‘ద్రోహ’ కాల్ !!

ఎస్.కె.జకీర్.
ముఖమ్మీద పెద్ద గాటు. గళ్ళ లుంగీ. బొడ్లో కత్తి. దాదాపు మూడు, నాలుగు దశాబ్దాల కిందట తెలుగు సినిమాల్లో విలన్ లేదా విలన్ అనుచరగణం వస్త్రధారణ అది. విలన్అనగానేకరకుగా, మొరటుగా కనిపించాలి. భయపెట్టేలా ఉండాలి. అతన్ని చూసి చిన్నపిల్లలు, ఆడవాళ్లు జడుసుకోవాలి. అప్పటి సినిమాలలో ఇదే రొటీన్ ఫార్మేట్ ఉండేది. 90 ల తర్వాత పుట్టినవారెవరికీబహుశా నాటి సినిమాల తీరుతెన్నులు, మూస ఫార్ములా పెద్దగా తెలిసే అవకాశం లేదు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అలాంటి విలన్ పాత్రతో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పోల్చారు. ఇది కాకతాళీయం కాదు. నిజామాబాద్ కు పార్టు 2 ప్రసంగం. శుక్రవారం పార్టు 3 కూడా మనం వనపర్తిలో చూడవచ్చు. వినవచ్చు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబును ఎంత మేరకు తిట్టగలిగితే ఆ మేరకు ఈవిఎంలలో ఓట్ల జడివాన కురుస్తుందని కేసీఆర్ భావిస్తున్నారేమో ! కేసీఆర్ భాష, తిట్లు, దూషణలు, నిందారోపణలు మరింత పదునెక్కే అవకాశం కనిపిస్తున్నది. ”చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి. బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు. చీరి పారెస్తడు” అని కేసీఆర్ అన్నారు. ఆయన తెలుగు భాషను, తెలంగాణా మాండలికాన్ని ఎంతగా ఫుట్ బాల్ ఆడుకుంటారో తెలంగాణ ప్రజలకు తెలుసు. కేసీఆర్ స్వరపేటికే తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడానికి ముఖ్య కారణం. ఇప్పుడు ‘ముందస్తు’ అసెంబ్లీ ఎన్నికల వేళ చంద్రబాబును ఎందుకు కేసీఆర్ తన లక్ష్యంగా ఎంపిక చేసుకున్నారో అర్ధం చేసుకోవడం కష్టం కాదు. తెలంగాణా లో తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీని, పార్టీ నాయకులను తిట్టడం కన్నా చంద్రబాబును తిట్టడానికి కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారు.

కేంద్రంలో ఈ సారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన నాటి నుంచి సమస్య మొదలయింది. హైదరాబాద్ చుట్టుపక్కల కనీసామ్23అసెంబ్లీ నియోజకవర్గాలలో ‘ సెటిలర్స్’ ఉన్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి చాలాకాలం క్రితమే వచ్చి స్థిరపడ్డవారు జి.హెచ్ఎం.సి.ఎన్నికల్లో టిఆర్ఎస్ కు అనుకూలంగా ఓటు వేసిన మాట నిజం. కానీ ఆంధ్రప్రదేశ్ కు రావలసిన’ప్రత్యేక హోదా’ ఇవ్వకపోవడం పట్ల బిజెపి పట్ల, బిజెపి ‘రహస్యమిత్రుని’ గా ముద్రపడిన కేసీఆర్ పట్ల ‘సెటిలర్ల’ లో ఆగ్రహం ఉన్నట్టు ఒక ప్రచారం ఉన్నది. అందులో కొంత నిజం ఉండవచ్చు.కొంత కల్పన కూడా కావచ్చు. తెలంగాణలో స్థిరపడిన వారంతా తెలంగాణ వాళ్ళే నాని కేసీఆరే స్వయంగా చాలాసార్లు చెప్పారు. కనుక సెటిలర్స్ పట్ల భయాందోళనలు అవసరం లేదు. మరి చంద్రబాబును తెలంగాణ ప్రజల ముందు ‘దోషి’గా నిలబెట్టే ప్రయత్నానికి శ్రీకారం చుట్టడం వెనుక కారణాలను వెతకవలసి ఉన్నది. ఇక్కడ స్థిరపడిన ఒక సామాజికవర్గం, ఆ సామాజికవర్గం ప్రభావితం చేసే మరికొన్ని శక్తులు ‘మానసికంగా’ చంద్రబాబుతో ఉంటారని కేసీఆర్ అనుకుంటున్నారేమో! కేసీఆర్ నిజామాబాద్, నల్లగొండ సభలలో చంద్రబాబునే టార్గెట్ చేశారు.

