తెలంగాణ అవతరణ దినోత్సవం. కడియం శ్రీహరి సందేశం.

వరంగల్:
తెలంగాణ ప్రజలకు, ఓరుగల్లు వాసులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన త్యాగమూర్తులకు నా జోహార్లు.తెలంగాణ తల్లికి నా వందనాలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా ఇక్కడకొచ్చిన జిల్లా ప్రజలు, ఉద్యమకారులు,మేధావులు, అధికారులు, మీడియా మిత్రులకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని నాలుగు వసంతాలు పూర్తి చేసుకొని ఐదో వసంతంలోకి అడుగుపెడుతున్నాం. ఈ నాలుగు సంవత్సరాలలో బంగారు తెలంగాణ లక్ష్య సాధనలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చాయి. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి దోహదపడేవిధంగా సిఎం కేసిఆర్ నాయకత్వంలో రూపొందించిన పథకాలు నేడు దేశ,విదేశాల ప్రశంసలు పొందుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రం అవతరించిన నాలుగేళ్ల అనతి కాలంలోనే సిఎం కేసిఆర్ నాయకత్వంలో దేశంలో అత్యంత అభివృద్ధి సాధించిన రాష్ట్రంగా మొదటి స్థానంలో నిలిచింది. వ్యవసాయం, విద్య, వైద్యం, సాగునీరు, ఐటి, పారిశ్రామిక వంటి రంగాల్లో తెలంగాణ అనేక రికార్డులు, రివార్డులు సాధించింది. దేశంమొత్తం తెలంగాణ వైపు చూసేలా, ఇక్కడి కార్యక్రమాలను అధ్యయనం చేసే విధంగా, ఆయా రాష్ట్రాలు మన విధానాలను, పథకాలను అనుసరించేలా మనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాం. బంగారు తెలంగాణ లక్ష్యంవైపు వడివడిగా అడుగులెస్తున్నాం.వ్యవసాయాన్ని పండగ చేయాలని, రైతును రాజును చేయాలని, అందరి ముఖాల్లో చిరునవ్వులు చూడాలని, రాష్ట్రం నుంచి పేదరికాన్ని పారదోలాలని, చేతివృత్తులు, కులవృత్తులకు జీవం పోయాలని సిఎం కేసిఆర్ చేస్తున్న కృషి నేడు సాకారమై మన కళ్లముందే సాక్షాత్కరిస్తోంది.వచ్చిన తెలంగాణ నలుగురి ముందు నవ్వుల పాలు కాకూడదని, తలఎత్తుకుని నిలబడేలా ఉండాలని సిఎం కేసిఆర్ ఈ నాలుగేళ్లుగా చేసిన శ్రమ ఫలితమే నేడు ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సగర్వంగా, సంతోషంగా మనమంతా పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం.దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు, రైతే వెన్నుముక అన్న దానిని అక్షరాల నమ్మి అమలు చేస్తున్న ఏకైక సిఎం మన కేసిఆర్. గ్రామాలు స్వయం సమృద్ధితో వికసించాలని, వ్యవసాయం పండగగా మారాలని, రైతును రాజు చేయాలని ఆయన చేస్తున్న కృషి నేడు రైతు ముఖాల్లో సంతోషాన్ని నింపుతోంది. వ్యవసాయానికి వైభవాన్ని తీసుకొస్తోంది. వ్యవసాయం దండగ అన్న పరిస్థితిని పూర్తిగా మార్చి వ్యవసాయం పండగలా చేసే ప్రయత్నం నిర్విరామంగా, నిర్విగ్నంగా కొనసాగుతోంది.తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టగానే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు లక్ష రూపాయల లోపు ఉన్న పంట రుణాలను 17వేల కోట్ల రూపాయలు నాలుగుదశల్లో మాఫీ చేసి 35 లక్షల మంది రైతులను రుణవిముక్తం చేశారు. విత్తనాలు, ఎరువుల కోసం చెప్పులు లైన్లో పెట్టి క్యూలో నిలబడే పరిస్థితిని పూర్తిగా మార్చేసి నేడు ఎప్పుడు వెళ్లినా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా స్టాక్ చేశారు. ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క రైతు ఏ ఒక్క గ్రామంలోగానీ, మండలంలోగానీ ఎరువులు, విత్తనాలకు లైన్లో నిలబడ్డ వార్త కూడా వినకుండా చేశారు. రైతు వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైంది కరెంటు. గతంలో కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడో రాదో తెలువక, వచ్చిన కరెంటుతో మడి పారక, తెచ్చిన అప్పు తీరక రైతు పడ్డ అవస్థలు, జరిగిన ఆత్మహత్యలు అత్యంత బాధాకరం. తెలంగాణ రాష్ట్రంలో ఈ దుస్థితి ఇక ఉండకూడదని నిర్ణయించిన సిఎం కేసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు ఆరు నెలల్లోనే 9గంటల విద్యుత్ ను ఇచ్చారు. రైతుకు షరతులతో కూడిన విద్యుత్ అవసరం లేదని భావించిన సిఎం కేసిఆర్ నేడు వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ను దేశంలో ఎక్కడా లేని విధంగా ఇస్తున్నారు. తెలంగాణ రాకముందు కరెంటు కావాలని ధర్నాలు చేసిన పరిస్థితి నుంచి తెలంగాణ వచ్చిన ఈ నాలుగేళ్లలో 24 గంటల కరెంటు వద్దనే వరకు వచ్చామంటే…మనం సాధించిన ప్రగతి, ఈ ప్రభుత్వ లక్ష్యం ఏమిటో కళ్లముందు ప్రత్యక్షంగా కనిపిస్తోంది.

పంట రుణాలు మాఫీ చేసి, విత్తనాలు-ఎరువులు అందుబాటులో పెట్టి, 24 గంటల కరెంటు ఇస్తే సరిపోదని భావించిన సిఎం కేసిఆర్ రైతు ఇక అప్పు చేయొద్దు…పంట పెట్టుబడి కోసం ఎక్కడికో పరుగులు పెట్టొద్దని రైతు బంధు పథకం తెచ్చి ఎకరానికి ఏటా 8000 రూపాయల పంట పెట్టుబడిని ప్రపంచంలోనే తొలిసారిగా ఇస్తున్న సిఎం.. కేసిఆర్. రైతు నుంచి శిస్తు వసూలు చేయడం, దానిని ఆపడం వరకే మనం ఇప్పటి వరకు చూశాం…కానీ రైతుకు తిరిగి పెట్టుబడి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వమే. ఏటా 12వేల కోట్ల రూపాయలు, 60 లక్షల మంది రైతులకు లబ్ది జరిగేలా ఇస్తున్న ఈ పంట పెట్టుబడి ఇప్పుడు గ్రామాల్లో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. రైతు మొఖంలో ఎన్నడూ చూడని ఆనందం వికసింపజేసింది. 31 ఏళ్ల నా రాజకీయ జీవితంలో అనేక పథకాలు చూశాం, అమలు చేశాం..కానీ రైతు బంధు కింద పంట పెట్టుబడి చెక్కును రైతుకు ఇస్తున్నప్పుడు వారి కళ్లలో కనిపించే ఆనందం వెలకట్టలేనిది. ఈ భూమిపై రైతు, వ్యవసాయం ఉన్నంత కాలం ఈ పథకం ఉంటుంది. రైతుకు నిరంతర సాయం అందుతూనే ఉంటుంది.

