నవాజ్ షరీఫ్ కు పదేళ్ల జైలు.

ఇస్లామాబాద్.
పనామా లీక్స్‌… భారత్‌లోఎలాంటి సంచలనాలు సృష్టించకున్నా… పాకిస్తాన్‌ను కుదిపేస్తోంది. మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు పదేళ్ళ జైలు శిక్ష విధిస్తూ ద అకౌంటబిలిటీ కోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. ఆయన కుమార్తె మరియంకు కనీసం ఏడేళ్ళు జైలు శిక్ష పడే అవకాశముంది. నవాజ్‌ అల్లుడు కెప్టెన్‌ సఫ్దర్‌ కూడా దోషిగా తేల్చిన కోర్టు.. ఆయనపై ఒక ఏడాది జైలు శిక్ష విధించింది. పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ద నేషనల్‌ అకౌంటబులిటీ బ్యూరో దాఖలు చేసిన అవెన్‌ఫీల్డ్‌ కరప్షన్‌కు సంబంధించి ఈ శిక్షలను అకౌంటబిలిటీ కోర్టు విధించింది. నవాజ్‌ షరీప్‌కు 80 లక్షల పౌన్ల జరిమానా విధించారు. ఇస్లామాబాద్‌లో కోర్టు శిక్ష విధిస్తున్న సమయంలో షరీఫ్‌ కుటుంబ సభ్యులు, ఆర్థిక మంత్రి ఇషాక్‌ దార్‌ కూడా కోర్టులో ఉన్నారు. బ్రిటన్‌ లో నవాజ్‌ కుటుంబానికి అక్రమాస్తులు ఉన్నాయని పనామా లీక్స్‌ వెల్లడించింది. శిక్ష విధించే సమయంలో నవాజ్‌ షరీఫ్‌తో పాటు ఆయన కుమార్తె మరియం, కుమారులు హసన్‌, హుస్సేన్‌లు లండన్‌లో ఉన్నారు.