దేశ రాజకీయాలను శాసించనున్న కేసీఆర్.

భద్రాద్రి కొత్తగూడెం:
ఫెడరల్ ఫ్రంట్ ద్వారా దేశ రాజకీయాలను టీఆర్ఎస్ శాసించబోతుందని ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. దేశంలో మళ్లీ సంకీర్ణ యుగం రాబోతుందన్నారు. భద్రాచలంలో నిర్వహించిన టీఆర్ఎస్ కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతులకు ఎంపీ వినోద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు మెజారిటీ రాదని, టీఆర్ఎస్ ఇటు రాష్ట్రంలో, అటు దేశంలో కీలక పాత్ర పోషించబోతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా 25 ఎంపీ సీట్లు గెలిచే పరిస్థితి లేదన్నారు.కర్నాటకలో గెలవకమందే బీజేపీ సంబురాలు చేసుకుందని, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి సంబరాలు చేసుకుందని ఆయన ఎద్దేవా చేశారు. దేశంలో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోందని, 2019 లో ప్రాంతీయ పార్టీలు అత్యధిక ఎంపీ సీట్లు గెలవబోతున్నాయని చెప్పారు. తెలంగాణ పథకాలు మానవత్వంతో కూడుకున్నవని ఎంపీ వినోద్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుని చూసి 17 రాష్ట్రాల అధికారులు మెచ్చుకున్నారని వెల్లడించారు. రాబోయే రెండు ఏళ్లలో తెలంగాణ రాష్ట్రమే విద్యుత్ ను ఇతర రాష్ట్రాలకు అమ్మబోతోందని తెలిపారు. 16 ఎంపీలు, 100 అసెంబ్లీ సీట్లతో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తారని వినోద్ స్పష్టం చేశారు.