వీటితో పాటు రైతుకు నీటి తీరువా కింద 800 కోట్ల రూపాయల బకాయిలను ముఖ్యమంత్రి కేసిఆర్ మాఫీ చేశారు. శాశ్వతంగా నీటి తీరువా రద్దు చేశారు. రైతు ఏ నేలలో ఏ పంట వేయాలి, ఏ మందు కొట్టాలి అని చెప్పేందుకు వ్యవసాయ విస్తరణాధికారులను నియమించారు. వ్యవసాయం కూడా ఆధునిక పద్దతుల్లో చేయాలని వారికి 90 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లు, క్రషర్లు అందించారు. బిందు సేద్యం, తుంపర సేద్యాన్ని ప్రోత్సహించేందుకు కొంతమందికి నూరు శాతం సబ్సిడి, కొంతమందికి 80శాతం సబ్సిడీతో డ్రిప్, స్ప్రింక్లర్ సామాగ్రి అందించారు రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన యవసం ముందుకు సాగదని పెద్దలు చెప్పిన మాటను అనుసరించి పశువులకు కూడా అనారోగ్యం కలిగితే వెంటనే వైద్యం అందించేలా సంచార వైద్యశాలలు పెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. ఎక్కడో ఉన్న పశు వైద్యశాలకు అనారోగ్యంతో బాధపడుతున్న పశువులను తీసుకురావడం కంటే…పశువుల వద్దకే వైద్యాన్ని తీసుకెళ్లాలన్న మనసున్న ఆలోచన ఈ ప్రభుత్వానిది, మన ముఖ్యమంత్రిది. అందుకే వ్యవసాయం నేడు పండగ అయింది.భూమి రికార్డుల జోలికి వెళ్లడం అంటేనే వెన్నులో వణకు పుట్టించే కార్యక్రమం. గత 60 ఏళ్లుగా ఎవరూ సాహసించని కార్యక్రమం. అయినా సరే రైతు నిత్యం భూ రికార్డులు సరిగా లేక ప్రభుత్వ కార్యాలయాల వెంట తిరిగే దుస్థితి ఇక ఉండొద్దని ఆలోచించిన సిఎం కేసిఆర్…వంద రోజుల్లోనే రికార్డులను ప్రక్షాళన చేయించారు. పకడ్భందీగా పాస్ పోర్టు మాదిరిగా పట్టాదారు పాస్ పుస్తకాలను రైతుకు అందించారు. రెండు కోట్ల 38 లక్షల ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను ప్రక్షాళనం చేయడంతోపాటు, కోటి 40 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి విషయంలో స్పష్టత తీసుకొచ్చారు. రెవెన్యూ ఆఫీసు చుట్టు తిరగకుండా, పైసా ఖర్చు లేకుండా రైతు చేతికి పట్టాదారు పాస్ పుస్తకాన్ని అందించిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశంలో తెలంగాణ ఒక్కటే. పాస్ పుస్తకాలు ఇవ్వడంతోనే సరిపెట్టకుండా, ఇకపై ఆ పాస్ బుక్ లను కుదవ పెట్టకుండానే రుణాలు అందించే విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు.జాతీయ ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడానికి, అన్నిపంటలకు మద్దతు ధర ప్రకటించే విధంగా కేంద్రంపై వత్తిడి తెస్తున్నారు. ఆలోపు పండించిన పంట గోదాములో నిల్వ చేసేవిధంగా రాష్ట్రంలో నేడు 22 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను నిర్మించుకున్నాం. వీటిలో నిల్వ చేసిన పంటపై రుణం ఇప్పించే ప్రయత్నం జరుగుతోంది.ఇన్ని రోజులు రైతుకు భూమే ధీమా…రైతుకు భూమే బీమా. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆయన కుటుంబం పరిస్థితి అగమ్య గోచరం. పంటకు బీమా చేయించే రైతు.. తనకోసం మాత్రం ఆ పనిచేయడు. ఎందుకంటే రైతుకు పంటకంటే ముఖ్యమేది కాదు కాబట్టి. ఇది గుర్తించిన సిఎం కేసిఆర్ గారు తెలంగాణలో రైతులకు ఇలాంటి పరిస్థితి ఉండొద్దని రైతు బీమా పథకాన్ని ప్రకటించారు. ఈరోజు నుంచి అమల్లోకి తెస్తున్నారు. ఈపథకం కింద ఒక్కో రైతుకు 5లక్షల రూపాయల బీమా కల్పించనున్నారు. ఇందుకోసం రైతుకు ఏటా 2270 రూపాయల ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. ఇలా ఏటా రాష్ట్రంలో 60 లక్షల మంది రైతులకు ఈ పథకం కింద ప్రీమియం చెల్లించనున్నారు. రైతుకు 5 లక్షల రూపాయల బీమాను కల్పిస్తున్న రాష్ట్రం కూడా దేశంలో తెలంగాణ ఒక్కటే.పంటకు ఎన్ని ఇన్ పుట్స్ ఉన్నా…నీరు లేనిదే వ్యవసాయం లేదు. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల నుంచి వచ్చింది. ఇందులో మొదటిది నీళ్లు. అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రాగానే సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్ కు పూనుకుంది. ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక ఇంజనీర్ వలె, సాగునీటి నిపుణుని వలె నిరంతరం అధ్యయనం చేస్తూ రాష్ట్రంలో నేడు 23 భారీ, 13 మధ్యతరహా ప్రాజెక్టుల పనులు కొనసాగిస్తున్నారు. మరికొన్ని ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి త్వరలో ప్రారంభించనున్నారు. ఇందులో వరంగల్ కు వర ప్రదాయని లింగంపల్లి ప్రాజెక్టు కూడా ఉంది. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా జనగామ జిల్లా, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం, మల్కాపురం వద్ద 10.78 టి.ఎం.సీల నీటి నిల్వ సామర్థ్యంతో లింగంపల్లి రిజర్వాయర్ పనులకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది.
