దేశవ్యాప్తంగా ‘ఆధార్’ కలకలం.

న్యూఢిల్లీ:
ఆధార్ నెంబర్ భద్రతపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా ఆధార్ అథారిటీకి మరో పెద్ద సవాల్ ఎదురైంది. శుక్రవారం ఉదయం దేశంలోని కోట్లాది మొబైల్ యూజర్లు తమ ఫోన్లు చూసి షాకయ్యారు. వాళ్లు సేవ్ చేసుకోకుండానే ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఆధార్‌కార్డును జారీ చేసే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) హెల్ప్‌లైన్ నంబర్ వచ్చి చేరింది. గతంలో ఉన్న 1800-300-1947 నంబర్‌ను కొత్తగా 1947గా యూఐడీఏఐ మార్చింది. ఈ కొత్త నంబర్ ఆటోమెటిగ్గా కాంటాక్ట్ లిస్ట్‌లోకి రావడం ఆశ్చర్యపరిచింది. దీనిపై ఆందోళన చెందిన ఎందరో ఆధార్ అథారిటీకి ఫిర్యాదు చేశారు. తమ ఫోన్ల కాంటాక్ట్ లిస్టులో తాము సేవ్ చేయకుండానే ఉడాయ్ టోల్ ఫ్రీ నంబర్ కనిపిస్తోందని తెలిపారు.
ఈ విషయంపై గంటల వ్యవధిలోనే వందల కొద్దీ స్క్రీన్‌ షాట్లు ట్విటర్‌లో షేర్‌ అయ్యాయి. తమ సమ్మతి లేకుండా తమ ఫోన్లలో ఈ నెంబర్‌ను ఎలా యాడ్‌ చేస్తారంటూ యూజర్లు మండిపడుతున్నారు. మీరేం చేస్తున్నారు? మా అంగీకారం లేకుండా మా ఫోన్‌లో యూఐడీఏఐ నెంబర్‌ సేవ్‌ చేయమని ఎవరు చెప్పారు? అంటూ ఓ ట్విటర్‌ యూజర్‌ మండిపడ్డారు. ఇప్పుడే మేము దీన్ని నోటీస్‌ చేశాం. చాలా కొత్త మొబైల్స్‌.. ముఖ్యంగా శాంసంగ్‌, మైక్రోమ్యాక్స్‌ ఫోన్లు యూఐడీఏఐ 1947 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ప్రీ-స్టోర్‌ చేసుకుని వస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో ఇలా చేస్తున్నారా? అని మరో యూజర్‌ ప్రశ్నించారు. మా అనుమతి లేకుండా యూఐడీఏఐ నెంబర్‌ను కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఎలా స్టోర్‌ చేస్తారంటూ చాలా మంది యూజర్లు ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి పలు స్క్రీన్‌ షాట్లను షేర్‌ చేస్తున్నారు. దీనిపై యూఐడీఏఐ స్పందించాలని యూజర్లు సీరియస్‌ అవుతున్నారు. ఆధార్ హెల్ప్ లైన్ నెంబర్ ను 1800-300-1947గా మార్చినట్టు యుఐడీఏఐ ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదు. తాము ఏ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ లేదా మొబైల్ తయారీ సంస్థల‌కు త‌మ నంబ‌ర్‌ను చేర్చాల‌ని కోర‌లేద‌ని యూఐడీఏఐ వివ‌ర‌ణ ఇచ్చింది. తమ హెల్ప్ లైన్ నెంబర్ 1800-300-1947 కానే కాదని 1947 మాత్రమే తమ టోల్ ఫ్రీ నెంబర్ అని ప్రకటించింది. అయితే యూఐడీఏఐ గతంలో ఇదే టోల్ ఫ్రీ నెంబర్ వినియోగించేదని న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ చెబుతోంది. రెండేళ్ల నుంచి కొత్త 1947కి మార్చిందని తెలిపింది. కొందరు వ్యక్తులు దురుద్దేశంతో ఫోన్ వినియోగదారులను అయోమయానికి గురిచేసేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ వ్యవహారంపై టెలికాం కంపెనీలు నోరు విప్పలేదు. ఇప్పుడు ఎవరి మొబైల్ ఫోన్లలోకి ఈ నెంబర్ వచ్చిందో అలా ఎలా వచ్చింది? ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టోల్ ఫ్రీ నెంబర్ గా ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేస్తే అసలు కాల్ కనెక్ట్ కావడం లేదు. మొన్న ఆధార్ చైర్మన్ ఆర్‌.ఎస్. శర్మ ఆధార్ నెంబర్ సవాల్ ని అతి సులభంగా ఛేదించిన ఫ్రెంచ్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ ఇలియాట్ ఆల్డర్సన్ ఈ తాజా పరిణామాన్ని ప్రశ్నించారు. చాలా మంది వివిధ సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నవాళ్లు, ఆధార్ ఉన్నవాళ్లు, లేనివాళ్లు.. ఎంఆధార్ యాప్ ఉన్నవాళ్లు, లేనివాళ్లు.. అందరికీ వాళ్ల మొబైల్స్‌లోకి ఆధార్ ఫోన్ నంబర్ వచ్చింది. అదీ వాళ్లకు తెలియకుండానే.. దీనిపై మీ వివరణ ఏంటని నిలదీశారు.