దళితులు కేసిఆర్ కు ఎందుకు ఓటు వేయాలి ?

సెంటిమెంటు రగిలించిన రాహుల్!

 

ఎస్.కె.జకీర్.

తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో అంబేద్కర్ ఒక ‘ప్రచార వస్తువు’ గా మారనున్నారు. అంబేద్కర్ పేరును కేసీఆర్ ఎలా విస్మరించారో, ఒక భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరు నుంచి అంబేద్కర్ ను తొలగించి ‘కాళేశ్వరం’ గా ఎలా మార్పు చేశారో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రజలకు అర్ధమయ్యేలా, వారిని సూటిగా తాకేలా వివరించారు. కేసీఆర్ తో తలపడాలంటే ఆయన లాగానే ‘మంత్రించిన మాటల’ను జనంపైకి వదలాలని కాంగ్రెస్ వ్యూహకర్తలు భావించి ఉంటారు. ఆ వ్యూహకర్తలు తెరవెనుక గట్టి ‘హోం వర్కు’ చేస్తున్నట్టు రాహుల్ ప్రసంగాలను బట్టి అర్ధమవుతున్నది. 2008 లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ”డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు”ను తుమ్మిడిహట్టి దగ్గర నిర్మాణం తలపెట్టింది. 7 జిల్లాల్లో 16 లక్షల 40 వేల ఎకరాలకు నీరందించాలని వై.ఎస్. రాజశేఖరరెడ్డి భావించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ దాన్ని రీ డిజైను చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చారు. అయితే రీ డిజైను చేసిన ప్రాజెక్టు వేరు, అంబెడ్కర్ ప్రాజెక్టు వేరు అన్నది ప్రభుత్వం వాదన. 2014 లో ఎన్నికల్లో గెలవడానికి గాను నాడు మొట్ట మొదటి తెలంగాణ ముఖ్యమంత్రిగా దళితుడినే చేస్తాననీ, ఒకవేళ తాను మాట తప్పితే మెడ కోసుకుంటాననీ దళిత సమాజాన్నినమ్మించిన వ్యక్తి కేసీఆర్. టిఆర్ఎస్ అధికారం చేబట్టిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అయ్యారో ప్రత్యేకంగా చెప్పవలసినవసరం లేదు. ఆయన హామీ ఇచ్చిన ‘మూడెకరాల భూమి పంపిణీ పథకం’ దారుణంగా విఫలమైంది. దళితులకు దీనిపై తీవ్ర ఆగ్రహం కలుగుతున్నది. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా ఏర్పాట్లను సబ్‌కమిటీ ముమ్మరం చేసింది. దేశంలోని వివిధ ఎత్తయిన విగ్రహాలపై సబ్‌కమిటీ అధ్యయనం చేసింది. సిక్కింలోని ‘రావంగ్ల’లో ఉన్న బుద్ధపార్క్ ను కూడా సబ్ కమిటీ సందర్శించినది. ”మొక్కుబడిగా విగ్రహం ఏర్పాటు చేయడం కాకుండా భక్తిభావం ఉట్టిపడేలా, చక్కటి పార్క్, ధ్యానమందిరం, మ్యూజియం ఉండాలి” అన్నది కేసీఆర్ అభిలాష. ఈ పార్క్‌ను కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ఎస్సీ అభివృదిశాఖ డైరెక్టర్ ఎంవీ రెడ్డి, రోడ్లు భవనాలశాఖసీఈలుగణపతిరెడ్డి, బీ శ్రీనివాస్‌రెడ్డి, హెచ్‌ఎండీఏసీఈబీఎన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీసీ.ఈసుభాష్‌సింగ్, జేఎన్టీయూకు చెందిన శిల్పరంగ నిపుణులు పరిశీలించారు. రావంగ్ల పార్క్‌లో 130 అడుగుల ఎత్తుతో ధ్యాన బుద్ధ విగ్రహం ఉంది. 2006లో గౌతమ బుద్ధుని 2550 జయంతి వేడుకలను పురస్కరించుకొని అక్కడి ప్రభుత్వం ఎత్తయిన బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయాలని సంకల్పించి సాకారం చేయడంతోపాటు అత్యంత సుందరంగా పార్క్‌ను కూడా తీర్చిదిద్దింది. ప్రస్తుతం ఇది దేశంలోనే గొప్ప పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా విరాజిల్లుతున్నది. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల ఎత్తున నిర్మాణం సంగతి పక్కన బెడితే ఆ మహనీయుని జయంతి లేదా వర్ధంతి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎక్కడైనా పాల్గొని నివాళులర్పించారా ? అటువంటి సన్నివేశాలేమైనా ఉన్నాయా ? అంటూ కొందరు జర్నలిస్టులు శనివారం ఆరా తీయడం కనిపించింది. అధికార పార్టీ హెడ్ క్వార్టర్ తెలంగాణ భవన్ లో అంబెడ్కర్ చిత్రపటం కొన్నాళ్ళు కనిపించిందని, ఇప్పుడు అదికూడా మాయమైనదని అంటున్నారు. కాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేసీఆర్ ప్రభుత్వాన్ని తూర్పార పట్టడంలో రాజీ లేని వైఖరిని ప్రదర్శిస్తున్నారు.