వ్యవసాయమే ఆధారంగా ఉండే వరంగల్ జిల్లాలో సాగునీటి అవసరాలు తీర్చడానికి భారీ రిజర్వాయర్ యొక్క అవసరాన్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పుడు లింగంపల్లి రిజర్వాయర్ కు అనుమతి ఇచ్చారు. ఈ రిజర్వాయర్ పూర్తి అయితే దేవాదుల, ఎస్.ఆర్.ఎస్.పి స్టేజ్-1, స్టేజ్-2, వరదకాల్వ ఆయకట్టుకు మరియు వరంగల్ పట్టణ సాగునీటి అవసరాలు తీర్చడానికి అవకాశం ఏర్పడుతుంది.
రూ.3227.10 కోట్లతో ప్రాజెక్టును మంజూరు చేసినందుకు వరంగల్ ప్రజల పక్షాన ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు.
త్వరలోనే ఈ రిజర్వాయర్ కు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతుంది. వీటితో వరంగల్ సస్యశ్యామలపై వ్యవసాయం పండగై, రైతే రాజు కావాలన్న లక్ష్యం నెరవేరుతుంది.భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో కాశేళ్వరం ప్రాజెక్టు నేడు మానవ నిర్మిత మరో అద్భుతం. ఈ ప్రాజెక్టు నుంచి మొదట లబ్ధి పొందేది వరంగల్ జిల్లానే. కాళేశ్వరం మొదటి దశ పంపింగ్ వచ్చే నెల నుంచే ప్రారంభం.రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మిషన్ భగీరథ. ఇంటింటికి నల్లా నీళ్లు ఇవ్వకపోతే మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఓటు అడగను అని శపథం చేసి సిఎం కేసిఆర్ రూపొందించి, ప్రారంభించిన ప్రాజెక్టు ఇది. గజ్వేల్ లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా ఇప్పటికే వేలాది గ్రామాలకు తాగునీరు అందుతోంది. అనుకున్న సమయంలోగా ఇంటింటికి నల్లా నీరందించి, మళ్లీ మీ వద్దకు సగర్వంగా వస్తామని చెబుతున్నానుకాకతీయుల వారసత్వమే తెలంగాణలో చెరువుల అస్తిత్వం. గొలుసు చెరువులతో నాడు వ్యవసాయానికి, తాగునీటికి నీరందించి ప్రపంచానికి చిన్న నీటి పారుదల వ్యవస్థ గొప్పతనాన్ని చాటిచెప్పింది ఓరుగల్లు కేంద్రంగా పాలన చేసిన కాకతీయులు. కానీ కాలక్రమేణ వలస పాలనలో ఈ చెరువులు తీవ్ర నిర్లక్ష్యానికి, కబ్జాలకు గురై వ్యవసాయం రైతుకు శాపంగా మారింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరాధరణకు గురైన చెరువులను పునరుద్ధరించే గొప్ప లక్ష్యంతో మిషన్ కాకతీయను ప్రారంభించింది. రాష్ట్రంలోని 46వేల చెరువులను పునరుద్ధరించేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేసింది. దీని ఫలితాలు కూడా మనకు అందాయి. ఇంకా మిగిలిన చెరువులను కూడా మిషన్ కాకతీయ 5దశలో పునరుద్ధరించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 5వేల 839 చెరువుల్ని మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించాలని గుర్తించారు. తద్వారా 3లక్షల 55వేల 36 ఎకరాలను సాగులోకి తీసుకొచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. మొదటి దశలో 1173, రెండో దశలో 1222 చెరువులు పునరుద్ధరించే లక్ష్యంతో పనులు చేశారు. మిగిలిన పనులు కూడా వేగంగా పూర్తి చేసి కాకతీయులకు ఆలవాలమైన వరంగల్ జిల్లాలో ఈ పథకం విజయవంతం అవుతుందని విశ్వసిస్తున్నాను.