‘నాన్ బిజెపి కూటమి’ కి తెలంగాణాలో బీజం!!

ఎస్.కె.జకీర్.

”చంద్రబాబు బొడ్లో కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడు” . ”తెలంగాణ ఎన్నికల్లో 500 కోట్లు ఖర్చు పెట్టేందుకు చంద్రబాబు కుట్ర పన్నాడు. 3 హెలికాఫ్టర్లు కూడా సిద్ధం చేశాడు”, ”కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమరావతి నుంచే పెత్తనం సాగుతుంది” అనీ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలన్నింటికీ సోమవారం జవాబు దొరికింది. జాతీయస్థాయిలోబిజెపియేతర కూటమి ఏర్పాటు వ్యవహారం తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ముడిపడినట్టు టిడిపి అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడాన్ని బట్టి ఈ ఎన్నికలు ఎంత ప్రతిష్టాత్మకమో అర్ధం చేసుకోవచ్చు. బొడ్లో కత్తి పెట్టుకొని తిరగడం, 500 కోట్లు, హెలికాఫ్టర్లు, అమరావతి, పరుల పెత్తనం… వంటి అంశాలు మాట్లాడి తెలంగాణ ప్రజల్లో ‘భావోద్రేకాలు’ రెచ్చగొట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ‘వాక్పటిమ’ గురించి మళ్ళీ , మళ్ళీ చెప్పుకోవడం అనవసరం. కేసీఆర్ తిట్టినా, పొగిడినా అంతే తీవ్రంగా ఉంటుంది. చంద్రబాబు, రాహుల్ గాంధీ సంయుక్తంగా ‘ఆపరేషన్ తెలంగాణ’ చేపట్టారని ఉప్పందిన వెంటనే కేసీఆర్ తన శైలిలో విరుచుకు పడుతున్నారు. ఆయనలోని ‘అభద్రతాభావం’ ఇటీవలికాలంలో తరచూ బయటకు కనిపిస్తున్నది. ”కాంగ్రెస్‌తో పొత్తు ముఖ్యం. సీట్ల విషయంలో సర్దుకుపోవాలి. తెలంగాణలో ఏర్పడే కూటమి జాతీయస్థాయిలో ప్రభావం చూపుతుంది. కాంగ్రెస్‌ 12 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరో 6 సీట్లు అడుగుదాం . సీట్ల కేటాయింపుపై కాంగ్రెస్‌ పెద్దలతో మాట్లాడుతా. మహాకూటమిగెలుపునకుటీడీపీ కార్యకర్తలు కష్టపడాలి.
టికెట్ రాని వారు అసంతృప్తి చెందవద్దు. మహాకూటమి అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం చేస్తాము. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ప్రత్యామ్నాయ పదవులు కూడా దక్కుతాయి” అని చంద్రబాబు తమ పార్టీ తెలంగాణ నాయకులతో అన్నారు. తెలంగాణలో ప్రచారం చేయాలని టీడీపీ నేతలు కోరగా చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. తెలంగాణలో నాలుగు సభలు పెట్టాలని చంద్రబాబును టీటీడీపీ నాయకులు కోరారు. చంద్రబాబు మాటల్ని బట్టి కేసీఆర్ ను గద్దె దింపడం ఎంత ముఖ్యమోఅర్ధమవుతున్నది. జాతీయస్థాయిలోబిజెపియేతర ఫ్రంట్ ఏర్పాటుకు తెలంగాణ ఫలితాలు నాంది పలకనున్నవి. చంద్రబాబు, కేసీఆర్ ల మధ్య పాత ‘అకౌంట్స్’ ఉన్నవి. 1999 ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కు మంత్రిమండలిలో చోటు దక్కలేదు. డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. ఆ కోపంతోనే కేసీఆర్ ‘తెలంగాణ కార్డు’ ను బయటకు తీయడం, 2001 లో టిఆర్ఎస్ ను స్థాపించడం, 14 సంవత్సరాల ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర అవతరణ, ఓటుకు నోటు కేసు, చంద్రబాబు అవమాన భారంతో తన మకాంను పూర్తిగా అమరావతికి మార్చడం…. ఒక చరిత్ర. వర్తమానానికి వస్తే తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ను ‘కట్టడి’ చేయకపోతే, మళ్ళీ అధికారంలోకి రాకుండా నిలువరించలేకపోతే జాతీయ స్థాయిలో ‘ప్రాంతీయ పార్టీల కూటమి’ ఏర్పాటుకు కేసీఆర్ పూనుకోవచ్చునని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఒక నిర్ధారణకు వచ్చినట్టు కనిపిస్తున్నది. అందుకే తెలంగాణ ఎన్నికలను టిడిపి, కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నవి.బిజెపితో కేసీఆర్ సన్నిహితంగా మెలుగుతున్నట్టు, మోడీ దర్శకత్వంలోనే ఆయన ‘ఫెడరల్ ఫ్రంట్’ పేరిట ఒక కూటమి నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నట్టు కొన్ని నెలలుగా విమర్శలు రాజకీయవర్గాల్లో ఉన్నవి. కాంగ్రెస్,బిజెపి లకు’ప్రత్యమ్నాయం’ అనిచెబుతున్నప్పటికీ, ఈ ప్రతిపాదిత ‘ఫెడరల్ ఫ్రంట్’ బోగీని బిజెపి ఇంజన్ కు జత చేస్తారనీ ఆరోపణలు ఉన్నవి. తన పాలనపై, సామర్ధ్యంపై కేసీఆర్ కు అచంచలమైన విశ్వాసం ఉన్నది. క్షేత్రస్థాయిలో పార్టీ విజయావకాశాలు నల్లేరునడకలా లేవు. తన చిరకాల వాంఛ అయిన ‘కేటీఆర్ కు సీఎం పదవి అప్పగింత’ ను పూర్తి చేయడానికి కేసీఆర్ తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రవేశించి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేస్తామని, అవసరమయితే తానే నాయకత్వం వహిస్తానని కెసిఆర్ గతంలో ప్రకటించారు.

