నాన్ బీజేపీ ఫ్రంట్ కు బెంగళూరులో శ్రీకారం. కేసీఆర్ ఆశలపై నీళ్ళు.

జాతీయ స్థాయిలో బీజేపీయేతర ఫ్రంట్కు బెంగళూరులో పునాదులు బలంగా పడ్డాయి. కెసిఆర్ తలపోస్తున్న కాంగ్రెస్, బీజేపీయేతర ఫెడరల్ ఫ్రంట్ ఆశలు అడియాసలు అయినట్లేనని పరిశీలకుల అంచనా. బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి గా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం బీజేపీ ఏతర జాతీయ ఫ్రంట్ కు వేదిక అయ్యింది. అరుదైన దృశ్యాలు ఆవిష్కృత మయ్యాయి.మాజీ ప్రధాని దేవెగౌడ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ,అఖిలేశ్ యాదవ్, మమతా బెనర్జీ,కేరళ ముఖ్యమంత్రి విజయన్, శరద్ పవార్, కేజ్రీ వాల్, చంద్రబాబు నాయుడు, మాయావతి,లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి, సిపిఎం సీతారాం ఏచూరి, సీపీఐ నాయకుడు రాజా, సురవరం,మాజీ సి.ఎం.హేమంత్ సొరేన్, తదితర హేమా హేమీలంతా ఒకే వేదికపై చేరడం ఇటీవల కాలంలో అపురూప దృశ్యం.

రాజకీయాల్లో ప్రతి కదలికకు ఒక అర్థం ఉంటుంది.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 3 వ తేదీ నుంచి ఫెడరల్ ఫ్రంట్ హడావుడి చేస్తున్నారు. కలకత్తా వెళ్లి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో రాజకీయ మంతనాలాడారు. చెన్నై వెళ్లి స్టాలిన్ ని కలిశారు. బెంగళూరు వెళ్లి జె.డి.ఎస్.నాయకులను కలిశారు. రేపో మాపో ఒడిశా వెళ్ళి నవీన్ పట్నాయక్ ను కలవాలని కేసీఆర్ అనుకుంటున్నారు. ఈ లోగా కాంగ్రెస్ మద్దతు తో జె.డి.ఎస్. కర్ణాటక లో అధికారంలోకి రావడం విశేషం. ఈ పరిణామాలు కేసీఆర్ ఊహించనివి.

ఆయన ప్రత్యేక విమానంలో ఫెడరల్ ఫ్రంట్ మిత్రుల కోసం యాత్రలు జరుపుతున్నారు. ఈ యాత్రలు ఫలిస్తున్న పరిస్థితి లేదని బెంగళూరులో బుధవారం దృశ్యాలు చెబుతున్నాయి. తను చేపట్టిన ‘ ఫెడరల్ ఫ్రంట్’
కార్యం విజయవంతం కావాలని ఆయన కుడి చేతికి మంత్ర శక్తి ఉన్న ఒక పట్టీ కూడా కట్టుకుని కేసీఆర్ యాత్రలు నిర్వహిస్తున్నారు. తన శక్తి సామర్థ్యాలేమిటో, తనకు అందుబాటులో ఎలాంటి వనరులున్నాయో ఆయన కలకత్తా లో తన తొలి రాజకీయ యాత్రలో ప్రదర్శించే ప్రయత్నం చేశారు.
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చర్చల్లో భాగంగా ఆయన మొదట మమతా బెనర్జీని కలవాలనుకోవడం కూడా విశేషమే. కానీ ఆమె మొదటి నుంచీ కాంగ్రెస్ అనుకూల ఫ్రంట్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. తనకున్న మేధస్సుతో, తెలంగాణ సాధించిన నేపథ్యంతో మొదట ఆమెను ఒప్పిస్తే దాని ప్రభావంతో తన పని సులువవుతుందని కెసిఆర్ భావించి వుండవచ్చు.కేసీఆర్ వైఖరి కి భిన్నంగా బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ను కలుపుకుని ఆమె ఒక ఫ్రంట్ కట్టే పనిలో ఉన్నారు. బెంగాల్‌లో ఆమెకు కాంగ్రెస్ ఎప్పుడూ శత్రువు కాదు. తెలంగాణలో కెసిఆర్‌కు కాంగ్రెస్ ప్రధాన శత్రువు. తెలంగాణలో ఆయన తలపడాల్సింది కాంగ్రెస్ తోనే. ఇక్కడ ఇద్దరి ఉద్దేశాలు వేరు. కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ నినాదంతో వీళ్లిద్దరూ సైద్ధాంతికంగా కలిసే అవకాశాలు చాలా తక్కువ.

నిజానికి కెసిఆర్ ఉన్నట్లుండి ‘థర్ఢ్ ఫ్రంటు’ అని ప్రకటించారు. కాంగ్రెస్ వ్యతిరేక, బిజెపి వ్యతిరేక ఫెడరల్ ఫ్రంట్ అవసరమని, వీలైతే తానే దానికి నాయకత్వం వహిస్తానని ప్రకటించారు. ఈ పని మీద దేశాటన మొదలు పెట్టారు. తెలంగాణ ఏర్పడ్డాక మూడున్నరేళ్లు ఆయన కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. కేంద్రం ఢిల్లీకి పరిమితం కావాలన్నారు.

ఇపుడు దేశ రక్షణ, దేశమంతా తిరిగే రైళ్లు, విమానాల వంటి శాఖలు తప్ప మిగతా వ్యవహారాలలో కేంద్రానికి పనిలేదు, రిజర్వేషన్ల వంటి వ్యవహారాలు పూర్తిగా రాష్ట్రాలే చూసుకోవాలనే చర్చ లేవనెత్తారు. గ్రామాల్లో రోడ్లేసేందుకు, పల్లెల్లో ఉపాధి కల్పించేందుకు ప్రధాని పేర పథకాలేమిటని కడిగేశారు. ఇక ఉద్యమం చేయాల్సిందేనని, దీనికి ఫెడరల్ ఫ్రంట్ అవసరమని ప్రాంతీయ పార్టీలను కూడగట్టే పనిలో పడ్డారు.ఎన్నికల మేఘాలు అలుముకుంటున్నపుడు కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ అన్నిరాష్ట్రాలు ప్రత్యేక విమానంలో యుద్ధ ప్రాతిపదికన తిరగాలనుకోవడంలో రహస్యమేమిటి? ఈ ప్రశ్న చాలా మందిని పీడిస్తూ ఉంది. ఇపుడు ఫెడరల్ ఫ్రంట్ అవసరముందా? బిజెపియేతర, కాంగ్రెసేతర కూటముల్లో లేని పార్టీలేవయినా ఉన్నాయా? కర్ణాటక దృశ్యాలను బట్టి బీజేపీయేతర ఫ్రంట్ కు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయకత్వం వహించే అవకాశం కనిపిస్తోంది.