‘ది హిందూ’ని తాకిన మీటూ సెగ!!

తిరువనంతపురం:

మీటూ ఆరోపణల సెగ ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రిక ది హిందూని తాకింది. కేరళ బ్యూరోలో రెసిడెంట్ ఎడిటర్ గా ఉన్న సి. గౌరీదాసన్ నాయర్ తనను లైంగికంగా వేధించినట్టు ఢిల్లీకి చెందిన ఓ మహిళా జర్నలిస్ట్ యామినీ నాయర్ తన బ్లాగ్ పోస్టులో ఆరోపించారు. ఆ బ్లాగ్ లో పదేళ్ల క్రితం తనను ఎలా వేధించిందీ విపులంగా వివరించిన యామినీ ఆ పని చేసిందెవరో మాత్రం తెలుపలేదు. దానికి మరో మహిళ తనను కూడా గౌరీదాసన్ నాయర్ వేధించినట్టు కామెంట్ పెట్టింది. దీనికి జవాబుగా నాయర్ తన ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు.

ఈ వ్యవహారాన్ని ది హిందూ పబ్లిషింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్. రామ్ సీరియస్ గా తీసుకున్నారు. మీటూ ఆరోపణలపై నాయర్ వివరణ కోరారు. దీనికి బదులు గౌరీదాసన్ నాయర్ శెలవుపై వెళ్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ 31న రిటైర్ కావాల్సిన గౌరీదాసన్ నాయర్ కు ఏడాది పొడిగింపు ఇస్తామని ఇంతకు ముందు సంస్థ ఆఫర్ ఇచ్చింది. కానీ ఈ పరిస్థితుల్లో గౌరీదాసన్ నాయర్ సంస్థలో కొనసాగేందుకు నిరాకరించారు.