దేశాన్ని కుదిపేస్తున్న ‘రాఫెల్’ !!

Raffle

న్యూఢిల్లీ:
దేశ రాజకీయాలను కుదిపేస్తున్న రాఫెల్‌ వివాదం.. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో దేశమంతా హాట్‌ టాపిక్‌గా మారింది. విపక్షాలన్నీ ముక్తకంఠంతో రాఫెల్‌పై ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటిస్తున్నాయి. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు భారీ ఎత్తున ముడుపులు చేతులు మారాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ డీల్‌లో ఈ ఏదో గూడుపుఠాని ఉందని సామాన్య ప్రజలు కూడా అనుమానిస్తున్న సమయంలో ‘ద వైర్‌’ వెబ్‌సైట్‌ మరో సంచలన కథనాన్ని ఇవాళ ప్రచురించింది. అనిల్‌ అంబానీతో రాఫెల్‌ తయారీ కంపెనీ దాసో రహస్య డీల్‌ను ఈ వెబ్‌సైట్‌ బట్టబయలు చేసింది. ఈ మొత్తం డీల్‌ కేవలం అనిల్‌ అంబానీ జేబులోకి కోట్లు కుమ్మరించే డీల్‌ అన్న అనుమానం మరింత బలపడేలా చేసింది. ద వైర్‌ కథ ప్రకారం ఏ పనీపాటా లేకుండా మూసివేతకు సిద్ధంగా ఉన్న అనిల్‌ అంబానీ కంపెనీలో మైనారిటీ వాటాను కొని ఏకంగా రూ. 284 కోట్లను దాసో ఇచ్చిన వాస్తవానికి బయటపెట్టింది.
ద వైర్‌ ఏమందంటే…
అనిల్‌ అంబానీకి రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీకి రిలయన్స్ ఎయిర్ పోర్ట్ డెవలపర్స్ లిమిటెడ్ (ఆర్ఏడీఎల్)అనే వంద శాతం అనుబంధ కంపెనీ ఉంది. ఈ అనుబంధ కంపెనీలో 34.7 శాతం కొనుగోలు చేసిన దసాల్ట్ ఏకంగా రూ. 284 కోట్లు (40 లక్షల యూరోలు) చెల్లించింది. భారత ప్రభుత్వానికి రిలయన్స్‌ ఇన్‌ఫ్రా సమర్పించిన పత్రాల ప్రకారం చూస్తే… రిలయన్స్ ఎయిర్ పోర్ట్ డెవలపర్స్ లిమిటెడ్ (ఆర్ఏడీఎల్)కు చెందిన రూ. 10 ముఖ విలువ కలిగిన 24,83,923 షేర్లను దసాల్ట్‌ కొనుగోలు చేసింది. ఈ డీల్‌ జరిగింది 2016-17 ఆర్థిక సంవత్సరంలో. దీనికిగాను దసాల్డ్‌ కంపెనీ అనిల్‌ అంబానీ కంపెనీకి రూ. 284.19 కోట్లు చెల్లించింది. కంపెనీ వార్షిక నివేదికలో ఈ డీల్‌ వల్ల రూ. 284.19 కోట్ల లాభం వచ్చినట్లు రిలయన్స్‌ ఇన్‌ఫ్రా పేర్కొంది.
అయితే ఆర్ఏడీఎల్ లో వాటాను అంటే ఒక్కో షేర్‌ విలువను ఏ ప్రాతిపదికపై విలువ కట్టారు? అసలు దసాల్ట్ తన వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేని కంపెనీని ..అందులోనూ ఆదాయమే లేని, లిస్ట్ కాని ఓ కంపెనీలో దసాల్ట్‌ ఎందుకు 35% భారీ వాటాను కొనుగోలు చేసిందనేది ప్రశ్నార్థకంగా మారింది.
అమ్మకానికి సంబంధించిన షరతులేంటో చెప్పకుండా రిలయన్స్ ఇన్‌ఫ్రా ఈ వాటాలను అమ్మింది. మార్చి 2017తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఎయిర్ పోర్ట్ డెవలపర్స్ రూ.10.35 లక్షల నష్టం చూపించింది. మార్చి 2016లో ఈ సంస్థ నష్టాలు రూ.9 లక్షలుగా ఉన్నాయి. దసాల్ట్‌ డీల్‌తో ఏ పనీ చేయకుండా తన ఖాతాలోకి రూ. 284 కోట్లను వేసుకుంది. ఈ కంపెనీకి తన గ్రూపుకే చెందిన పలు అనుబంధ సంస్థల్లో వాటాలు ఉన్నాయి. వాటిలో చాలా కంపెనీలు నష్టాల పాలయ్యాయి.

అనిల్‌ అంబానీ కంపెనీలకు మహారాష్ట్ర ప్రభుత్వం 2009లో రూ.63 కోట్లకు ఇచ్చిన ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయి. అక్టోబర్ 2015లో బిజినెస్ స్టాండర్డ్ అనే బిజినెస్‌ డైలీ కథనం ప్రకారం పనుల్లో పురోగతి లేని కారణంగా వాటిని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని అనుకుంటోందని ఆ పత్రిక రాసింది. ఎయిర్ పోర్టు ప్రాజెక్టుల నుంచి విరమించుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు కూడా మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ హఠాత్తుగా జనవరి 2017లో మనసు మార్చుకొని కొనసాగింది. మరి నష్టాల పాలై మూసేయడానికి సిద్ధంగా ఉన్న ఇలాంటి కంపెనీలో దసాల్ట్ ఎందుకు పెట్టుబడి పెట్టింది? అది కూడా రూపాయైనా ఆర్జించని కంపెనీ నుంచి తిరిగి ఏం వస్తుందని నమ్మిందనేది మిలియన్ డాలర్ ప్రశ్న.
ఫ్రాన్స్‌ కంపెనీ ఖాతాల్లో…
ఈ డీల్‌ గురించి దసాల్ట్ ఏవియేషన్ కూడా తన ఖాతాల్లో పేర్కొంది. తన 2017 వార్షిక నివేదికలో ఓ లిస్ట్‌ కాని కంపెనీలో (ఆర్ఏడీఎల్ నుంచి) 34.7% వాటాను కొనుగోలు చేసినట్లు పేర్కొంది. విమానాశ్రయాల మౌలిక వసతుల అభివృద్ధి, నిర్వహణను చూస్తున్న ఈ కంపెనీలో వాటా తీసుకోవడం ద్వారా భారత్ లో కంపెనీ బలోపేతం అయిందని పేర్కొంది.
ఇదేం పని?
మరోవైపు రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తన వెబ్ సైట్ లో రిలయన్స్ ఎయిర్ పోర్ట్స్ వార్షిక నివేదికను పెట్టింది. అందులో దసాల్ట్ ఏవియేషన్‌కు 34.79% సాధారణ షేర్లను అమ్మినట్లు స్పష్టంగా పేర్కొంది. కానీ ఈక్విటీ షేర్లకు సంబంధించిన నిబంధనలు, అధికారాల గురించి వివరించే చోట… ఆ షరతులు కనబడకుండా బ్లాకౌట్‌ చేసింది.(దిగువ ఫొటో చూడండి) వీటన్నిటికీ తోడు ఈ ఈ మొత్తం డీల్ రాఫెల్ కొనుగోలు ఒప్పందం తర్వాత జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.