నయీమ్ అనగా నేమి?

”ఫ్రెండ్లీ” పోలీసింగ్ అను నూతన దర్యాప్తు ప్రక్రియ!!

‘పోలీసుల చేతిలో అయుదం’గా మారిన నయిం సొంత ‘సామ్రాజ్యాన్ని’ నిర్మించుకున్నాడు. కొందరు ‘ఫ్రెండ్లీ’ పోలీస్ అధికారులను మాత్రమే నమ్మెవాడు. నయింకు సహాకరించిన ప్రజాప్రతినిధులు, రాజకీయప్రముఖులు, పోలీస్ అధికారులను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అలాంటి దృశ్యాలు లేవు. నయిం ఆకృత్యాలకు సంబంధించి 120 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. చాల మంది పై అక్రమ అయుదాలు ఉన్నట్లు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆయుదాలు ఎక్కడ నుంచి వచ్చాయి. ఎలా దాచిపెట్టారు. అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరగలేదన్న వాదనలు ఉన్నవి. బాధితులకు న్యాయం జరగలేదు. నయీమ్ అనే నరహంతకునితో చెట్టపట్టాలు వేసుకొని తిరిగిన పోలీసు అధికారుల సస్పెన్షన్ ఎత్తివేశారు. నయీమ్ ‘భూబాగోతం’ కొలిక్కి రాలేదు.

ఎస్.కె. జకీర్.
”గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసు దర్యాప్తును ఎట్టి పరిస్థితుల్లో సీబీఐకి అప్పగించేది లేదు. జాతీయ స్థాయిలో ప్రశంసలందుకునే సమర్థులైన పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నందున వారితోనే దర్యాప్తు చేయిస్తాము. నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత నాకు వేలాది మంది ఫోన్లు చేశారు. కన్నీళ్లు పెట్టుకుంటూ అభినందనలు తెలిపారు. భువనగిరి వెళ్తే వేలాది మంది వచ్చి ‘మా దరిద్రాన్ని వదిలించారు..’ అంటూ సంతోషించారు. నయీంను హతమార్చడంలో మన పోలీసులు చేసిన కృషి అభినందనీయం. అందుకే ఈ కేసు దర్యాప్తు చేసిన క్రెడిట్‌ మన పోలీసులకే దక్కాలి. సీబీఐకి ఈ కేసు ఇవ్వడం లేదు . మన పోలీసులు బెస్ట్‌ పోలీసింగ్‌ అవార్డులు అందుకుంటున్నారు. జాతీయ పోలీసు అకాడమీకి వచ్చిన సందర్భంగా ప్రధాని కూడా మన పోలీసులను ప్రశంసించారు. కేంద్ర హోంమంత్రి కితాబిచ్చారు. అలాంటి పోలీసులను ఉపయోగించుకునే ఈ కేసు దర్యాప్తు పూర్తి చేస్తాం. నయీం కేసును సీబీఐకి అప్పగించాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. నయీంను హతమార్చింది, ఆ తర్వాత 124 మంది అతని అనుచరులను పట్టుకుంది ఎవరు? సీబీఐ వాళ్లు వచ్చి పట్టుకున్నారా? అసలు నయీం అనే ఈ పిశాచం సృష్టికర్తలెవరో ప్రపంచానికి తెలియదా? ఆ పిశాచం నమిలి మింగుతుంటే ప్రోత్సహించింది ఎవరు? కళ్లు మూసుకుని రాజ్యం చేసింది ఎవరు? టీఆర్‌ఎస్‌ అధికారంలోని వచ్చాక రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గింది.పేకాట, గుడుంబాలపై ఉక్కుపాదం మోపి అణచివేశామ్. శాంతిభద్రతల విషయంలో చాలా కఠినంగా ఉంటున్నాం. నయీం కాదు ఆయన తాత అయినా ఈ ప్రభుత్వం క్షమించదు. నయీం ఉదంతంలో ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ ఎక్కడా ఉదాసీనంగా వ్యవహరించడం లేదు. ఏ విషయాన్ని కూడా దాచిపెట్టడం లేదు. నయీంను ప్రాణాలతో పట్టుకుని ఉంటే బాగుండేది. పోలీసులపై నయీం ముఠా కాల్పులకు దిగడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నయీం హతమయ్యాడు. ఎన్‌కౌంటర్‌ అనంతరం పోలీసులు