దీర్ఘకాలిక ఆలోచనలు శూన్యం. ఇన్స్టంట్ లబ్ధి ముఖ్యం.

ఎస్.కే. జకీర్.
రిజర్వేషన్ల కోసం మహారాష్ట్రలో మరాఠాలు మరోసారి ఉద్యమించారు. ఈ ఆందోళన సహేతుకమైన విధానాలు లేకుండా ఇచ్చే రాజకీయ హామీలపై అధ్యయనానికి చక్కని ఉదాహరణగా నిలిచింది. మరాఠాలకు రిజర్వేషన్లు ఇవ్వడంపై మహారాష్ట్రలోని ఏ రాజకీయ పార్టీకి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నిర్దిష్టమైన విధానంపై మాత్రం ఎవరికీ స్పష్టత లేదు. వివాదాస్పద విషయాలను దాటవేస్తూ పోటాపోటీగా జనాకర్షక విధానాలు చేపట్టాలన్న పార్టీల ఎన్నికల సమీకరణాలే దీనికి ప్రధాన కారణం. సామాజిక న్యాయ రాజకీయాలనే కొత్త తర్కం అన్ని రాజకీయ పార్టీలకు ఆయుధంగా అంది వచ్చింది. దీంతో రాజ్యాంగబద్ధంగా అందరికీ సమాన అవకాశాలు అనే ప్రాథమిక సూత్రం పక్కకి పోయి కోటా అనే కొత్త పదం ముందుకొచ్చింది. దీంతో ఇటీవల కాలంలో కోటా ఆందోళనలు పెరిగిపోతున్నాయి.దీర్ఘకాలిక ఆలోచన లేకుండా చేపట్టిన అభివృద్ధి విధానాల కారణంగా వచ్చిన దుష్ప్రభావాలకు రిజర్వేషన్లే మందుగా భావిస్తున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్, మహారాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు మెరుగ్గా ఉన్నాయి. అయితే ఆ రాష్ట్రాల్లో ఏర్పడిన తీవ్ర వ్యవసాయ సంక్షోభం, ఉద్యోగిత పెరుగుదలలో స్తబ్దత, అభివృద్ధి పథానికి ఆటంకాలు కలగడంతో ఆయా రాష్ట్ర ప్రజల్లో ఆందోళన ఏర్పడింది. వీటికి పరిష్కార మార్గాలు అన్వేషించడానికి బదులు రిజర్వేషన్లను తెరపైకి తీసుకురావడం అక్కడి ప్రభుత్వాలకు సులువైన మార్గంగా కనిపించింది. ఆర్థిక విధానాలు, సమస్యలకు మూల కారణాన్ని అన్వేషించే కన్నా ప్రజలలో తక్షణ స్పందన కనిపించే రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తడం అన్ని ప్రతిపక్షాలకు తేలికైన పని.సుదీర్ఘ కాలం పట్టే వ్యవస్థాగత సంస్కరణలు, మరమ్మత్తుల స్థానే రిజర్వేషన్లతో సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందనేది ఆందోళనకారుల ఆలోచన. 1960, 80లలో తలెత్తిన రిజర్వేషన్ ఉద్యమాల వెనుక సామాజిక వ్యవస్థలో తమకు అన్యాయం జరిగిందనే బలమైన భావోద్వేగాలు ఉండేవి. కానీ ఇవాళ జరుగుతున్న కోటా ఆందోళనలకు అభివృద్ధి విధానాల్లో అన్యాయం జరిగిందనే భావనే పునాదిగా ఉంది. 