దేశం కోసం వాళ్ల ఇళ్లలో కుక్కయినా మరణించిందా? -మల్లికార్జున్ ఖర్గే.

 

ముంబాయి;

కొన్ని నెలల ముందుగానే దేశంలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీల నేతల విమర్శలు పదునెక్కుతున్నాయి. ఆరోపణలు, ప్రతి విమర్శల దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి. మహారాష్ట్రలోని ఒక ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే బీజేపీ, ఆర్ఎస్ఎస్ లపై తీవ్ర విమర్శలు చేశారు.దేశ స్వాతంత్ర్య పోరాటంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), బీజేపీ నేతల ఇళ్లలో కనీసం ఒక కుక్క కూడా మరణించలేదన్నారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో రెండో విడత జన సంఘర్ష్ యాత్ర ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో మాట్లాడుతూ ఖర్గే దేశం కోసం కాంగ్రెస్ నేతలు తమ జీవితాలను బలి ఇచ్చారని చెప్పారు. దేశ సమైక్యత కోసం ఇందిరా గాంధీ తన ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. దేశం కోసం రాజీవ్ గాంధీ తన జీవితాన్నే బలి పెట్టారని తెలిపారు. ఇలా దేశం కోసం బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల ఇళ్లలో కనీసం ఒక కుక్క అయినా మరణించిందా అని ప్రశ్నించారు. దేశ స్వాతంత్ర్యం కోసం మీరు జైలుకైనా వెళ్లారా అని ఖర్గే కాషాయ దళాన్ని నిలదీశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఖర్గే లోక్ సభలో ఇవే వ్యాఖ్యలు చేశారు. దీనికి జవాబుగా ప్రధాని మోడీ కాంగ్రెస్ స్వాతంత్ర్య సమర యోధులైన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ ల పాత్రను ఎప్పుడూ గుర్తు చేసుకోదు. కేవలం ఒక కుటుంబం మాత్రమే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిందని చెబుతుందని కౌంటర్ ఇచ్చారు.