సమర్థంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు నయీం ఉదంతంలో 740 మందికి పైగా సాక్షులను విచారించి 124 మందిని అరెస్టు చేసాం. నయీం ముఠాకు మొత్తం 52 హత్య కేసుల్లో ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో 26–27 కేసుల్లో సాక్ష్యాధారాలు కూడా లభించాయి. కేసు దర్యాప్తు దశలో ఉన్నందున అన్ని విషయాలను బయటపెట్టడం కుదరదు. కేసును తేల్చాలంటే పోలీసులు కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉన్నది . నయీం కేసు చాలా సున్నితమైనది కనుక అన్ని విషయాలను బయటకు వెల్లడించలేం. సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని అంశాలను బహిర్గతం చేస్తాం. అందరి చరిత్రలు బయటకు వస్తాయి. నయీం ముఠా అవశేషాలను కూడా వదిలిపెట్టేది లేదు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారెవరైనా, ఏ పార్టీలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా నూరు శాతం శిక్షించి తీరతాం. ఎవరినీ ఉపేక్షించాలన్న పిచ్చి ఆలోచన ప్రభుత్వానికి లేదు. టీఆర్‌ఎస్‌ నేత సాంబశివుడి హత్య జరిగిన తర్వాత ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు నేను వెళ్లాను. అప్పుడు అక్కడ జరిగిన సంస్మరణ సభలోనే నయీం దురాగతాల్ని ప్రశ్నించా. వలిగొండ సభలో ఎవడ్రా నయీం.. ఏమనుకుంటున్నవ్‌… దేవుడు నీకేమైనా ఆరు చేతులిచ్చిండా.. నువ్వు చేసే పని మేం చేస్తే ఎట్టుంటది…?’ అని ప్రశ్నించాను. ఈ మాటల తర్వాత కేసీఆర్‌ భువనగిరి దాటి వెళ్తాడా అని కూడా కొందరు వ్యాఖ్యలు చేశారు . అంతటి స్థాయిలో నయీం అనే పిశాచి పాతుకుపోయినా కాంగ్రెస్, టీడీపీ ఏమీ చేయలేకపోయినవి. మేం 15 ఏళ్లు పడుకున్నం. ఇప్పుడు మీకు రెండేళ్లు ఎందుకు పట్టింది అని ప్రతిపక్షాలు ప్రశ్నించడం అన్యాయం” నయీమ్ నేర కార్యకలాపాలపై, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై 2016 లో అసెంబ్లీలో జరిగిన లఘు చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇది.


ఒక నరహంతకుడు పోలీసు కాల్పుల్లో మరణించి బుధవారం నాటికి రెండు సంవత్సరాలు. ఇప్పటికీ ఈ కేసులో పురోగతి లేదు. బాధితులకు న్యాయం జరగలేదు. నయీమ్ అనే ఆ నరహంతకునితో చెట్టపట్టాలు వేసుకొని తిరిగిన పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. తాజాగా వారిపై సస్పెన్షన్ ఎత్తివేశారు. నయీమ్ ‘భూబాగోతం’ కొలిక్కి రాలేదు. అతనితో సంబంధాలు పెట్టుకున్న రాజకీయనాయకులంతా క్షేమం. ఎవరిపైనా కేసులు లేవు. నయీమ్ కూడబెట్టిన ఆస్తులు ఏమయ్యాయో తెలియదు. అతని గ్రూపు దగ్గర లభించిన ఆయుధాలు ఏమయ్యాయో తెలియదు. అతని కుడిభుజం ‘శేషన్న’ క్షేమంగా ఉన్నాడు. నయిం కేసుల్లో అంతుచిక్కనివి ప్రధానంగా ఆయుదాలు . ఇవి ఎక్కడ నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? ఎలా వాడకం జరిపారు?. అవన్ని ఇప్పుడు ఎం చేశారు? అనే ప్రషన్లు ఆసక్తిని కలిగిస్తున్నవి. మొత్తం 11 ఏ.కే. 47లు, 21 పిస్టల్స్ కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తెలింది. కాని ఒక్కటే ఏ.కే. 47, 6 పిస్టోల్స్ దొరికినట్లు పోలీసులు చెబుతున్నారు.2003 నుంచి 2015 మధ్య ఏకంగా 11 ఏకే–47లు, 21 పిస్టళ్లు కొనుగోలు చేశాడని ప్రచారం ఉన్నది.