నా తల్లిని చూసి నేర్చుకున్నా…-రాహుల్ గాంధీ;

ప్రకాశ్, న్యూఢిల్లీ.

తల్లి సోనియాగాంధీ, తన నాయకత్వ వైఖరుల్లో వైరుధ్యాలు ఉన్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తను ఆలోచన ప్రకారం ముందుకెళ్తే తన తల్లి మాత్రం తన భావనలను అనుసరిస్తుందని చెప్పారు. తమ ఆలోచనల్లో వైరుధ్యాలు ఉన్నప్పటికీ తల్లి నుంచి తానెంతో నేర్చుకున్నానని.. ముఖ్యంగా ఆమెను చూసి సహనాన్ని అలవరచుకున్నానని తెలిపారు. తన జీవితంలో ఎందరో ప్రత్యేక వ్యక్తులు ఉన్నారని రాహుల్ చెప్పారు.’హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్’ సమ్మిట్ లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకొని దేశాన్ని దారుణంగా నష్టపరిచిందని ఆయన ఆరోపించారు. యుపిఏ తయారుచేసిన జీఎస్టీని హడావిడిగా అమలులోకి తెచ్చి వ్యాపారాలను దెబ్బతీశారని విమర్శించారు. ముఖ్యంగా చిరు వ్యాపారులు ఆ దెబ్బ నుంచి కోలుకోలేదన్నారు. యుపీఏ హయాంలో సొంత పార్టీ చేసిన తప్పిదాలను కూడా రాహుల్ నిశితంగా విమర్శించారు. తగినన్ని సంస్థలను ఏర్పాటు చేయడంలో అప్పటి ప్రభుత్వం విఫలమైందన్నారు. ఆనాటి కాంగ్రెస్ వ్యూహాలను తను ఆమోదించబోనని తెలిపారు.

తను ఎంతో కాలంగా మందిరాలు, మసీదులు, గురుద్వారాలు, చర్చిలకు వెళ్తూనే ఉన్నానని.. ఇటీవలి కాలంలో తన ప్రార్థనా స్థలాల దర్శనాన్ని ప్రముఖంగా చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. గుళ్లూ గోపురాలకి వెళ్లడాన్ని బీజేపీ నేతలు తమ హక్కు అనుకుంటున్నారని విమర్శించారు. హిందూ మార్గానికి, హిందూత్వానికి తేడా ఉందన్నారు. హిందూ మార్గం మతపరమైనది అయితే హిందూత్వ రాజకీయ భావజాలం అని వివరించారు.