మానవ వనరుల అభివృద్ధితోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని సిఎం కేసిఆర్ పదే, పదే అంటుంటారు. విద్య ద్వారానే ఈ మానవ వనరుల అభివృద్ధి సాధ్యం. తెలంగాణలో చదువుకున్న విద్యార్థి ప్రపంచంలో ఏ విద్యార్థికి తీసిపోకుండా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసిఆర్ ఆశయం. అందులో భాగంగా నేడు దేశంలో ఎక్కడా లేనివిధంగా 577 రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ రాకముందు 315 గురుకుల పాఠశాలలు, కాలేజీలుంటే…ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం 892 గురుకులాలున్నాయి. ఇంతపెద్ద ఎత్తున గురుకులాలున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. ఈ గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నాం. నెలకు ఆరుసార్లు మాంసాహారం, ఇందులో నాలుగుసార్లు చికెన్, రెండుసార్లు మటన్ ఇస్తున్నాం. వారానికి ఐదురోజులు గుడ్లు. ప్రతి రోజు 50 గ్రాముల నెయ్యి. ఉదయం పాలు, బ్రేక్ ఫాస్ట్, సాయంత్రం స్నాక్స్ ఇస్తున్నాం.ఇదే పౌష్టికాహారాన్ని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూల్స్ లలో కూడా అందిస్తున్నాం. కేజీబీవీలను 12వ తరగతి వరకు పొడగించాలని నేను కేబ్ చైర్మన్ గా ఇచ్చిన ప్రతిపాదనలను కేంద్రం ఆమోదించడంతో దేశవ్యాప్తంగా కేజీబీవీలు ఇక నుంచి 12వ తరగతి వరకు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధవల్ల తెలంగాణకు 84 కేజీబీవీలు అదనంగా మంజూరయ్యాయి.

ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, బోధనావసతులు పెంపొందించాం. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా డిజిటల్ కాస్లులు, ల్యాబ్ వసతులు అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంగ్లీషు మీడియంను పెద్ద ఎత్తున ప్రారంభించాం. 8792 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశాం. మరో 8000 పోస్టులు భర్తీ చేయడానికి మన ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.
పాఠశాలలు, కాలేజీల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ మెషీన్లు ఏర్పాటు చేశాం. హాస్టళ్లలో వేడినీళ్ల సదుపాయం కల్పించాం. దుప్పట్లు పంపిణీ చేశాం. యూనివర్శిటీలలో 1061 పోస్టులు భర్తీ చేస్తూ, 420 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి వాటిని బలోపేతం చేస్తున్నాం.

తెలంగాణ విద్యాశాఖ తీసుకున్న ఈ చర్యల వల్ల నేడు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగింది. విద్యార్థుల నమోదు పెరిగింది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. తెలంగాణ విద్య దేశానికి రోల్ మోడల్ అయింది.