తన భార్య హసీనా, అక్క సలీమా, తల్లి తాహేరా, అత్త సుల్తానా, బావమరిది సాదిక్‌ల వద్ద మూడు ఏకే–47లు, ఒక కార్బైన్, రెండు పిస్టల్స్‌ ఉండేవి. నయీం తన ఫర్సనల్ సెక్యూరిటీగా ఉన్న అమీనా, అనుచరులు శ్రీధర్‌గౌడ్, శ్రీధర్‌రాజు, శేషన్న, పాశం శ్రీను, రాంబాబు, గోపన్న, ఈశ్వరయ్యతో ల వద్ద ఒక్కొక్క ఏకే–47లు ఉంటాయి. ప్రతీ ఒక్కరి వద్ద అదనంగా పిస్టల్‌ కూడా ఉంటుంది. ఏకే–47లను కారులో కనబడకుండా పట్టుకునే వారు. పిస్టళ్లను లోదుస్తుల్లో దాచుకునేవారు. 2014 నుంచి 2016 ఆగస్టు వరకు దందాలు చేసేందుకు షాద్‌నగర్‌లోని ఇందిరాపార్క్‌ నివాసాన్ని వాడుకున్నారు. యాంజాల్‌ శివారులోని ఇంజాపూర్‌లో ఉన్న నివాసంలోనూ సెటిల్‌మెంట్లు చేశాడు.ఐపీఎస్‌ వ్యాస్‌ హత్య కేసులో నయీం ముషీరాబాద్‌ జైలుకు వెళ్లారు. అక్కడ నయీంకు ఐఎస్‌ఐ ఉగ్రవాది షాహీద్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం షాహీద్‌ ఉత్తరప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన ఆయుధాల డీలర్‌ అర్ఖాన్‌భాయ్‌ అలియాస్‌ యుజవార్‌ను నయీంకు పరిచయం చేశాడు.


అర్ఖాన్‌భాయ్‌ ద్వారా 2000 సంవత్సరంలో నయీంకు ఆయుధాలు అందాయి. నయీం వాటిని మావోయిస్టులు, వారి సానుభూతిపరులు, పౌరహక్కుల నాయకుల హత్యలకు, భూ దందాలకు వినియోగించుకున్నాడు.2003లో అర్ఖాన్‌కు రూ.10 లక్షలు చెల్లించి రెండు ఏకే–47లు, రెండు పిస్టళ్లను తెప్పించాడు. ఆ డబ్బును తన అక్క సలీమా అర్ఖాన్‌కు అందించింది. తర్వాత 2006లో రూ.15 లక్షలు ఇచ్చి మరో 2 ఏకే–47లు, నాలుగు పిస్టళ్లను గోవాలోని తన చర్చిహౌస్‌కు వచ్చాయి. 2008లో అర్ఖాన్‌ రూ.20 లక్షలు తీసుకుని మరో రెండు ఏకే–47లను ఇంజాపూర్‌లోని నయీం అడ్డాకు తెచ్చి ఇచ్చాడు. 2013లో శంషాబాద్‌లోని రైల్వేహౌజ్‌లో ఇంకో రెండు ఏకే–47లు, రెండు పిస్టళ్లు ఇచ్చి రూ.20 లక్షలు తీసుకెళ్లాడు. 2015లో రూ.20 లక్షలు తీసుకుని ఒక ఏకే–47, ఒక కార్బైన్, 4 పిస్టళ్లను తెచ్చి ఇచ్చాడు.ఇవిగాకుండా ఛత్తీస్‌గఢ్‌లో రెండు సందర్భాల్లో 2 ఏకే–47లను, నాలుగు పిస్టళ్లను, ప్రకాశంలో ఉన్నప్పుడు రెండు పిస్టళ్లను నయీం తెప్పించినట్లు అనుచరుల విచారణలో వెల్లడైంది. మొత్తంగా నయీం దాదాపు కోటిన్నర వరకు చెల్లించి పదకొండు ఏకే–47లు, 21 పిస్టళ్లను తెప్పించాడు.ఎన్ కౌంటర్ తర్వాత అలకాపురి కాలనీ, శంషాబాద్, ఇంజాపూర్‌లలోని ఇళ్లు, తుక్కుగూడ ఫాంహౌస్‌ సహా మొత్తం 12 ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. రూ.2.5 కోట్ల నగదుతోపాటు భారీగా బంగారు ఆభరణాలు, పేలుడు పదార్థాలను ‘సీజ్‌’ చేశారు. నయీం ఎన్‌కౌంటరైన ప్రాంతంలో ఒక ఏకే–47ను. అతడి అనుచరులు శ్రీధర్‌గౌడ్, పాశం శ్రీనుల వద్ద మూడు చొప్పున ఆరు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలకాపురి కాలనీలోని ఇంట్లో ఒక కార్బైన్, 169 రౌండ్ల బుల్లెట్లు, 10 జిలెటెన్‌ స్టిక్స్‌ దొరికాయి. నయీం వద్ద 11 ఏకే–47 తుపాకులు, 21 పిస్టళ్లు ఉన్నట్లు ఒక సమాచారం. పోలీసులకు దొరికింది ఒక్క ఏకే–47, 6 పిస్టళ్లు మాత్రమే. మిగతా ఆయుధాలు ఎక్కడికి వెళ్లాయనే ప్రశ్నలు ప్రశ్నలు గానే మిగిలిపోయినవి.

