నాటుకోళ్లతో నెలకు లక్ష లాభం.

మహబూబ్ నగర్:
గుడ్లు, కోడిపిల్లల విక్రయంతో మంచి ఆదాయం ఏంబీఏ చదివిన యువకుడు నెలకు 70 వేల ఉద్యోగం వదిలేసి నాటుకోళ్ల ఫామ్‌ ఏర్పాటు చేసుకున్నారు. కోడి గుడ్లు, నాటు కోడి పిల్లలను బాగా ధర పలికే చోట విక్రయిస్తూ నెలకు లక్షకు పైగా ఆదాయం ఆర్జిస్తున్నారు.లక్ష్మణ్‌ ఎంబీఏ చదివారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏలూరు నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన ఆయన ఒక ప్రైవేట్‌ కంపెనీలో నెలకు 70 వేల జీతంతో ఉద్యోగం చేశారు. నిరంతరం ఒత్తిళ్ల మధ్య ఉద్యోగం చేసే కంటే సొంతగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకున్నారు. నాటుకోళ్లకు మంచి గిరాకీ వుందని గ్రహించి తొమ్మిదేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండల పరిధిలోని చౌదర్‌పల్లి సమీపంలో నాటుకోళ్ల ఫామ్‌ ప్రారంభించారు. 6 నాటుకోళ్లు ఒక కోడి పుంజుతో సాదాసీదాగా ప్రయాణం ప్రారంభించిన లక్ష్మణ్‌ ఈ రోజున వెయ్యి కోళ్లతో ఫామ్‌ నిర్వహిస్తున్నారు. కోళ్ల ఫామ్‌ పుంజుకోవడంతో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా వాటి పెంపకంపై దృష్టి సారించారు. కోడిగుడ్లను, నాటుకోడి పిల్లలను విక్రయుంచడం ద్వారా గణనీయంగా లాభాలు గడిస్తున్నారు. వెయ్యి కోళ్లు 3 వేల గుడ్లు పెడుతున్నాయి. వాటిలో సగం గుడ్లను పూణెకు మంచి ధరకు విక్రయిస్తున్నారు. మిగిలిన గుడ్లను పొదిగిస్తున్నారు. అలా వచ్చిన పిల్లలను ఒక్కో పిల్లను 200 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఇలా నెలకు లక్షా 80 వేల రూపాయలు ఆర్జిస్తున్నారు లక్ష్మణ్‌. ఫామ్‌ నిర్వహణకు నెలకు 70 వేల వరకు ఖర్చు అవుతోంది. ఖర్చులు పోను నెలకు లక్షా పది వేల లాభం వస్తుందంటున్నారు ఆ యువరైతు.
“నాటుకోళ్లకు మంచి గిరాకీ వుంది. నాటుకోడి గుడ్లను పూణె మార్కెట్‌లో మంచి ధరకు అమ్ముతున్నాను. కోడి పిల్లలకు కూడా మంచి ధర పలుకుతోంది. ఎవరి కిందో ఉద్యోగం చేసే కంటే కోళ్ల ఫామ్‌ ద్వారా నేనే కొందరి ఉపాధి కల్పించగలుగుతున్నాను. ఉద్యోగంలో కంటే ఎక్కువ ఆదాయం, గొప్ప సంతృప్తి పొందుతున్నాను” అని లక్ష్మణ్ చెప్పారు.