త్వ‌ర‌లోనే అన్ని ప్ర‌ధాన ఆల‌యాల్లో ఆన్ లైన్ సేవ‌లు.

 దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్  రెడ్డి .
హైదరాబాద్:
తెలంగాణా రాష్ట్రంలోనే ప్రపథమంగా సికింద్రాబాద్ నగరంలోని గణేష్ దేవాలయంలో ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి వ‌చ్చాయి. రెండు శతాబ్దాల ఘన చరిత్ర ఉన్న పురాతన దేవాలయంలో మొదటిసారి ప్రయోగాత్మకంగా ఆన్ లైన్ బుకింగ్ సేవలను ఇవాళ‌ ప్రారంభించ‌డం జరిగింది. సికింద్రాబాద్ గ‌ణేష్ ఆల‌యంలో నూతనంగా ప్రవేశ పెట్టిన ఆన్‌లైన్‌ సేవలను భ‌క్తులు సద్వినియోగం చేసుకోవాలి. ఇకనుంచి రోజువారీ పూజలు, ప్రత్యేక సేవలు, ప్రసాదం, గణపతి హోమం వంటి సేవలు ఆన్ లైన్ లో బుక్ చేసుకోచ్చు. టీటీడీ తరహాలో నూతన సాంకేతికతో భక్తులకు ఆన్ లైన్ సేవలు అందించేందుకు తెలంగాణ దేవాదాయ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత రాష్ట్రంలోని అన్ని ప్ర‌సిధ్ద దేవాల‌యాల్లో భ‌క్తుల ర‌ద్దీ పెరిగింది. ఆలయాల‌కు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎన్నో కార్య క్రమాలు అమలు చేస్తున్నాము. భక్తులకు అసౌకర్యం కలగకుండా వ‌స‌తులు క‌ల్ప‌న‌తో పాటు క్యూలైన్ల క్రమ బద్దీకరణ, సేవాటికెట్లు, వసతి గృహాలు అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. రెండో దశలో రాష్ట్రంలోని ప్ర‌ధాన ఆల‌యాలైన యాదాద్రి, బాసర, వేములవాడ, భద్రాచలం ఆల‌యాల‌తో పాటు గ్రేట‌ర్ హైద‌రా‌బాద్ ప‌రిధిలో ఉన్న దేవాల‌యాల్లో ఆన్ లైన్ సేవ‌ల‌ను త్వ‌రిత‌గ‌తిన అందుబాటులోకి తెచ్చేందుకు క‌స‌ర‌త్తు కొన‌సాగుతుంది.  ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం వల్ల భక్తులకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు ఆలయాల్లో పారదర్శకత పెరిగి ఆదాయం కూడా పెరుగుతుంది.కాగిత రహిత కార్యాల‌యంగా దేవాదాయ శాఖ.ఫైళ్ల జాడ కనుక్కోవడానికే కాదు వాటిని సత్వరం పరిష్కరించడానికి ఇకపై దేవాదాయ శాఖ ప్ర‌ధాన‌ కార్యాలయంలో ఇ-ఆఫీసు విధానాన్ని అమ‌లు చేయనున్నాం. ఫైళ్ల ప‌రిష్కారానికి ఆన్ లైన్ ట్రాకింగ్ వ్య‌వ‌స్థ‌ను అందుబాటులోకి తీసుకురావాల‌ని  అధికారుల‌ను ఆదేశించ‌డం జ‌రిగింది. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను ఐటీఈ అండ్ సీ శాఖ‌ రూపొందిస్తోంది. దేవాదాయ శాఖ‌లో ఉన్న రికార్డుల‌ను డిజిట‌లైజ్ చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. రెవెన్యూ శాఖ చేప‌ట్టిన స‌మ‌గ్ర భూస‌ర్వే వ‌ల్ల దేవాదాయ శాఖ ఆల‌య భూముల‌కు సంబంధించి ఖ‌చ్చిత‌త్వం పెరిగింది.కామ‌న్ గుడ్ ఫండ్ ద్వారా చేప‌ట్టే ప‌నుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేందుకు పంచాయ‌తీ రాజ్ శాఖకు అప్ప‌గించడం జ‌రిగింది.