నయీం షాద్‌నగర్‌ డెన్‌కు వెళ్లే ముందు రోజు అతడి భార్య, అక్క, అనుచరుల వద్ద ఏకే–47లు ఉన్నాయి. కానీ సోదాల సమయంలో మాత్రం లభించలేదని పోలీసులు తెలిపారు. పోలీసులు సీజ్‌ చేసినట్లుగా పేర్కొన్న ‘ప్రాపర్టీ’లో ఆయుధాల వివరాలను పూర్తిగా చూపకపోవడంపై సందేహాలు వ్యక్తమవడం సహజం. నయీం ముఠా యాక్షన్‌ కమిటీలో కీలకంగా ఉన్న శేషన్న, ఇతర అనుచరులు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారని తెలుస్తున్నది. శేషన్నను పోలీసులు పట్టుకోలేకపోయారా? అనే సందేహం ఉన్నది. నయిం బాధితులకు న్యాయం అందడం అందని ద్రాక్ష. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా, ముంబైలలో ఉన్న ఇళ్లు, స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు అనుసరించాల్సిన మార్గంపై సిట్‌ అధికారులు న్యాయశాఖ నుంచి సలహాలు తెలుసుకున్నారు. వేల కోట్లు అస్తులు ఉన్నా వంద కోట్లకు మించి జప్తు చేసుకోలేమని తెల్చిచెప్పారు. నయీమ్‌ తన భార్య, సోదరి, అత్త, బంధువుల పేర్లపై ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశాలు మాత్రమే ఉంది. వారికి ఎలాంటి అదాయం లేకుండానే నయిం సంపాదించి పెట్టాడని అదారాలు సేకరించారు. అయితే వారి పేరు మీద ఉన్న అస్తులు ఇప్పటి మార్కెట్ విలువ ఎంత ఉందో అదికారులు లెక్కలు కట్టారు.
హైదరాబాద్‌లోని అల్కపురి కాలనీలో రెండు ఇళ్ల విలువ రూ. 6 కోట్లు.మణికొండలోని పంచవటి కాలనీలో 8 ప్లాట్ల విలువ సుమారు రూ. 4–5 కోట్లుగా అంచనా.పుప్పాలగూడలో 300 గజాల చొప్పున 12 ఓపెన్‌ ప్లాట్ల విలువ సుమారు రూ. 6 కోట్లు.షాద్‌నగర్‌లోని 12 ఎకరాల మామిడి తోట, ఫాంహౌస్‌ల విలువ సుమారు రూ. 25 కోట్లు.తుక్కుగూడలోని 10 ఎకరాల తోట, ఫాంహౌస్‌ విలువ సుమారు రూ. 35 కోట్లు.కరీంనగర్‌ శివారులోని నగునూర్‌లో రూ. 5 కోట్ల విలువైన వెంచర్‌. నల్లగొండలో నయీమ్‌ అనుచరుల పేరిట ఉన్న రెండు ఇళ్లు, 18 ఎకరాల భూమి విలువ రూ. 3.5 కోట్లు.మిర్యాలగూడలో నయీమ్‌ అత్త పేరిట ఉన్న ఇంటితోపాటు 4 ఎకరాల భూమి విలువ సుమారు రూ. 65 లక్షలు. భువనగిరి, యాదగిరిగుట్టలోని 16 వెంచర్లలో 180పైగా ఓపెన్‌ ప్లాట్ల ఉన్నాయి వాటి విలువ 18 కోట్లు ఉంటుంది. గోవాలోని ‘కోకనట్‌ హౌస్‌’తోపాటు మరో ఇల్లు గుర్తించారు. ఒక్కో ఇంటిని రూ. 2.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు నయీమ్‌ భార్య, సోదరి తమ వాంగ్మూలంలో స్పష్టం చేశారు. నాగోల్, సరూర్‌నగర్‌లో ఓ సెటిల్‌మెంట్లో నయీమ్‌ అనుచరులు శేషన్న, శ్రీధర్‌ల పేరిట ఉన్న రెండు ఫంక్షన్‌ హాళ్ల విలువ సుమారు రూ. 6 కోట్లు. నార్సింగిలో రూ. 