దేశంలోనే కాకుండా విదేశాల్లో చదివే విద్యార్థులకు మహాత్మ జ్యోతిరావు పూలే, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ పథకం కింద 20 లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తున్నాం. విద్యలో వెనుకబడిన విద్యార్థులు వివిధ పోటీ పరీక్షలను దీటుగా ఎదుర్కోవడానికి వీలుగా స్టడీసర్కిళ్ళు ఏర్పాటు చేసి తగిన శిక్షణ ఇస్తున్నాం. ఫలితంగా 110మందివిద్యార్థులు వివిధ పోస్టులకు ఎంపికయ్యారు. వీరిలో సివిల్ సర్వీసులకు ఎంపికైనవారు కూడా ఉండటం విశేషం.తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖలో మరొక విప్లవాత్మకమైన కార్యక్రమం హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ . 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థినుల రుతుస్రావ ఇబ్బందులను దూరం చేసేవిధంగా, అనారోగ్యం వల్ల విద్యలో వెనుకబడకుండా ఉండేందుకు దాదాపు 8 లక్షల మందికి ఈ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందించనున్నాం. 13 రకాలైన 50 వస్తువులు కలిగే ఉండే ఈ కిట్ల కోసం ఏటా వంద కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థినిల కోసం ఈ బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్నాం. వీటితో పాటు ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు హెల్త్ ప్రొఫైల్స్ రూపొందించడం, ఏటా రెండుసార్లు వారికి అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయించే కార్యక్రమం కూడా అమలు.
పేదింటి మహిళలు గర్భం దాల్చి 9నెలల సమయంలోనూ పనిచేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన దుర్భర పరిస్థితులను దూరం చేసి, మానవీయ కోణంతో వారిని ఆదుకునే మంచి పథకమే కె.సి.ఆర్ కిట్స్. ప్రసవానికి మూడు నెలల ముందు, ప్రసవం అనంతరం మరో ముడు నెలలు మొత్తంగా ఆరు నెలలు పాటు… నెలకు 2000 రూపాయల చొప్పున 12వేలు అందిస్తున్నాం. ఆడపిల్ల పుడితే అదనంగా మరో 1000 రూపాయలు ప్రోత్సాహకంగా ఇస్తున్నాం. ప్రభుత్వాసుపత్రులలో ప్రసవం అయిన వారికి 16 రకాల వస్తువులతోకూడిన2,000 రూపాయల విలువైన కిట్ ను అందిస్తున్నాం. ఈ కిట్స్ తో ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరగడంతోపాటు, మాతా,శిశు సంరక్షణ కూడా సమర్థవంతంగా అమలవుతోంది. కె.సి.ఆర్ కిట్స్ కార్యక్రమం ప్రారంభించిన తరువాత ఇప్పటివరకూ 2 లక్షల మందికిపైగా మహిళలకు ఈ ప్రయోజనం చేకూరింది.

ఆరోగ్య పరిరక్షణకు పాటుపడుతున్న అంగన్ వాడీ వర్కర్లు, ఆశావర్కర్లకు వేతనాలు పెంచాం. దివ్యాంగులను వివాహం చేసుకునేవారికి లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నాం.ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పరిస్థితిని మార్చి ఈ రోజు ప్రభుత్వ ఆస్పత్రులలో కార్పొరేటు స్థాయి వైద్యం అందుబాటులోకి తెచ్చాం. నేడు స్వయంగా రాష్ట్ర గవర్నర్ గారే గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయించుకొని,అక్కడి సదుపాయాలను చూసి ఆశ్చర్యపోయారు. ప్రభుత్వాన్ని అభినందించారు.తెలంగాణ రాష్ట్రంలో వైద్యం చేయించుకోలేక ఏ ఒక్కరూ మరణించరాదన్న ఆశయంతో కిడ్నీ వ్యాధి బాధితుల కోసం 39 డయాలసిస్ కేంద్రాల ద్వారా ఉచితంగా డయాలసిస్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నాం. వీటిలో 17 కేంద్రాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా 77 లక్షలకు పైగా దారిద్యరేఖకు దిగువనున్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యసేవలు అందుతున్నాయి.ఉద్యోగులు, జర్నలిస్టులకు హెల్త్ కార్డులిచ్చి వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చాం.గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన వరంగల్ తెలంగాణ రాష్ట్రం వచ్చాక తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ..రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతి ముఖ్యమైన పట్టణంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యమంత్రి కేసిఆర్ వరంగల్ నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి కావల్సిన నిధులు అందిస్తున్నారు. వరంగల్ చారిత్రక నగరంగానే కాకుండా నేడు ఎడ్యుకేషన్ హబ్, ఐటి హబ్ గా వర్ధిల్లుతోంది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, అగ్రికల్చర్ కళాశాల, వెటర్నరీ కళాశాల, సైనిక్ స్కూళ్లు నేడు వరంగల్ కేంద్రంగా విద్యనందిస్తున్నాయి. హెల్త్ యూనివర్శిటీ పాస్ పోర్టు సేవా కేంద్రం వచ్చాయి. ఐటి కంపెనీలు వస్తున్నాయి. రైల్వే వ్యాగన్ ఓవరాలింగ్ యూనిట్ ఇలా అన్ని రకాల కంపెనీలు, పరిశ్రమలు, ఐటి సంస్థలను వరంగల్ కు తీసుకొచ్చే కార్యక్రమం కొనసాగుతోంది.

