తెలంగాణ పౌరసరఫరాల శాఖకు ‘జెమ్స్‌’ అవార్డు

హైదరాబాద్:
సాంకేతిక పరిజ్ఞానంతో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో అద్భుత ప్రగతిని సాధించినందుకు గాను ప్రతిష్ఠాత్మకమైన ‘జెమ్స్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఇండియా అవార్డ్‌ – 2018’ సంవత్సరానికి ‘ఈ-పీడిఎస్‌ తెలంగాణ’ ఎంపికైంది. ప్రజాపంపిణీ వ్యవస్థలో వినూత్న మార్పులు చేపట్టి ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నందుకు గాను తెలంగాణ పౌరసరఫరాల శాఖకు ఈ అవార్డు లభించింది. బుధవారం నాడు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ పౌరసరఫరాల శాఖ తరఫున పౌరసరఫరాల సంస్థ జనరల్‌ మేనేజర్‌ జి. రాజేందర్‌ ఈ అవార్డును కోయెస్‌ ఏజ్‌ సంస్థ వ్యవస్థాపకులు డా. కపిల్‌దేవ్‌ సింగ్‌ చేతుల మీదుగా అందుకున్నారు. పేద ప్రజలకు ఆహార భద్రత కల్పించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా పేదలకు నిత్యావసర సరుకులు సరఫరా చేస్తోంది. ఈ సరుకులు అర్హులైన పేదలకు అందించడానికి రేషన్‌ షాపుల్లో ఈపాస్‌ విధానాన్ని అమలు చేస్తోంది.నిత్యావసర సరుకులు, ముఖ్యంగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి గోదాముల్లో సిసి కెమెరాలు, రేషన్‌ సరుకులు తరలించే వాహనాలకు జీపీఎస్‌, వీటిని పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌ కేరద్ర కార్యాలయంలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింది. సాంకేతిక పరిజ్ఞానంతో పౌరసరఫరాల శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం ఏర్పడింది.
ప్రతిష్ఠాకమైన జెమ్స్‌ అవార్డు తెలంగాణ పౌరసరఫరాల శాఖకు రావడం పట్ల పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ ఆకున్ సబర్వాల్ హర్షం వ్యక్తం చేశారు.