2 కోట్ల విలువైన ఇల్లు, శంషాబాద్‌లోని పోలీస్‌హౌస్‌ విలువ రూ. 2 కోట్లు. కల్వకుర్తిలో 8 ఎకరాల భూమి విలువ రూ. 3.5 కోట్లు. మేడ్చల్‌లో 3 ఎకరాలు, శామీర్‌పేట్‌లో ప్రముఖ రిసార్ట్‌ సమీపంలో మరో 3 ఎకరాల భూమి గుర్తించారు. ఓ ప్రజాప్రతినిధితో చేసిన సెటిల్‌మెంట్‌లో పొందిన ఈ భూమి విలువ సుమారు రూ. 20 కోట్లు. మొయినాబాద్‌లో ఒక్కోటి రూ. 45 లక్షల విలువైన రెండు విల్లాలు. ఇందుకు అవసరమైన డబ్బు మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌ ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌తో వచ్చాయని నయీమ్‌ అనుచరుల వద్ద నుంచి పోలీసులు సమాచారం రాబట్టారు.ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌లో సుమారు రూ. 2 కోట్ల విలువైన రెండు ఇళ్లు ఉన్నాయి. నయీమ్ గ్యాంగ్ దగ్గర మొత్తం 1,130 ఎకరాల భూములు ఉన్నట్లు తెల్చారు. నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ తర్వాత ‘సిట్‌’ విచారణలో 210 మంది బాధితులు తమ భూములపై ఫిర్యాదు చేయగా వాటిలో ఆధారాలు గుర్తించింది మాత్రం కేవలం 46 కేసుల్లోనే. నయీమ్‌ మొత్తం 1,130 ఎకరాల భూమి సంపాదించినట్లు గుర్తించినా ఈ కేసుల్లో ఆధారాలు దొరక్క అధికారులు తంటాలు పడుతున్నారు. 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ సెటిల్‌మెంట్ల విషయంలో కొందరు బాధితులు ఫిర్యాదు చేసినా ఆ భూములు అనేక మంది చేతులు మారాయి. ప్రస్తుతం బినామి , పొజిషన్‌లో ఉన్న వారి ఆదాయ వ్యవహారాలు, డాక్యుమెంట్లు, పక్కాగా ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకోవడం అంత సులభం కాకపోవచ్చు.


నయిం బినామి అస్తుల పై ఐ.టీ శాఖ కొరఢా ఘుళిపించింది. 5గురు కుటుంబ సభ్యులతో పాటు మరికొంత మంది బినామిలకు నోటీసులు జారీ చేసింది. నయిం అక్రమంగా సంపాదించిన అస్తుల్లో ఎవరెవరు బినామి ఉన్నారో అదాయపన్ను శాఖ వివరాలు రాబట్టింది.ఒక ‘ప్రయివేటు సైన్యం’ ఏర్పాటు చేసుకొని నరరూప రాక్షసునిగా మారి దక్షిణ తెలంగాణను గడ గడ లాడించిన మాజీ నక్సలైటు నయిం కేసులో ఎన్నో మలుపులు, మరెన్నో సంచలనాలు ఉన్నవి. 1999 నుంచి 2008 వరకు నయిం పోలీసులకు ‘మోస్టువాంటెడ్ క్రిమినల్’ కాదు. పోలీసులతో చెట్టాపట్టాలు వేసుకోని తిరిగివాడు. వివిధ రాష్ట్రాల్లో పోలీసులకు టెర్రరిస్టుల, మావోయిస్టులసమాచారం అందజేసేవాడు.కేంద్ర నిఘా బృందాలు సైతం నయిం సేవలను వాడుకున్నాయన్న ఆరోపణలు బలంగా ఉన్నవి . గుజరాత్ కు చెందిన సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్ కౌంటర్ కేసులో నయిం పాత్ర సంచలనం రేపింది. సోహ్రాబుద్దీన్ ని నయీమ్ పట్టించినట్టు సి.బి.ఐ. అరోపణ.