తెలుగు భాషా స్రష్ట కు నివాళి

M.D.rathnakumar

తెలుగు భాషా ప్రావీణ్యతలో స్రష్ట అనతగిన వ్యక్తి దివంగత డా. బూదరాజు రాథాకృష్ణ. జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ గా ప్రసిద్ధి పొందిన ఈ భాషా పండితుడి 86వ జయంతి ఈరోజు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడమీకి డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేసిన ఈయన జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్ గా లెక్కలేనంతమంది జర్నలిస్టులను తయారుచేశారు. ఒక నిపుణత గల్గిన శిల్పి చేతిలో మొద్దురాయి సైతం సుందర శిల్పంలా రూపొందే రీతిలోనే ఈయన శిక్షణ ఉండేది. చాలామందికి ఇది శిక్షణగా కంటే శిక్షగానే అనిపించేది. పాతికేళ్ళు రాకుండానే బీపీ వచ్చేసిందా? అన్నట్టు అన్పించేది ఆయన విధాన రీతిని గమనిస్తే! పత్రికా యాజమాన్యమే ఆయనకు చండశాసనుడన్న బిరుదునిచ్చింది. ‘ఈయన చేతిలో పడ్డారు. ఇక సవ్యంగా బైటకొస్తారో లేదో మీపైనే ఆధారపడి ఉంది’ శిక్షణ ప్రారంభంనాడే పత్రికాధిపతి నోటినుంచి వెలువడే వ్యాఖ్యలు టెన్షన్ ను పెంచక ఇంకేంచేస్తాయి! ఆయన్ను చూస్తే క్రమశిక్షణ తప్పాలనుకునేవాడు కూడా ట్రాక్ లోకి వచ్చేస్తాడు. ‘నాకు బాగా చదివేవాడు గుర్తుంటాడు. ఎదిరించేవాడూ తలెగరేసేవాడూ ఎలాగూ గుర్తుంటాడనుకో..!’ అని నవ్వుతూ అనేవారు. అంటే ఎవడైనా కట్టుతప్పితే చీల్చిచెండాడతాననే సందేశం ఆ వ్యాఖ్యల్లో అంతర్లీనంగా తొంగిచూసేది. ‘నేను అహంకారినని చాలామంది అంటుంటారు. అవును. 23ఏళ్ళ వయస్సులోనే డిగ్రీ చదివేవారికి బోధించాను. మరి అహంకారం లేకుండా ఎలా ఉంటుంది!’ అని సమర్థించుకునేవారు. ఆయన్లో ఈ లక్షణం నన్ను ఎంతో ఆశ్చర్యపర్చింది. అయితే ఆయన విథ్యార్థుల్ని చాలా పరిశీలనగా చూసి వారు ఏ విభాగంలో పనికొస్తారో ఒక అంచనాకు వచ్చేవారు. దానిప్రకారమే శిక్షణానంతర నియామకాలుండేవి. యాజమాన్యం కూడా ఫలానావాడు ఫలానాచోట ఉండాలని చెప్పడం జరిగేది కాదు. అందుకే బూదరాజు గారితో చాలా జాగ్రత్తగా ఉండేవారు అంతా. ఆయన ఏం చెబితే అదే. నోర్మూసుకుని రాసుకోవడమే! అలాగని ఆయన అన్నీ వాస్తవవిరుద్ధాలే చెప్పేవారని కాదు అర్థం. ఎంతటి మేథావికైనా ఒక్కోసారి తప్పులు దొర్లే అవకాశం ఉంది. ఈ విషయంలో ఆయనతో నాకొక అనుభవం ఉంది. ఒక సందర్భంలో ఆయన మాటల్లో పొరపాటు దొర్లితే నేను వెంటనే కల్పించుకుని అదే విషయాన్ని ఆయనకు చెప్పడమే కాకుండా సరిచేశాను. ఓసారి క్లాస్ లో ఉన్నప్పుడు రాజకీయాలపై మాడ్లాడుతూ చంద్రబాబునుద్దేశించి ‘హి ఈజ్ యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్!’ అని వ్యాఖ్యానించారు. ఆయన వాక్ప్రవాహానికి ఎవరైనా అడ్డుతగిలితే ఇంతే సంగతులు. అయితే ఎక్కడైనా తప్పుదొర్లితే మిన్నకుండిపోవడం నాకు చేతకాదు. అక్కడికక్కడే సరిచేసేయడం అలవాటు. అలాగే స్పందించాను. ‘సర్! మీరు చెప్పేది కరెక్ట్ కాదు. రాష్ట్రానికి చంద్రబాబు యంగెస్ట్ సీఎం కాదు. 1950లో పుట్టిన చంద్రబాబు 1995లో 45ఏళ్ళ వయస్సులో ముఖ్యమంత్రి అయ్యారు. కానీ రాష్ట్రానికి యంగెస్ట్ సీఎం దామోదరం సంజీవయ్య. 1921లో జన్మించిన ఆయన 1960లో 39ఏళ్ళ వయస్సులో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు’ అని వివరించాను. బూదరాజు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. కొన్ని క్షణాల్లోనే తేరుకుని..’అయితే ఏమంటావయ్యా! యంగెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాకపోతే యంగెస్ట్ ఆఫ్ తెలుగుదేశం!’ అంటూ నవ్వేశారు. నా ప్రవర్తనను ధిక్కారంగా భావించి వేధిస్తారేమో! రేపట్నుంచీ ఇబ్బందులు తప్పవేమో!నన్న బెంగ నాకు పట్టుంది. ‘బూదరాజునే తప్పుపడతావా? ఇక నీపని అయిపోయింది. ఏదో కారణంతో నిన్ను ఇంటికి పంపేస్తాడాయన’!అంటూ కొందరు సహచరులు నన్ను భయపెట్టారు. ‘నేనేమీ ఆయన్ను ఎదిరించలేదు. పొరపాటును సరిచేశానంతే. ఆయన్నుంచి ఇబ్బంది ఎదురైతే ఇదే చెబుతాను’ అని నాకునేను ధైర్యం చెప్పుకున్నాను. అయితే ఆయన్నుంచి నాకు ఎలాంటి ఇబ్బందీ ఎదురుకాలేదు. ఆయన పరిశీలన మాత్రం అమోఘం. శిక్షణార్థుల్ని నిశితంగా గమనిస్తుండేవారు. నేను మా తల్లిగారి వర్థంతి సందర్భంగా మూడురోజులు శెలవు పెట్టి మా వూరు వెళ్ళాను. ‘ఈయన లేడేమిటి! ఎప్పుడూ ఆబ్సెంట్ కాడే!’ అని నా గురించి వాకబు చేశారట. 40మందివరకూ ఉండే బ్యాచ్ లో శిక్షణ అనంతరం రిపోర్టింగ్ విభాగంలో చోటు దక్కేవారు నలుగురైదుగురే ఉండేవారు. ‘రిపోర్టర్ కావడమంటే అంత సులభం కాదు. విషయపరిజ్ఞానం, గ్రాహకశక్తితో మంచి పర్సనాలిటీ కూడా అవసరం. అందరూ రిపోర్టర్లు కాలేరు. ఏదో ఈయనలాంటివారు తప్ప!’ అంటూ నన్ను చూపిస్తూ వ్యాఖ్యానించారు. దీనితో నాతోసహా అందరూ దిగ్భ్రమకు గురయ్యారు. ఆయన వ్యాఖ్యలకు తగ్గట్టుగానే శిక్షణ అనంతరం నాకు ఒక్కడికే రాష్ట్ర స్థాయి రిపోర్టింగ్ బ్యూరోలో పనిచేసే అవకాశం లభించింది. శిక్షణార్థులపై బూదరాజు గారి అంచనా చాలా గొప్పగా ఉంటుందనేందుకు ఇదే ఉదాహరణ.

