నిక్కీ హేలీ పంట పండనుంది.

వాషింగ్టన్;
ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి పదవికి రాజీనామా చేసిన భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ భవిష్యత్తులో బోల్డంత డబ్బు సంపాదించనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోస్యం చెప్పారు. ఆమె ఓ అద్భుత మహిళ అని.. ఈ ఏడాది తర్వాత ప్రైవేటు రంగంలో చేపట్టబోయే ఉద్యోగం నిక్కీకి కాసుల వర్షం కురిపించనుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది చివరి వరకూ ఆమె తన పదవిలో కొనసాగుతారు. “డిసెంబర్ చివరి వరకూ నిక్కీ తన బాధ్యతలు నిర్వహిస్తారు. ఆమె స్థానంలో మరొకరిని నామినేట్‌ చేసి వారిని సెనేట్‌ ఆమోదించే వరకు ఆ పదవిలో ఉంటారు. ఆమె నాకు మంచి స్నేహితురాలు. ఆమె గొప్ప వ్యక్తి. నిక్కీ బయటకు వెళ్లేలోగా మరికొంత సమయం ఆమెతో గడపాలని కోరుకుంటున్నాను. ఆపై ఆమె ప్రైవేట్ సెక్టార్ లో మరో ఉద్యోగం చూసుకుంటుంది. అక్కడ చాలా డబ్బు సంపాదిస్తుందని, మరో రూపంలో ఆమె ప్రజల ముందుకు వస్తారని అనుకుంటున్నట్టు” బుధవారం వైట్ హౌస్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ట్రంప్ వ్యాఖ్యానించారు. నిక్కీ స్థానానికి నలుగురైదుగురు వ్యక్తులను పరిశీలిస్తున్నానని ట్రంప్‌ తెలిపారు. వారిలో దీనా పోవెల్‌(45) ఉన్నారు. ఆమె ట్రంప్‌కు మాజీ డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు. 46 ఏళ్ల నిక్కీ హేలీ అమెరికా ప్రభుత్వంలో కేబినెట్‌ ర్యాంక్‌ పదవి పొందిన తొలి ఇండో అమెరికన్‌. ఆమె మంగళవారం పదవికి రాజీనామా చేయగా ట్రంప్‌ దానిని ఆమోదించారు. దశాబ్దానికి పైగా ప్రజా జీవితం గడిపిన తాను, కొంతకాలం విరామం తీసుకోవాలని భావిస్తున్నట్టు రాజీనామా చేసిన తర్వాత నిక్కీ హేలీ తెలిపారు.