దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు.

హైదరాబాద్ :
అవసరమైన ఉపకరణాలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉచితంగా అందజేయనున్నట్లు దివ్యాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ కె.వాసుదేవరెడ్డి తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టామని, ఇందుకోసం ప్రభుత్వం రూ.14 కోట్లు కేటాయించిందని చెప్పారు. ఆయన కార్పొరేషన్‌ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి మంగళవారానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తన హయాంలో చేపట్టిన కార్యక్రమాలు, ఇతర అంశాలపై మాట్లాడారు. మొత్తం 460 మంది దివ్యాంగులకు వాహనాలు, ఉపకరణాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. కండరాల క్షీణత ఉన్న దివ్యాంగులకు ఆసరాగా ఉండేందుకు బ్యాటరీ వాహనాలు అందిస్తామన్నారు. 50మంది దివ్యాంగులకు వీటిని ఇవ్వనున్నట్లు చెప్పారు. 1000మంది బధిరులకు టచ ఫోన్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. పాత పథకాల కింద ల్యాప్‌టా్‌పలు, వినికిడి యంత్రాలను అందజేస్తామని వివరించారు. మానసిక దివ్యాంగులకు తొలిసారి ప్రత్యేకంగా కిట్లను అందించనున్నామన్నారు. వీటన్నింటినీ ఈనెలాఖరులోగా సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఇప్పిస్తామని తెలిపారు. నిమ్స్‌, గాంఽధీ, ఎంజీఎం ఆస్పత్రుల్లో కార్పొరేషన్‌ ప్రతినిధులను నియమించామని, ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలు అందజేస్తున్నామని వెల్లడించారు. అంధవిద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేందుకు నార్వేనుంచి నూతన బ్రెయిలీ 659 ఎస్‌డబ్ల్యూ మిషనను తెప్పించామని, రాష్ట్రంలోని అంధుల పాఠశాలలన్నింటికీ ఈ మిషన ద్వారా ముద్రించిన పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నామని, పలు కార్పొరేట్‌ కంపెనీలతో మాట్లాడి దివ్యాంగులకు ఉద్యోగాలు ఇప్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.