషన్లు సాధించితీరుతామని ఉత్తర ప్రగల్భాలు పలికిన మీరు, మీ ఎంపీలు ఏ ఒక్క నాడూ పోరాడకుండా కనీస ప్రస్తావన తేకుండా ఎలా సాధిస్తారో చెప్పండి. అధికారంలోకి వచ్చిన నాలుగు నెల్లలోపు తెచ్చి చూపిస్తానన్న ముస్లీం మైనార్టీ రిజర్వేషన్లు మూడేళ్లు నిద్రపోయి మళ్లీ ఎన్నికల ముంచుకొస్తున్న వేళ మరో మారు ఎన్నికల్లో లబ్ది పోందేందుకు తూతూ మంత్రంగా కేంద్రం ఇవ్వదని తెలిసీ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించి చేతులు దులుపేసుకున్రు. అంతే తప్ప గిరిజన, ముస్లీం మైనార్టీ రిజర్వేషన్ల పెంపునకు మీరే చిత్త శుద్ది లేదని తేలిపోయింది.రాష్ట్రంలో 22 శాతం మంది ప్రజలు ఎదిరిచూస్తున్న ఈ అంశాన్ని బుట్టదాఖలు చేసి పైగా ఆ వర్గాల ప్రజలకేదో చేస్తున్నమన్నట్లు హంగామా చేస్తున్రు. మీ నిర్వాకం వల్ల గడిచిన ఈ మూడేళ్లలో 10 శాతం రిజర్వేషన్లు అందక గిరిజనులు ఎన్నో ప్రయోజనాలను నష్టపోయారు. అమాయక ముస్లీం మైనార్టీలు మీ హామీల తో దారుణంగా మోసపోయారు. మరో ఏడాదిలో రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మరోమారు నిట్టనిలువునా మోసగించేందుకు మీరు చేస్తున్న కుటిల యత్నాలను నిశితంగా గమనిస్తున్నరు.

2014 -15 నుంచి 2018 -19 వరకు వరుసగా కరువు, ప్రకృతి వైపరిత్యాల కారణంగా నష్టపోతున్న తెలంగాణా రైతాంగానికి సంబంధించిన నష్ట నివేదికలను కేంద్రం బుట్టదాఖలు చేసి ఒక్క నయాపైసా పరిహారాన్ని కూడా విదల్చకున్నా…మీరు ఆవిషయాన్ని ప్రస్తావించకుండా గంటన్నరపాటు ఏమాట్లాడారో ఏ ప్రయోజనాన్ని ఆశించారో వెల్లడించండి. ప్రధాని రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో మీకేం కావాలని స్వయంగా అడిగితే మాకు మీ ప్రేమాభిమానాలు తప్ప ఇంకేమీ వద్దని చెప్పిన మీరు రాష్ట్ర ప్రయోజనాలను గురించి ప్రధానితో మాట్లాడుతారని అనుకోవడం భ్రమే అవుతుంది.
నిన్నటి దాకా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మాట్లాడి ఆయనపై అవాకులు చెవాకులు మాట్లాడి, జాతీయ నాయకుడినౌతానని బీరాలు పలికిన మీరు ఎకాఎకిన ప్రధానితో గంటన్నర పాటు ఏకాంతంగా మాట్లాడడం వెను క ఆంతర్యం కేవలం మీ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి తప్ప రాష్ట్ర ప్రయోజనాలువిషయంలో మీకు ఏమాత్రం చిత్తశుద్ది ఉండదనేది సుస్పష్టం. నిరంతరం ప్రజలపక్షంగా ఉంటూ, నిజాయితీ గల విపక్షంగా ప్రజల పక్షాన మేము అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
1. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు , ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ల పెంపును ఆమోదిస్తూ కేంద్రానికి పంపిన బిల్లు ఏమైంది. ఇప్పుడు అది ఏ స్ధాయిలో ఉంది ?
2. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు పెంచే అవకాశం మీకే(రాష్ట్రానికే) ఉన్నాకూడా అదిచేయకుండా కేంద్రానికి పంపించడంలో ఆంతర్యం ఏమిటి ?
3. ఓవైపు ముస్లీంలకు రంజాన్ ఇఫ్తార్ విందులు ఇస్తూ వారిని మభ్యపెడుతూ.. మరో వైపు వారికి ఇస్తానన్న రిజర్వేషన్ ల గురించి ప్రధానితో కనీసం మాట్లాడక పోవడం దేనికి సంకేతం?
4. ముస్లీం మైనార్టీ రిజర్వేషన్లు పెరగాలని మీరు కోరుకుంటే ఆ అంశాన్ని ప్రధానితో ప్రత్యేకంగా గంటన్నర పాటు సమావేశం సందర్భంగా ఎందుకు ప్రస్తావించలేదు ?
5. లక్షల కోట్ల పెట్టుబడులు, మరియు పరోక్షంగా, ప్రత్యేక్షంగా 50 లక్షలమంది సాఫ్ట్ వేర్ నిపుణులకు ఉపాధినిచ్చే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ గురించి ముఖ్యమంత్రి ఉన్న మీరు. సంబంధింత శాఖ మంత్రిగా మీ కొడుకు నాలుగేళ్లుగా ఒక్కనాడూ మాట్లాడకుండా తాత్సారం చేసారు. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రాకపోవడానికి, బెంగుళూర్ తరలి పోవడానికి మీ కొడుకు కేటీఆర్ అలసత్వమే కారణం కాదంటారా…?
6. నైపుణ్యాల అభివృద్ది, మేకిన్ ఇండియా అంశాలపై ఎందుకు ప్రధానితో చర్చించలేదు ?
7. బయ్యారం లో ఉక్కుఫ్యాక్టరీ నిర్మించేది లేదని కేంద్రం స్పష్టం చేసినా, రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించే ఈ అంశం పై ప్రధాన మంత్రిని ఎందుకు నిలదీయలేకపోయారు ?
8. రైల్వేశాఖ కు సంబంధించిన అంశాలను ప్రస్తావించినప్పడు మనకు హక్కుగా రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ గురించి ఎందుకు అడగలేక పోయారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ తరహాలో కోచ్ ఫ్యాక్టరీ కూడా రాదనడానికి ఇది సంకేతం కాదంటారా ?
9. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలన్నింటిని జాతీయరహదారులతో అనుసంధానం చేసే అంశాన్ని ఎందుకు పక్కన పెట్టారు ?
10. కరువు అధిక వర్షాలు, వడగళ్ల కారణంగా నష్టపోయిన నివేదికలను కేంద్రానికి పంపినా కేంద్రంనుంచి రాష్ట్ర రైతాంగానికి నయాపైసా పరిహారం కూడా రాకపోవడాన్ని ప్రధానితో ఎందుకు ప్రస్తావించలేదు ?
11. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) విషయంలో స్వామినాధన్ కమిటీ సిఫారసులను అమలు చేయమని ప్రధానిని ఎందుకు కోరలేదు ?
12. రాష్ట్ర విభజనల అంశాలు కానీ, కీలక మైన రైతాంగ మరియు నిరుద్యోగుల సమస్యల గూర్చి పార్లమెంటులో ఎందుకు పోరాటం చేయడం లేదు?

ఇట్లు:
డా శ్రవణ్ దాసోజు,
ముఖ్య అధికార ప్రతినిధి,
తెలంగాణ కాంగ్రెస్.