నాలుగో విడత హరితహారానికి శ్రీకారం.

గజ్వేల్ :
తెలంగాణలో నాలుగో విడత హరితహారం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ గజ్వేల్ వేదికగా శ్రీకారం చుట్టారు. గజ్వేల్‌లోని ఇందిరా పార్కు కూడలి వద్ద సీఎం కేసీఆర్ కదంబ మొక్క నాటారు. సీఎం కేసీఆర్ మొక్క నాటిన తర్వాత సైరన్ వేయడంతో గజ్వేల్‌లో 1,16,000 మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో అటవీశాఖ మంత్రి జోగు రామన్న, సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, మల్లారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అంతకు ముందు క్యాంపు ఆఫీస్ నుంచి గజ్వేల్‌కు బయల్దేరిన సీఎం కేసీఆర్.. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లిలో రాజీవ్ రహదారిపై ఆకాశమల్లె మొక్క నాటారు. ఆ తర్వాత సిద్దిపేట జిల్లా ములుగులో అంజయ్య అనే వ్యక్తి ఇంట్లో కొబ్బరి మొక్క నాటారు సీఎం కేసీఆర్. ఇక శిరిగిరిపల్లి వద్ద ఆగిన సీఎం.. అటవీ పునరుజ్జీవనం గురించి అటవీశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.