ఏ.పి.కిప్రత్యేకహోదా ఇస్తామన్న కాంగ్రెస్ వైపు ‘సెటిలర్స్’ మొగ్గు జూపకుండా ఉండాలని ఆయన అనుకుంటున్నట్టు భావించవలసి వస్తున్నది. కాంగ్రెస్ కు గత ఎన్నికల్లో 21, తెలుగుదేశం పార్టీకి 15 అసెంబ్లీ స్థానాలు లభించాయి. కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, జనసమితి ఒక ‘కూటమి’గా రంగంలోకి దిగబోతున్నవి. ‘కూటమి’ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో గానీ ‘కూటమి’ ఏర్పాటు పట్ల కేసీఆర్ లో భయం నెలకొంటున్నట్టురాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. అందుకే ‘కూటమి’ని కేసీఆర్ చెండాడుతున్నారు. ”తెలంగాణను నాశనం చేయడానికి కూటమి కట్టారు. తెలంగాణా పాలిట కాలకూట విషం. తెలంగాణలో రాజకీయ అస్థిరత కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇది చిల్లర రాజకీయం. కాంగ్రెస్, టీడీపీలకుఓటేస్తే ఢిల్లీ, అమరావతిలకు గులాంలుగా బతకాల్సి వస్తుంది . నేను మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు గతి ఏమవుతుందో తెలుసుకోవాలి. నాలుగేళ్లలో తెలంగాణను ఎంతో అభివృద్ధి చేసుకున్నాము. మళ్లీ తాము అధికారంలోకి వస్తే తెలంగాణను మరింతగా అభివృద్ధి చేసుకుంటాము” అంటూ కేసీఆర్ ప్రసంగం కొనసాగింది. ”తెలంగాణలో మజ్లిస్ గెలుచుకునే ఏడు స్థానాలు పోగా 110 స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని తాజా సర్వేలో తేలింది. ఇక నల్లగొండ జిల్లాలోని మొత్తం 12 స్థానాల్లో టీఆర్‌ఎస్గెలవబోతుంది.

ఇది సత్యం. జానారెడ్డి, ఉత్తమ్ గోచీలుఊడబోతున్నాయి”. అని కూడా కేసీఆర్ చెప్పారు. ప్రజల్ని, టిఆర్ఎస్ కార్యకర్తల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ సర్వే నిజమేననుకుంటే ప్రతిపక్షాలపైనా, ముఖ్యంగా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పైన ఇంతగా మాటల తూటాలు విసరవలసిన అవసరం ఏమిటి? కేసీఆర్ కథనం ప్రకారం మజ్లిస్, టిఆర్ఎస్ కు పోను మిగిలినవి 2 అసెంబ్లీ సీట్లే. ఆ రెండు సీట్ల కోసం కాంగ్రెస్ ‘కూటమి’ కట్టడం ఎందుకు? అధికారంలో ఉన్న పార్టీ అధ్యక్షునిగా ఇలాంటి నెంబర్ గేమ్ చెప్పగలిగితే జనంలో సులభంగా నాటుకుంటుందని కేసీఆర్ నమ్మకం. అయితే కేసీఆర్ 2014 నుంచి 2018 వరకు చేసినవి, 2019తర్వాతాచేయబోయేవిచెప్పడానికంటే1992 నుంచి ‘ఫ్లాష్ బ్యాక్’ కథనాలు చెప్పడానికి ప్రాధాన్యం ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ‘తెలంగాణ’ పేరిట అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రిమండలిలో జానారెడ్డి స్థానం దక్కించుకున్న విషయం, ఇతరత్రా… విషయాలన్నీ తెలంగాణ అవతరణకు ముందు జరిగినవి. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం అవి జనానికి అప్రస్తుతంగా అనిపిస్థాయి. తెలంగాణ రాకుండా అడ్డుపడినవాళ్లు, అడ్డుకున్నవాళ్ళు, కుట్రలు చేసిన వాళ్ళు, దోషులు, ద్రోహులతో జనానికి పని లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలని అధికారం కట్టబెట్టిన పార్టీ తమకు ఏమిచేసిందో? ఇంకా ఏమిచేయనున్నదో? అని జనం చర్చించుకుంటారు. బేరీజు వేసుకుంటారు.