దశ దిశ మారిన ప్రభుత్వ ఆస్పత్రులు.

సిద్ధిపేట:
నేను రాను బిడ్డో.. సర్కారు దవఖాను.. నేటి భారతం నుంచి.. నేను పోను బిడ్డో ప్రైవేటు దవాఖానాకు అనే మార్పు వైద్య రంగంలో వచ్చింది. ఒకప్పుడు ప్రైవేటు ఆసుపత్రిలో డెలివరీలు, ఇతర జబ్బుల విషయాలపై బిల్లు తక్కువ చేయించాలని ఫోన్లు వచ్చేవని, కానీ ఇప్పుడు సర్కారు దవాఖానాలో మంచం ఇప్పించాలని ప్రజలను విజ్ఞప్తులు వస్తున్నాయని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట శివమ్స్ గార్డెన్స్ లో సోమవారం సాయంత్రం రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా సిద్ధిపేట జిల్లాలోని బోధ వ్యాధి గ్రస్తులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఫించన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ మేరకు సిద్ధిపేట జిల్లాలోని 1162 మంది లబ్దిదారులకు ప్రతి నెల వెయ్యి రూపాయలు ఫించన్ పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి  హరీశ్ రావు చెప్పారు. జిల్లాలోని సిద్ధిపేట, గజ్వేల్ నియోజక వర్గాల పరిధిలోని బోధ వ్యాధి గ్రస్తులకు ఫించన్ల ప్రోసిడింగ్స్ కాపీ పత్రాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. సర్కారు దవాఖానలలో సేవలు పెరగడంతో నమ్మకం పెరిగిందని మంత్రి చెప్పారు. 60 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయంలో చేయని పనిని, టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి వచ్చాక వైద్య ఆరోగ్య రంగం పెను మార్పులు తెచ్చి చేసి చూపిస్తూ.. ప్రభుత్వ ఆసుపత్రుల దశ దిశ మార్చేశారని మంత్రి హారీశ్ రావు వెల్లడించారు. సిద్ధిపేటలో 300 పడకల ఆసుపత్రి దవఖాన సరిపోతలేదని ఇంకా మరిన్ని పడకలు ఎక్కువ కావాలని అడుగుతున్నారని.. పేద వారికీ సేవ చేయడమే మాకు కావాలంటూ.. మంత్రి తెలిపారు. సిద్ధిపేట జిల్లాలో నార్మల్ డెలివరీల సంఖ్య వందలో 73 మంది సర్కారు దవాఖానకు వెళ్తుండగా.., 27 మంది ప్రైవేటు దావఖానలకు పోతున్నారని మంత్రి వివరిస్తూ.. ప్రభుత్వ దవాఖానలలో చాలా మార్పు వచ్చిందన్నారు.
– రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి
కేసీఆర్ కిట్ రావడంతో.. 2 లక్షల 50 వేల మందికి 1200 కోట్ల లబ్ధి పొందారని, దీంతో పేద ప్రజలకు 1250 కోట్ల రూపాయలు మిగిలి.. బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మా రెడ్డి చెప్పారు. గతంలో కొంత చాలీ చాలని జీతాలతో ఆశా వర్కర్స్ ఇబ్బందులు పడేవారని టీఆర్ఎస్ ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించడంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఎక్కడ చూసినా సిద్ధిపేట నెంబర్ వన్ అంటూ.. ఇటీవల సౌత్ ఇండియాలో క్లీన్ సిటీగా పేరొందిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలలో ఎన్నో పథకాలు విజయవంతమయ్యాయని, ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక వెయ్యి రూపాయల ఫించన్ ఇవ్వడం జరుగుతున్నదని.., ఇంకా ఎవరెవరికీ ఇంకేం అవసరమని సీఎం కేసీఆర్ గుర్తిస్తున్నారని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ప్రభుత్వ పరంగా కావాల్సిన సహకారం అందించాలని భోధ వ్యాధి గ్రస్తులకు ఫించన్ ఇవ్వాలన్న డిమాండ్ ఉన్నదని ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ఫించన్ అందించాలని నిర్ణయించారని వెల్లడించారు. ఈ కార్యక్రమం మొదటగా సిద్ధిపేట నుంచే ప్రారంభం కావడం సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ.. 500 పై చిలుకు ప్రభుత్వ గురుకులాల పాఠశాలలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. సిద్ధిపేటలో 300 పడకల ఆసుపత్రిని ప్రారంభం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.