మనిషన్నాక ఏవో చిన్న చిన్న బలహీనతలుంటాయి. అవి కూడా పరిమితి దాటనంతవరకూ బాగానే ఉంటాయి. వాటిని భూతద్ధంలో చూసి మేథావుల్లో ప్రతికూలాంశాలుగా చూడకూడదని నా భావన. స్థూలంగా చూస్తే గురువు ఎప్పటికీ గురువే. ప్రతి ఏటా మే 3వ తేదీన బూదరాజు మాష్టారే గుర్తొస్తారు. 23ఏళ్ళక్రితం ఇదే రోజున స్వీట్ ప్యాకెట్ తీసుకుని శుభాకాంక్షలు తెలియజేసేందుకు హిమాయత్ నగర్ లోని ఆయనింటిని వెదుక్కుంటూ వెళ్ళాను. స్వీట్ ప్యాకెట్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పగా ఆయన చాలా సంతోషించారు. తనకు పుట్టినరోజు జరుపుకునే అలవాటు లేదన్నారు. ఆపై నన్ను కూర్చోబెట్టి చాలాసేపు మాట్లాడారు. ఉద్యోగం ఎలాఉంది? కొలీగ్స్ ఎలా ఉంటున్నారు? అని అడిగారు. అప్పుడు జరుగుతున్న లోక్ సభ ఎన్నికలతో సహా ఇతర విషయాలపైనా పిచ్చాపాటిగా మట్లాడారు. నాకు అసైన్మెంట్ కు సమయంఅవుతుండటంతో లేచాను. గుమ్మం వరకూ వచ్చి సాగనంపారు. నేనిలా బూదరాజు దగ్గరకు వెళ్ళాననీ ఆయనిలా మాట్లాడారనీ చెబితే ఎవరూ నమ్మరని ఎవరికీ చెప్పలేదు ఈరోజుకి కూడా! ఇన్నేళ్ళుగా ఏటా ఈరోజున ఆయన్ను గుర్తుచేసుకోవడం మాత్రం జరుగుతూనే ఉంది. బూదరాజు ఒక మేథావే కాదు. స్పందించే హృదయం ఉన్న వ్యక్తి కూడా! ఆయన జయంతి సందర్భంగా నా నివాళి.