త్వరలో రైతే అప్పులు ఇచ్చే రోజులు -వ్యవసాయ మంత్రి పోచారం.

కరీంనగర్:
నగరంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల బీమా అవగాహన, సమీక్ష సదస్సు కు వ్యవసాయశాఖ మంత్రి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆర్థిక మంత్రి శ్రీ ఈటల రాజేందర్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ వినోద్, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, రైతు సమన్వయ సమితి సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహా, మేమందరం రైతు బిడ్డలమే. రైతులకు న్యాయం చేయడమే తమ ధ్యేయం అని మంత్రి పోచారం చెప్పారు.వ్యవసాయం చేస్తున్నారంటే పిల్లనీయడం లేదని,అటెండరైనా బిడ్డ నివ్వడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. ఎవుసం చేసే రైతులు ఎందుకు అప్పుల పాలవుతున్నారని, అందరికీ అన్నం పెట్టే రైతు, అప్పుల కోసం చేయి చాచే దౌర్భాగ్యం పోవాలన్నారు.రైతు తన వారసులకు అప్పులు వారసత్వంగా అందించే దురవస్థ పోవాలని మంత్రి అభిప్రాయపడ్డారు.
కరీంనగర్ నుంచే రైతు బీమా పథకం ప్రారంభించినట్టు ఆయన చెప్పారు. ఇక్కడి నుంచి చేపట్టిన ప్రతీ పథకం విజయవంతమైందన్నారు.ఎరువులు, విత్తనాల కోసం క్యూలు కట్టే దుస్థితిని అధిగమించామని తెలిపారు.కరెంట్ కోసం కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరకెళ్తే.. తెలంగాణ వస్తే అంధకారమవుతుందని అవహేళన చేసారన్నారు.24 గంటల కరెంటుతో పాటు ప్రాజెక్టులు అందుబాటులోకి తెచ్చి కోటి ఎకరాలకు సాగు నీరందిస్తామని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఎవరూ అడగక పోయినా రెండు పంటలకు రూ. 8వేల పంట పెట్టుబడి పథకాన్ని సీఎం తెచ్చారని మంత్రి అన్నారు
రైతు ఇన్స్యూరెన్స్ విషయంలో కాంగ్రెస్ నాయకులు అవహేళనగా మాట్లాడటం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం కుర్చీ కోసం కోట్లాడుతున్నారని విమర్శించారు. దురదృష్టవాశాత్తు రైతు చనిపోతే వారి కుటుంబం వీధిన పడకుండా ఒక్కో రైతుకు రూ. 2271.50 చొప్పున 11వందల కోట్లతో ప్రీమియం చెల్లిస్తున్నామని చెప్పారు.
బీమా సొమ్ము పది రోజుల్లో నామినీకి అందుతుందన్నారు. ఈ ప్రక్రియను జాప్యం చేస్తే సంబంధిత అధికారులకు జరిమానా విధిస్తామని తెలిపారు. ఎల్ఐసీ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థకే రైతుల బీమా ప్రీమియం చెల్లిస్తున్నాం.
18-60 వయస్సున్న ప్రతి రైతు పేరుతో బీమా చేయించేలా నామిని పేర్లతో ఫారాలను జూన్ 31 లోగాపూర్తి చేసేలా రైతు సమన్వయ సమితి సభ్యులు కృషి చేయాలని పోచారం కోరారు.
జులైలో ఎల్.ఐ.సి.కి ఫారాలు అందించి ప్రీమియం చెల్లిస్తామని వ్యవసాయ మంత్రి తెలిపారు. ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో బీమా బాండ్లను రైతులకు అందిస్తామన్నారు. ఏ ఒక్క రైతును విస్మరించకుండా సుమారు 50 లక్షల మంది రైతులకు బీమా చేయిస్తామని వివరించారు.సమయానుకూలంగా విత్తనాలు వేసి పండిస్తే తెలంగాణ రైతులు పండించే పంట విలువ ఏడాదికి రూ.1.5 లక్షల కోట్లు అని ఆయన తెలిపారు. నిజామాబాద్ ఏరియాలో వరి దిగుబడి 60 బస్తాలు వస్తాయి. మిగతా రైతులు కూడా మంచి దిగుబడి సాధించాలని కోరారు.
AEO ల సలహాలు తీసుకుంటూ ఉత్తమ సాగు విధానాలు అవలంబిస్తే మంచి లాభాలు వస్తాయని చెప్పారు.రైతులే అప్పులిచ్చే రోజులు రావాలని కోరారు.సేంద్రీయ ఎరువుల వాడకం పెంచితే ఖర్చు తగ్గుతుందన్నారు.