ఆదివాసీ భూముల రక్షణ, భూసేకరణ చట్టం, దళితులకు మూడెకరాల భూమి పంపిణీ, డబుల్ బెడ్ రూమ్ వంటి అంశాలు భైంసా సభలో ప్రస్తావించారు. నిజామాబాద్ జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, పసుపు బోర్డు ఏర్పాటులో వైఫల్యం వంటి అంశాలు కామారెడ్డి సభలో ప్రస్తావించారు. ప్రజలతో రాహుల్ గాంధీ ‘కనెక్టు’ కావడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఆయన సక్సెస్ అవుతున్నట్టు ప్రజల స్పందన బట్టి అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం వంటి గోండుయోధుడ్ని స్మరించడం ద్వారా ఆదివాసీలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ‘జల్ – జంగల్ – జమీన్ ‘ గురించి రాహుల్ మాట్లాడారు.రైతుల ఆత్మహత్యలు, రైతులకు మద్దతు ధర కల్పించడం, నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వడం వంటి అంశాలతో ప్రజల్ని రాహుల్ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అటు ప్రధాని మోడీ, ఇటు కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడుతున్నట్టు రాహుల్ ఆరోపణలు చేశారు.తెలంగాణలో 4500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, మద్దతుధర అడిగినందుకు రైతుల చేతులకు బేడీలు వేశారని రాహుల్‌ గాంధీ అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంపై రాష్ట్ర ఉద్యమం కొనసాగిందని, ప్రజా ఉద్యమం తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు.ఎన్నికల సమయంలో కేసీఆర్‌ మాటలు నమ్మి ఆయనను గెలిపించారని, తెలంగాణలో కొత్త శకాన్ని తీసుకొస్తారని ప్రజలు ఆశించారని అయితే కేసీఆర్‌ పాలనలో ప్రజల ఆశలు అడియాసలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలోనేకేసీఆర్‌ నిజస్వరూపాన్ని ప్రజలు గ్రహించారని అన్నారు. రాహుల్ గాంధీ భైంసా సభ ముగిసీముగియగానే’టివి. 9 ‘లో ఆయన ప్రసంగంపై ‘కౌంటర్’ చర్చ ప్రారంభమైంది. రాహుల్ ప్రసంగంలోని అంశాలపై యాంకర్ ప్రశ్నించడం, కరీంనగర్ ఎంపీ వినోద్ జవాబులు చెప్పడం టిఆర్ఎస్ వ్యూహంలో భాగమే. మొత్తంమీద రాహుల్ గాంధీ రాజకీయ పరిణితిని ప్రదర్శిస్తున్నారు. ఎక్కడిక్కడ స్థానిక, ప్రాంతీయ అంశాలపైనే ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించి ప్రసంగిస్తున్నారు.