దుర్గమ్మ సన్నిధిలో కేసీఆర్.

విజయవాడ:
ఇంద్రకీలాద్రిపై వెలసిన విజయవాడ కనకదుర్గ అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి చేయించిన ముక్కుపుడకను నెత్తిన పెట్టుకుని మేళతాళాల మధ్య కేసీఆర్‌ ఆలయంలోనికి ప్రవేశించారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్‌ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి కేసీఆర్‌ నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేసీఆర్‌ ముక్కపుడకను కనకదుర్గ అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు కేసీఆర్‌ గోత్ర నామాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్‌ సతీమణి, కోడలు, మనవలు, పలువురు బంధువులు, తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్‌ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు. ఈ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

Remove featured image