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్
కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్.. ఆసియాలోనే అతిపెద్ద వస్త్ర నగరి. ‘‘ఫామ్ టు ఫ్యాషన్ ’’…‘‘ ఫైబర్ టు ఫ్యాబ్రిక్ ’’ నినాదాలతో ఈ పార్క్ ను తెలంగాణకు మణిహారంగా అంతర్జాతీయ స్థాయిలో వెలిగొందేలా ఏర్పాటు చేసుకుంటున్నాం. వరంగల్ కు చిరునామాగా ఉన్న ఆజంజాహి మిల్లు గత పాలనలో నిర్లక్ష్యానికి గురై మూతపడింది. చేనేతకు చేయుతగా..వస్త్ర ఉత్పత్తికి పట్టుగొమ్మగా వెలుగొందిన ఓరుగల్లులో ఈ కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుతో వస్త్రరంగానికి పూర్వ వైభవం రానుంది. ఇక్కడి చేనేత కార్మికులు, స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభించనుంది.

2000 ఎకరాల్లో ఆసియాలోనే అతి పెద్ద కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు. మొదటి దశలో 1200 ఎకరాల్లో శంకుస్థాపన చేసుకున్నాం. రెండో దశలో మరో 800 ఎకరాల్లో విస్తరిస్తున్నాం. 1150.47 కోట్ల రూపాయలతో నిర్మాణమయ్యే ఈ పార్కు లో 11,586 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వచ్చే ఐదేళ్లలో 1,20,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి,ఉద్యోగాలు లభించనున్నాయి. ముఖ్యంగా మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే చేనేత రంగం…ఈ టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుతో వారి కష్టాలను తీర్చనుంది. 3000కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు 12 కంపెనీలు శంకుస్థాపనరోజే ఎంవోయు చేసుకోవడం ఈ పార్క్ లో రాబోయే కాలంలో వచ్చే పెట్టుబడుల వెల్లువకు గొప్ప ముందడుగు. నాడు ఆజంజాహి మిల్లు కోసం పోరాటం చేసి, నేడు ఆజం జాహి స్థానంలో దేశంలోనే గొప్ప టెక్స్ టైల్ పార్క్ శంకుస్థాపనలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి. ఒక ఉద్యమకారుడికి తన లక్ష్యం నెరవేరిన రోజు కంటే గొప్ప రోజు మరొకటి ఉండదు. ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గార్కి కృతజ్ణతలు.

ఔటర్ రింగ్ రోడ్డు
అభివృద్ధిలో రోడ్లు చాలా కీలకం. హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్డు తర్వాత దాని స్వరూపం పూర్తిగా మారింది. అలాగే వరంగల్ లో కూడా అభివృద్ది వేగంగా జరగాలంటే ఔటర్ రింగ్ రోడ్డు కావాలని ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా టెక్స్ టైల్ పార్క్ కు శంకుస్థాపన చేసిన రోజే దీనికి కూడా శంకుస్థాపన చేశారు. కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ లో 159 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ఉంటే…15 లక్షల లోపు జనాభా ఉన్న వరంగల్ కు 74 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును మంజూరుచేశారు. మొత్తం 1446.13 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేసుకున్న ఈ ఓఆర్ఆర్ కు మొదటి దశ పనుల కోసం 669 కోట్ల రూపాయలను సిఎం కేసిఆర్ గారు ఇప్పటికే మంజూరు చేశారు. పనులు వేగంగా జరుగుతున్నాయి.