1980ల నుంచి వెనుకబాటుతనానికి చెప్పే అర్థంపై అనేక వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. రాజ్యాంగంలో పేర్కొన్న సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు ఆధారంగా సమాజంలోని వివిధ స్థాయిల్లో ఉన్న వెనుకబాటుతనాన్ని సరిచేసేందుకు మండల్ కమిషన్ కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించింది. ఇందులో ప్రాథమికంగా సామాజిక వెనుకబాటుతనం, తర్వాత విద్యాపరమైన వెనుకబాటు, చివరగా ఆర్థిక కారణాలను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఆర్థిక వెనుకబాటే రిజర్వేషన్ల డిమాండ్ కు ప్రధాన కారణంగా మారింది. దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఇతర వర్గాలలోని నిరుపేదలకు 10శాతం కోటాల ఇవ్వాలని ప్రతిపాదించారు. కానీ ఈ ఆలోచనకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.సంప్రదాయిక సామాజిక అన్యాయం కారణంగా ఏర్పడిన వెనుకబాటు కంటే ఎక్కువగా సమకాలీన ఆర్థిక వెనుకబాటుతో ఓబీసీ రిజర్వేషన్ల డిమాండ్ ముందుకొచ్చింది. ఇక్కడే రిజర్వేషన్ల అర్థం పూర్తిగా మారిపోయింది. ఆర్థిక వెనుకబాటును రిజర్వేషన్లతో లంకె పెట్టడానికి అనేక వర్గాలు, విధానకర్తలు మొగ్గుచూపడం ప్రారంభమైంది. ప్రస్తుత ఆర్థిక కష్టాలతో ఆందోళన చెందిన పటేళ్లు, మరాఠా ఆందోళనలకు ఇదే కేంద్ర బిందువు. అందుకని ఆర్థిక వెనుకబాటు కారణాలపై రిజర్వేషన్ల కోసం ఉద్యమించడం న్యాయబద్ధంగానే భావించాలి.
కానీ రాజకీయ బలం కోసం రిజర్వేషన్లు కోరడాన్ని మెరుగైన వాదనగా చెప్పవచ్చు. ప్రభుత్వాల ఏర్పాటు, వాటిలో స్థానాలు అన్నీ కూడా సంఖ్యాబలం ఆధారంగానే జరుగుతాయి. కర్ణాటకలో పెద్ద సంఖ్యలో ఉన్న లింగాయత్ ల చాలా కాలంగా రిజర్వేషన్లు కోరుతున్నారు. కానీ వెనుకబాటు నిర్ధారణ సంఘం తిరస్కరించింది. ఇటీవలి కాలంలో చేపట్టిన ఆందోళనలన్నీ ఇలాంటివే. ప్రజాస్వామ్యంలో వివిధ వర్గాలు తమ వెనుకబాటు తనం గురించి వాదనలు వినిపించి, డిమాండ్లు సాధించేందుకు ఉద్యమాలు జరపడం, వాటికి మద్దతుగా నిలిచే రాజకీయ బలం మధ్య సంబంధాలు అందరికీ తెలిసినవే. మండల్ రిజర్వేషన్ల తర్వాత వివిధ రాష్ట్రాల్లో బలమైన కులాల ఉద్యమాల వెనుక రాజకీయ ఉద్దేశాలు సుస్పష్టం. ఈ పరిణామం రిజర్వేషన్ ఉద్యమాల నిర్మాణాన్ని, సందర్భాన్ని పూర్తిగా మార్చివేశాయి.
రిజర్వేషన్లు సంఖ్యలతో కూడినవి కావడంతో ఎవరికి, ఎంత రిజర్వేషన్ ఇవ్వాలనే ప్రశ్న తలెత్తుతోంది. కొన్ని రాష్ట్రాలు ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా జరపాలని భావిస్తుంటే మిగతావి 1931 జనగణన ఆధారంగా చేయాలంటున్నాయి. అయితే కులాలు, వర్గాల ఆధారంగా చేయడం ఎంతో సంక్షిష్టమైనది. ఎందుకంటే వీటిలో కొన్ని చాలాకాలంగా ఒకదానిలో మరొకటి సమ్మిళితమయ్యాయి. ఇప్పుడు వివిధ కులాలకు రిజర్వేషన్ కేటాయింపులు జరపాలంటే ప్రభుత్వాలు కచ్చితమైన సమాచారం సేకరించాల్సి ఉంటుంది. రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానాలకు అతీతంగా ఉండే వ్యవస్థగా రిజర్వేషన్లు మారాయి.