నాగ వైష్ణవి హత్య కేసు. జీవితఖైదు విధించిన కోర్టు.

విజయవాడ:
చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది కోర్టు. ముగ్గురు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించింది విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు. ఎనిమిది సంవత్సరాలు కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్న నాగవైష్ణవి ఫ్యామీలీకి న్యాయం జరిగేలా కోర్టు తీర్పు ఉందన్నారు లాయర్. 79 మంది సాక్షులను విచారించిన తర్వాతే ఈ తీర్పు ఇచ్చింది కోర్టు. ప్రధాన దోషిగా వెంకటరావు గౌడ్ గా తేల్చగా.. మరో ఇద్దరినీ దోషులుగా తేల్చింది.ఈ కేసులో నిందితులు ఇప్పటి వరకు జైలులోనే ఉన్నారు. బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన నిందితులకు చుక్కెదురు అయ్యింది. తన అక్కకు చెందాల్సిన ఆస్తి రెండోభార్య కొట్టేస్తుందనే అక్కసుతోనే చిన్నారి నాగవైష్ణవిని హత్య చేశాడు ప్రభాకర్ మొదటి భార్య తమ్ముడు పంది వెంకట్రావు గౌడ్. 2010, జనవరి 30వ తేదీన కారులో స్కూల్ కు వెళుతున్న నాగవైష్ణవిని కిడ్నాప్ చేశారు నిందితులు. అడ్డుకున్న డ్రైవర్ ను నడిరోడ్డుపైనే హత్య చేశారు. కిడ్నాప్ చేసి తీసుకెళుతున్న సమయంలోనే.. నాగవైష్ణవిని గొంతునులిమి చంపేశాడు వెంకట్రావ్. ఆ తర్వాత ఆధారాలు లభించకుండా ఉండేందుకు.. చిన్నారి మృతదేహాన్ని సిమెంట్ గ్రౌండర్ లో వేశారు. కూతురు నాగవైష్ణవి హత్య వార్త విని తండ్రి పలగాని ప్రభాకర్ గుండెపోటుతో చనిపోయారు. ఇద్దరికీ ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. రెండేళ్ల క్రితం నాగవైష్ణవి తల్లి కూడా చనిపోయింది.