వెటర్నరీ కాలేజీ
వరంగల్ నగరంలో పశు వైద్య కళాశాల ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఈ పశు వైద్యశాలకు గత ఏడాది డిసెంబర్ 11వ తేదీన శంకుస్థాపన చేసుకున్నాం. ఈ కాలేజీ ఏర్పాటుకు భవనాలు, హాస్టళ్లు, ఇతర మౌలిక వసతుల కోసం ప్రభుత్వం 208 కోట్ల రూపాయలను మంజూరు చేసి, ఇప్పటి వరకు 109 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ కాలేజీలో బోధనాసుపత్రి కూడా ఏర్పాటు జరుగుతోంది. వందమంది పశువైద్య విద్యార్థులకు ఆరు సంవత్సరాల పాటు ఈ కాలేజీలో కోర్సులు నిర్వహిస్తారు. ఈ వైద్య విద్యార్థులు ఇక్కడే ఉండి విద్యాభ్యాసం చేసేందుకు వీలుగా హాస్టళ్లు కూడా నిర్మిస్తున్నారు. ఈ కాలేజీ ఏర్పాటుతో నేరుగా 250 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు రాగా…పరోక్షంగా వందలమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

ఖాజీపేట-హన్మకొండ రెండో ఆర్వోబి
హైదరాబాద్ – వరంగల్ రోడ్డు నాలుగు లేన్ల రోడ్డుగా అభివృద్ధి చెందుతున్నా…ఖాజీపేట-హన్మకొండ ఆర్వోబి మాత్రం విస్తరణకు నోచుకోకుండా అలాగే ఉంది. దశాబ్దాల నుంచి ఈ ఆర్వోబికి సమాంతరంగా మరొక ఆర్వోబి నిర్మించాలని చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఫలించాయి. ఆర్వోబి ఒకటి నిర్మించిన తర్వాత మరొక ఆర్వోబి సమాంతరంగా నిర్మించడానిక రైల్వే నిబంధనలు అంగీకరించవని రైల్వే అధికారులు చెప్పడంతో పూర్తిగా రాష్ట్ర బడ్జెట్ తో ఈ ఆర్వోబిని నిర్మించడానికి సిఎం కేసిఆర్ అంగీకరించారు. ఇందుకోసం 78 కోట్ల రూపాయలను ఈ ఆర్వోబి నిర్మాణం కోసం మంజూరు చేశారు. దశాబ్దాలుగా కలగానే ఉన్న ఈ రెండో ఆర్వోబి డిమాండ్ ను సాకారం చేసినందుకు జిల్లా ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసిఆర్ గార్కి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను.

ముగింపు…
తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఈ నాలుగేళ్ల అనతికాలంలోనే అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశంలో వేగంగా పురోగమిస్తున్న రాష్ట్రంగా ముందుకెళ్తోంది. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఘనంగా, గర్వంగా నిర్వహించుకోవాలి. ప్రతి ఒక్కరు ఈ పండగలో భాగస్వాములై తెలంగాణ గొప్పదనాన్ని, సంస్కృతిని, సంప్రదాయాలను, చరిత్రను ప్రతిబింబించే విధంగా ఈ ఉత్సవాలను జరుపుకోవాలి. ఈసందర్భంగా జిల్లా అభివృద్ధిలో నిరంతరం పాలుపంచుకుంటున్న రాష్ట్ర శాసనసభాపతి సిరికొండ మధుసూధనాచారి గార్కి, ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గార్కి, గిరిజన, పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ గార్కి, పార్లమెంట్ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావుగార్కి, సీతారాం నాయక్ గార్కి, పసునూరి దయాకర్ గార్కి, జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ గార్కి, మేయర్ నన్నపనేని నరేందర్ గార్కి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డిగార్కి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పోరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులకు నా ధన్యవాదాలు. జిల్లా అభివృద్ధిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువయ్యేందుకు కృషి చేస్తున్న అర్భన్ కలెక్టర్ ఆమ్రపాలి, పోలీస్ కమిషనర్ రవీందర్, ఇతర అధికారులకు మరోసారి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.