‘ద యాక్సిండెంటల్ ప్రైమ్ మినిస్టర్‘ దర్శకుడు అరెస్ట్.

ముంబయి:
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ జీవిత ఆధారంగా రూపొందుతున్న ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ సినిమా దర్శకుడు విజయ్ రత్నాకర్ గుట్టేని ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు. విజయ్ గుట్టేకి చెందిన వీజీఆర్ డిజిటల్ కార్పొరేషన్ రూ.34 కోట్ల మేర జీఎస్టీ ఫ్రాడ్ చేశారని జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ వింగ్‌ చెప్పింది. హారిజన్ ఔట్ సోర్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి యానిమేషన్, మ్యాన్ పవర్ కోసమని వీజీఆర్ డిజిటల్ కార్పొరేషన్ రూ.34 కోట్ల నకిలీ ఇన్వాయిస్ తీసుకొంది. నకిలీ ఇన్వాయిస్‌ ద్వారా రూ.34 కోట్ల జీఎస్టీ క్రెడిట్‌ను విజయ్‌ గుట్టే కంపెనీ వీజీఆర్‌ డిజిటల్‌ క్లయిమ్‌ చేసుకుందని జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ వింగ్‌ తెలిపింది. నకిలీ ఇన్వాయిస్ ఇచ్చిన హారిజన్ కంపెనీపై రూ.170 కోట్ల జీఎస్టీ మోసం ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ రెండు కంపెనీలు ప్రభుత్వ డేగకళ్లలో పడ్డాయి. విజయ్‌, ప్రముఖ మహారాష్ట్ర వ్యాపారవేత్త రత్నాకర్‌ గుట్టే కొడుకు. రత్నాకర్‌ కూడా రూ.5500 కోట్ల ఇంజనీరింగ్‌ స్కాం ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారుడు సంజయ్‌ బారు రాసిన పుస్తకం ఆధారంగా ‘ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్‘ తెరకెక్కుతుంది. ఈ మూవీని విజయ్‌ గుట్టే దర్శకత్వంలో బోహ్రా బ్రదర్స్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మన్మోహన్‌ సింగ్‌గా అనుపమ్‌ ఖేర్‌ నటిస్తున్నారు. దివ్యా సేఠ్, మన్మోహన్‌ భార్య గుర్ శరణ్ కౌర్ పాత్ర పోషిస్తున్నారు. డిసెంబర్‌ 21న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది.