దేశభక్తితో ముడిపడిన జాతీయవాదం. – మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.

నాగ్‌పూర్ : 
జాతీయవాదం, దేశభక్తి ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నాయని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్యక్రమంలో గురువారం ఆయన మాట్లాడుతూ భారతదేశం నేపథ్యంలో జాతీయవాదం గురించి తనకున్న అవగాహనను పంచుకుంటాననిచెప్పారు. దక్షిణాసియావ్యాప్తంగా హిందూయిజం ప్రభావం ఉందన్నారు. భారతదేశం మహనీయులకు పుట్టినిల్లని పేర్కొన్నారు. జాతీయవాదమంటే ఓ వ్యక్తి తన స్వంత దేశంతో గుర్తింపు పొందడమని, ఇది తన దేశం పట్ల అంకితభావం ప్రదర్శించడమని తెలిపారు. భారతదేశం తెరచి ఉంచిన సమాజమని చెప్పారు. మన దేశం అంతర్జాతీయంగా సిల్క్ రూట్ ద్వారా అనుసంధానమైందన్నారు. భారతదేశానికి వ్యాపారులు, ఆక్రమణదారులు వచ్చారన్నారు. శతాబ్దాల క్రితం మన దేశానికి వచ్చిన విదేశీ యాత్రికులు మన దేశంలో సమర్థవంతమైన పరిపాలన, గొప్ప విద్యా వ్యవస్థ ఉన్నాయని చెప్పారన్నారు.మన దేశంలోని చాలా విశ్వవిద్యాలయాలు దాదాపు 1,800 సంవత్సరాలపాటు ప్రపంచంలోని నలుమూలల నుంచి విద్యార్థులను ఆకర్షించాయన్నారు. సార్వత్రికవాదం నుంచి జాతీయవాదం ఉద్భవించిందని, ప్రపంచమంతటినీ మనం ఒకే కుటుంబంగా పరిగణిస్తామని చెప్పారు. సహనమే భారతదేశానికి బలమని తెలిపారు. ఆలోచనల భాగస్వామ్యాన్ని మనం శతాబ్దాల నుంచి విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అసహనం వల్ల మన జాతీయ గుర్తింపు నిర్వీర్యమవుతుందని హెచ్చరించారు. మన వైవిద్ధ్యాన్ని మనం సంతోషంగా స్వీకరిస్తామని చెప్పారు. మతం, అసహనం వంటివాటి ద్వారా మన దేశాన్ని నిర్వచించే ప్రయత్నం చేస్తే మన ఉనికి దెబ్బతింటుందని హెచ్చరించారు.
విద్వేషం వల్ల జాతీయవాదం నిర్వీర్యమవుతుందన్నారు. అసహనం వల్ల మన జాతీయ గుర్తింపు నిర్వీర్యమవడం తప్ప వేరొక ప్రయోజనం ఉండదని తెలిపారు. మన దేశంలో ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాలను చాలా రాజవంశాలు పరిపాలించాయన్నారు. ఆలోచనల సంగమం, అవగాహన సుదీర్ఘంగా జరిగిన అనంతరం మన దేశం ప్రత్యేక గుర్తింపును సాధించిందన్నారు. బహుళ సంస్కృతులు, విశ్వాసాలు మనల్ని ప్రత్యేకమైనవారిగా, సహనం కలవారిగా మార్చాయన్నారు. తాను కళ్ళు మూసుకుని, భారత దేశం గురించి కలలు కంటున్నపుడు, త్రిపుర నుంచి ద్వారక వరకు, కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ఉన్న అనేక అంశాలను గుర్తు చేసుకుంటానన్నారు. లెక్కలేనన్ని మతాలు, వేర్వేరు భాషలు, మాండలికాలు, జాతులు, కులాలు ఒకే రాజ్యాంగం క్రింద సహజీవనం చేస్తూ ఉండటాన్ని తాను అద్భుతంగా భావిస్తున్నానని అన్నారు. మన దేశంలో 122 భాషలు, 1,600 మాండలికాలు, 7 ప్రధాన మతాలు, మూడు ప్రధాన ప్రాదేశిక వర్గాలు ఉన్నాయని, ఇవన్నీ ఒకే వ్యవస్థ క్రింద సహజీవనం చేస్తున్నాయని పేర్కొన్నారు. భారతదేశాన్ని వైవిద్ధ్యభరితం చేస్తున్న అంశం ఇదేనన్నారు. ప్రజా సంబంధాల్లో చర్చలు అవసరమని తెలిపారు. అభిప్రాయాల్లో బహుళత్వాన్ని నిరాకరించకూడదన్నారు. చర్చల ద్వారా మాత్రమే సంక్లిష్ట సమస్యలను పరిష్కరించుకోగలుగుతామని చెప్పారు.,అవి చెప్పేందుకే వచ్చానన్నారు.