కేసీఆర్ ‘ఫ్రంట్’ కార్యకలాపాలకు కొంతకాలం ‘విరామం’ ఇచ్చారు. ముందస్తు ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి రాగానే పాలనా బాధ్యతలన్నీ కుమారుడు కేటీఆర్ కు అప్పజెప్పిజాతీయరాజకీయాలపైద్రుష్టి కేంద్రీకరించనున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నవి. లోక్ సభ ఎన్నికల నాటికి కేసీఆర్ ‘బిజెపి మనిషి’ గా మారవచ్చుననే అనుమానాలూ రాజకీయవర్గాల్లో ఉన్నవి. కాగా అటు కాంగ్రెస్ తో మైత్రీ బంధాన్నీ పటిష్టం చేసుకునే కార్యక్రమాల్లో టిడిపి అధ్యక్షుడు బిజీ గా ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార ఘట్టంలో రాహుల్, సోనియాగాంధీలతో చంద్రబాబు ఫొటోలు దిగారు. విక్టరీ సింబల్ చూపించారు. అందుకు కృతజ్ణతగా రాహుల్ గాంధీ కూడా విధేయత చూపించారు. ఆ తర్వాత హైదరాబాద్ లో రాహుల్ గాంధీ పారిశ్రామికవేత్తలతో జరిపిన సమావేశానికి చంద్రబాబు కోడలు, హెరిటేజ్ అధినేత నారా బ్రాహ్మణి హాజరయ్యారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మిత్రపక్షంగా మారిందనడానికి కొన్ని ఉదాహరణలు.”వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యం లేదు. 40 ఏళ్ల సీనియారిటీ అనుభవంతో చెబుతున్నా. కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీనే. దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేకులను సమీకరించటం ద్వారా మోడీకి చెక్ పెడతాం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి.ప్రత్యేక హోదా సాధించి తీరతాం” అని ఒక సందర్భంలో తమ పార్టీ సీనియర్ నాయకులతో కామెంట్ చేసినట్టు ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతర రాజకీయ పరిణామాలు, టిడిపి టికెట్టు పై గెలిచిన ఎమ్మెల్యేలలో దాదాపు అందరూ టిఆర్ఎస్ వైపునకు ఫిరాయించడం, కేసీఆర్ పెద్ద ఎత్తున వలసల్ని ప్రోత్సహించడం, ఓటుకు నోటు కేసు పేరిట జరిగిన వేధింపులను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. కేసీఆర్ పై పగ, ప్రతీకారాలతో ఆయన రగిలిపోతున్నారు. కేసీఆర్ పై పగ తీర్చుకోవడానికి ముందస్తు అసెంబ్లీ ఎన్నికలే సరైన సమయమని చంద్రబాబు నాయుడు గట్టిగా నమ్ముతున్నారు. ”మనం కేసీఆర్ లం కాదు.సీట్ల మీద ప్రాక్టికల్ గా ఉందాం. 2009 లో 54 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసిన టిఆర్ఎస్ 10 మాత్రమే గెలిచింది. ఆ తప్పిదం మనం చేయొద్దు. ఒంటరిగా పోటీ చేస్తే ఇర్రీలవెంట్అవుతాం. అందుకే పక్కా గెలిచే సీట్స్ లో నే పోటీ చేద్దాం. సీట్లు కాదు మనకు పొత్తులు ముఖ్యం. జాతీయ రాజకీయాల దృష్టిలో పొత్తులను చూడాలి” అని చంద్రబాబు తెలంగాణ నాయకులతో అన్నారు.