ద్విచక్ర వాహనాలపై ఫెస్టివల్ ఆఫర్.

న్యూఢిల్లీ:

పండుగ సీజన్ వచ్చిందంటే వ్యాపార వర్గాలు పండుగ చేసుకుంటాయి. తమ అమ్మకాలు పెంచుకొనేందుకు వ్యూహాత్మకంగా భారీ రాయితీలు, అదనపు సౌకర్యాల వంటివెన్నో ప్రకటిస్తాయి. వరుసగా వచ్చే దసరా, దీపావళి పండుగల సందర్భంగా ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు ఫెస్టివల్ ఆఫర్ల వరదకు గేట్లు తెరిచాయి. భారీ డిస్కౌంట్లు అందిస్తూ కస్టమర్లకు గాలం వేస్తున్నాయి. బజాజ్ ఆటో ఎంపిక చేసిన కొన్ని మోటార్ సైకిళ్లపై 5-5-5 స్కీమ్ ను ప్రకటించింది. ప్లాటినా, డిస్కవర్, పల్సర్, వీ15, వీ12 మోడల్ మోటార్ సైకిళ్లకు 5-5-5 స్కీమ్ అందిస్తున్నట్టు తెలిపింది. ఈ పథకం కింద 5 ఏళ్ల ఫ్రీ ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ కవర్, 5 ఏళ్లపాటు ఉచిత సర్వీస్, 5 ఏళ్లకు ఉచిత వారంటీ ఇస్తారు. దీంతో వినియోగదారులకు రూ.4,000-5,000 వరకు డబ్బు మిగులుతుందని బజాజ్ అంటోంది. కొత్తగా ప్రవేశపెట్టిన ఆటో ఇన్సూరెన్స్ నిబంధనల కారణంగా మోటార్ సైకిళ్ల ఆన్-రోడ్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు తమ కొత్త పథకం వల్ల ఆ మేరకు కస్టమర్లకు మేలు జరుగుతుందని బజాజ్ చెబుతోంది.మరో దిగ్గజ ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటోకార్ప్ కూడా వినియోగదారులకు పలు ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 10 వరకు రూ.4,999 మొత్తం మాత్రమే చెల్లించే లో డౌన్ పేమెంట్ ఫైనాన్స్ స్కీమ్ ప్రవేశపెడుతున్నట్టు తెలిపింది. ఇంతే కాకుండా పేటీఎం మాల్ లో కొనుగోలు చేస్తే ఏ వాహనంపైన అయినా రూ.5,000 ప్రయోజనం అందించనున్నట్టు చెప్పింది. ఎవరికైనా సిఫార్సు చేసినా ప్రయోజనాలు అందజేయనున్నట్టు ప్రకటించింది. టీవీఎస్ మోటార్స్, సుజుకీ, యమహా, హోండా వంటి ఇతర ద్విచక్ర వాహన తయారీ సంస్థలు ఇంకా తమ పండుగ ఆఫర్లను ప్రకటించాల్సి ఉంది.