ఈ కేసులో గతంలో అమిత్ షా తోపాటు ప్రధాని మోదీ పైన అప్పటి కాంగ్రేస్ గురి పెట్టింది. ఈ ఎన్ కౌంటర్ కేసులో అనేక మంది పోలీస్ అధికారులు జైలు పాలయ్యారు. బిజేపి అధికారంలోకి వచ్చిన తర్వాత అమిత్ షా కు ‘క్లీన్ చిట్’ వచ్చింది.అది వేరే కోణం. సోహ్రాబుద్దిన్ కేసులోనే కాకుండా ‘హుజీ’ తీవ్రవాద కార్యకలాపాల అణిచివేతలోనూ పోలీసులకు, నిఘా సంస్థలకు నయీము తోడ్పాటు అందించాడు.హైదరాబాద్ నుంచి బంగ్లాదేశ్ పారిపోయిన ముజీబ్ ను మట్టిపెట్టడంలో కౌంటర్ఇంటిలిజెన్స్ తో చేతులు కలిపి హైదరాబాద్ లో బాంబుపేలుళ్లకు కుట్రలను భగ్నం చేశారు. పాకిస్తాన్ నుంచి 27 ఏకే 47లు, వేల కొద్ది మ్యాగజైన్లు, బుల్లెట్లు, శాటిలైట్ ఫోన్లను హైదరాబాద్ కువస్తుండగా రాజస్థాన్ శివారులో పట్టించడంలో నయీమ్ ఉన్నడనే ప్రచారం జరిగింది. 2008 నుంచి నయిం కథ మలుపు తిరిగింది. అప్పటి దాకా ‘పోలీసుల చేతిలో అయుదం’గా మారిన నయిం సొంత ‘సామ్రాజ్యాన్ని’ నిర్మించుకున్నాడు. కొందరు ‘ఫ్రెండ్లీ’ పోలీస్ అధికారులను మాత్రమే నమ్మెవాడు. నమ్మినఅధికారుల కోసం ‘గిఫ్టుల’ రూపంలో తన గుప్పిట్లో ఉంచుకున్నాడు. నయింకు సహాకరించిన ప్రజాప్రతినిధులు, రాజకీయప్రముఖులు, పోలీస్ అధికారులను అరెస్ట్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ అలాంటి దృశ్యాలు లేవు. ప్రభుత్వం నుంచి అదేశాలు వస్తే ఎంతటి వారినైనా వదిలి పెట్టమని మీడియాకు ‘సిట్ అధికారులు’ చెప్పారు. మాజీ మంత్రులు, రాజకీయ నాయకులు, పోలీసుల అధికారుల పాత్ర పై లీకులు ఇచ్చారు. ఒక్క వ్యక్తికి ఫోన్ చేసిబెదిరించాడంటే, అతని సెల్ ఫోన్ టవర్ లోకెషన్ పోలీసుల ద్వారా తీసుకోని బెదిరింపులకు పాల్పడ్డారని స్వయంగా సిట్ అధికారులు ఒప్పుకున్నారు. రాజకీయనాయకులతో, పోలీసులతో నయీమ్ సంబంధాలపై హోంశాఖ సమర్పించిన నివేదిక పై పలు అనుమానాలు ఉన్నవి. నయిం ఆకృత్యాలకు సంబంధించి 120 మందికి పైగా అరెస్ట్ అయ్యారు. చాల మంది పై అక్రమ అయుదాలు ఉన్నట్లు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆయుదాలు ఎక్కడ నుంచి వచ్చాయి. ఎలా దాచిపెట్టారు. అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరగలేదన్న వాదనలు ఉన్నవి. ఇప్పటి వరకు 700 మందిపై విచారణ జరిపారు. మరో 218 మందిని విచారించాల్సిన అవసరం ఉంది. ఒక వైపు దర్యాప్తు కోనసాగుతోంది అని చెబుతూనే మరోవైపు కొంత మందికి ‘క్లీన్ చిట్’ ఇవ్వడం వింత. ఇప్పటికి దాఖలు చేసిన చార్జీషీట్ లో ఎక్కువ మంది నింది తులకు బెయిల్ మంజురయింది. నయింకు రైట్ హాండ్ గా ఉన్న శేషన్న ఇప్పటికి పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు.