ధర్నా చౌక్ పునరుద్ధరణ.

హైదరాబాద్;
హైదారాబాద్ ఇందిరాపార్కు దగ్గర ధర్నా చౌక్ ను కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులపై కాంగ్రెస్, తెలంగాణా జనసమితి, సిపిఐ, తెలుగుదేశం తదితర పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు హర్షం ప్రకటించాయి. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడడానికి ఇది నాంది అని ఆయా సంఘాల నాయకులు అన్నారు. నిరంకుశ, గడీల పాలనను అంతమొందించేందుకు ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అభిప్రాయపడ్డారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛతో పాటు అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం ఫ్యూడల్‌ పాలన సాగుతోందని, దీన్ని అంతమొందించేందుకు అంతా ఏకతాటిపైకి వచ్చి ధర్నాచౌక్‌ను సాధించుకున్నట్టుగానే ‘ప్రజాస్వామ్య తెలంగాణ’ను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ధర్నా చౌక్‌ను ఎత్తివేయడంపై ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు రాసిన లేఖపై హైకోర్టు స్పందించి కేసును విచారణ చేపట్టడంతో పాటు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కేసీఆర్‌ పాలన పతనానికి ప్రారంభం అన్నారు. అప్రజాస్వామిక పద్ధతిలో ధర్నాచౌక్‌ను రద్దుచేశారని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం సంతోషంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి అన్నారు.