ధరపై అభ్యంతరం తెలిపినా కొన్నారు. ‘రాఫెల్’ చిక్కుల్లో మోడీ సర్కారు.

ప్రకాశ్, న్యూఢిల్లీ:

ఫ్రాన్స్ కంపెనీ దస్సాల్ట్ తో 36 రాఫెల్ ఫైటర్ జెట్ విమానాల కొనుగోలు ఒప్పందం కుంభకోణం, అందులోని లొసుగులపై రోజుకో వార్త బయటికి వస్తుండటం కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేస్తోంది. ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రచురించిన సంచలనాత్మక కథనం ప్రకారం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై మోడీ సర్కార్ తుది నిర్ణయానికి వచ్చే నెల రోజుల ముందు కమిటీ సభ్యుడు ఒకరు రిపోర్ట్ ఇచ్చినట్టు తెలిసింది. ముఖ్యంగా విమానాల ధరలు చాలా ఎక్కువగా ఉన్నట్టు ఆ సభ్యుడు తెలిపారు. కొనుగోలు ఒప్పందంపై ప్రభుత్వ వర్గాల్లో జరిగిన చర్చల ప్రక్రియ మొత్తాన్ని వివరిస్తూ ఈ కొనుగోళ్లకి వ్యతిరేకంగా తన నివేదికని అందజేశారని ద ఇండియన్ ఎక్స్ ప్రెస్ తెలిపింది. రాఫెల్ ఒప్పందం గురించి చర్చలు జరిపేందుకు ఏర్పాటు చేసిన కాంట్రాక్ట్ నెగోసియేషన్ కమిటీ (సీఎన్సీ)లోని ఒక సభ్యుడు ఈ ఒప్పందం వద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అప్పుడు ఆ సభ్యుడు జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. అలాగే ఆయన ఆ సమయంలో ఐఏఎఫ్ ఎక్విజిషన్ మేనేజర్ (సైన్యం అవసరాలను గుర్తించి కొనుగోలు చేసే కీలక బాధ్యత)గా ఉన్నారు. రక్షణ మంత్రిత్వశాఖలో ఉన్నతోద్యోగిగా ఉన్న ఆ అధికారి తన అభ్యంతరాలన్నిటిని లిఖితపూర్వకంగా నివేదిక తయారుచేసి అందజేశారు.ఇన్ని అభ్యంతరాలు వ్యక్తమైన తర్వాత రాఫెల్ ఒప్పందంపై సర్కార్ అనుమతి పొందేందుకు తప్పనిసరైన కేబినెట్ నోట్ తయారీలోనూ జాప్యం జరిగినట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. జాయింట్ డైరెక్టర్ హోదాలోని అధికారి వ్యక్తం చేసిన అభ్యంతరాలను ఆయన పై అధికారి (సైన్యంలోని కొనుగోళ్ల విభాగం చీఫ్ డైరెక్టర్) కొట్టి పారేశారు. దీంతో ఈ వ్యవహారం ముందుకు కదిలింది. తాజా సమాచారం మేరకు రాఫెల్ ఫైటర్ జెట్ ల కొనుగోలుపై అభ్యంతరాలు, వాటి తోసిపుచ్చడానికి దారితీసిన పరిస్థితులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ప్రత్యేకంగా పరిశీలించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ లో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయానికి ఈ వ్యవహారంలో కాగ్ నివేదిక వచ్చే అవకాశం ఉంది. అందులో ఈ వ్యవహారాన్ని ప్రధానంగా ప్రస్తావించవచ్చు. విమానాల కొనుగోళ్లపై చర్చించేందుకు ఏర్పాటైన సీఎన్సీ చీఫ్ గా ఐఏఎఫ్ వైస్ చీఫ్ నే నియమించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఈ కమిటీ ఫ్రాన్స్ టీమ్ తో 10-12 సార్లు చర్చలు జరిపి రాఫెల్ విమానాల ధరలను నిర్ణయించింది. దీనివల్ల ఇప్పటి వరకు రాజకీయ, వ్యాపార వర్గాలపై మాత్రమే ఆరోపణలు వినిపిస్తున్న ఈ వ్యవహారంలో భారత వాయుసేన అధికారులపై కూడా అనుమానాల నీడ కమ్ముకొంది.