థియేటర్లలో ధరలకు కళ్లెం. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు.

హైదరాబాద్:
ఆగస్టు 1వ తేదీ నుండి సినిమా హాల్స్‌, మల్టిప్లెక్సుల్లో మంచినీటి బాటిళ్లు, కూల్‌డ్రింక్స్‌, ఇతర తినుబండారాలు కేవలం ఎంఆర్‌పి ధర ప్రకారం విక్రయాలు జరపవల్సి ఉంటుంది. ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేసినా, తూనికల కొలతల శాఖ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భారీ జరిమానా విధింపుతో పాటు జైలు శిక్ష తప్పదని తూనికల కొలతల శాఖ కంట్రోలర్‌ అకున్‌ సబర్వాల్‌ హెచ్చరించారు. విడిగా విక్రయించే తినుబండారాలు/పానీయాలకు సంబంధించి ధర, పరిమాణం వివరాలు స్టిక్కర్‌ రూపంలో కచ్చితంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. సినిమా హాల్స్‌, మల్టిప్లెక్స్‌లలో తినుబండారాలు అధిక ధరలకు అమ్ముతున్నట్లుగా గత కొంతకాలంగా ప్రేక్షకుల నుంచి లీగల్‌ మెట్రాలజీ శాఖకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో అధిక ధరల విక్రయానికి అడ్డుకట్ట వేయడానికి తూనికల కొలతల శాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. నిర్ణీత ధరలకే విక్రయించాలని స్పష్టం చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఇప్పటికే ఆయా ప్రాంతాలలోని థియేటర్‌ యాజమాన్యాలకు అవగాహన కల్పించింది. అగస్ట్‌ 1వ తేదీ నుండి కొత్త నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని, సమావేశంలో అధికారులను కంట్రోలర్‌ గారు ఆదేశించారు. థియేటర్లలో అధిక ధరల విక్రయాల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, కొత్త నిబంధనల అమలుపై కంట్రోలర్‌ అకున్‌ సబర్వాల్‌ ఆదివారం నాడు గాంధీనగర్‌లోని తూనికల కొలతల శాఖ కార్యాలయంలో అన్ని జిల్లాల తూనికల కొలతల అసిస్టెంట్‌ కంట్రోలర్‌లు, ఇన్‌స్పెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం కంట్రోలర్‌ మీడియాతో మాట్లాడుతూ, వినియోగదారుల కోసం ఉద్దేశించిన ఏ వ్యాపారం కానీ, ఏ సేవ కానీ, ఏ వినోదం కానీ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా జరగాలి. ఈ విషయంలో ఏ ఒక్క వినియోగదారుడికి నష్టం జరిగేలా థియేటర్ల యాజమాన్యాలు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆగస్ట్‌ 1వ తేదీ నుండి థియేటర్‌లు, మల్టిప్లెక్స్‌లలో ఎంఆర్‌పీ ధర ప్రకారం విక్రయాలు జరపాలి. తినుబండారాలు, మంచినీటి బాటిల్లు, కూల్‌డ్రింకులు నిర్ణీత ధరలకే విక్రయించాలి. విడిగా అమ్మే తినుబండారాలు అందించే కంటెయినర్లపై బరువు, పరిమాణం, తయారీ గడువు, తేదీలతో పాటు ఎంఆర్‌పీ స్పష్టంగా కనిపించేలా స్టిక్కర్‌ ఉండాలి. సెప్టెంబర్‌ 1వ తేదీ నుండి స్టిక్కర్‌ స్థానంలో ఎంఆర్‌పీ, పరిమాణం, బరువు కచ్చితంగా ముద్రించి ఉండాలి. ఇవన్నీ ప్రేక్షకులకు స్పష్టంగా కనిపించేలా బోర్డుపై ప్రదర్శించాలి. ధర మారితే ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేయాలి.ఒకే బ్రాండ్‌ తినుబండారాలు కాకుండా వినియోగదారుడికి వివిధ బ్రాండులు అందుబాటులో ఉంచాలి.తూనికల కొలతల శాఖ చట్టం ప్రకారం ప్యాకేజ్డ్‌ రూపంలో ఉన్న వస్తువులపై తయారీదారు పూర్తి చిరునామా, వస్తువు పేరు, తయారీ తేదీ, నికర బరువు, ఎంఆర్‌పీ, కస్టమర్‌ కేర్‌ వివరాలు ఉండాలి. తూనికల కొలతల శాఖ కొత్త నిబంధనల అమలుపై ఆగస్టు 2, 3 తేదీలలో గ్రేటర్‌ హైదరాబాద్‌, ఎచ్‌ఎండిఏ పరిధిలోని థియేటర్లు, మల్టిప్లెక్సుల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తాం. ఆ తరువాత 4, 5 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తాం. ఒకే ధర విధానాన్ని అమలు చేయాలి. బహిరంగ మార్కెట్‌లో ఏదైతే ఎంఆర్‌పీ ఉందో అదే ధరకు థియేటర్లలో కూడా విక్రయించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి కేసు నమోదు చేసి రూ. 25 వేలు, రెండోసారి రూ. 50 వేలు, మూడోసారి రూ. 1 లక్ష జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని కంట్రోలర్‌ హెచ్చరించారు. వినియోగదారుల ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 180042500333, వాట్సప్‌ నంబర్‌ 7330774444ను విధిగా సినిమా హాళ్లలో ప్రదర్శించాలి.