‘నిర్భయ’ దోషులకు మరణశిక్ష.

న్యూఢిల్లీ:
2012 డిసెంబర్ 16న దేశ రాజధానిలో నిర్భయ ఘటన జరిగింది. కదులుతున్న బస్సులో దారుణంగా అత్యాచారం జరిపిన
నలుగురికి సుప్రీంకోర్టు సోమవారం నాడు మరణ శిక్ష ను ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, అత్యాచారాలపై కఠిన చట్టాలను తెచ్చిన నిర్భయ కేసులో సుప్రీంకోర్టు నేడు తుదితీర్పు ఇచ్చింది. ఇప్పటికే కింది కోర్టు దోషులకు ఉరిశిక్షను విధించిన నేపథ్యంలో, సుప్రీం కోర్టు కూడా ఉరిశిక్ష ఖరారు చేసింది. 2012 డిసెంబర్ 16వ తేదీన వైద్య విద్యార్థినిపై ఓ మైనర్ సహా ఆరుగురు అత్యంత పాశవికంగా అత్యాచారం జరపగా, 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె, డిసెంబర్ 29న మరణించిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడితో కలసి సినిమా చూసి తిరిగి వస్తుండగా, కదులుతున్న బస్సులోనే ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో ఆమె పేగులకు కూడా గాయాలు అయ్యేంత కిరాతకంగా ప్రవర్తించారు దుర్మార్గులు. మర్మాంగంలో ఇనుప రాడ్లు పొడిచారు. ఈ అత్యాచారం దేశాన్ని కుదిపేసింది. రగిలిన ప్రజల నిరసన ప్రభుత్వాలు దిగివచ్చేలా చేసింది. ‘నిర్భయ’ పేరిట కఠిన చట్టాలు వచ్చాయి.ఈ కేసులో బస్ డ్రైవర్ రామ్ సింగ్, అతని తమ్ముడు ముకేష్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, అక్షయ్ కుమార్ లతో పాటు మైనర్ బాలుడు రాజును అరెస్ట్ చేయగా వీరికి సెషన్స్ కోర్టు 2013, సెప్టెంబర్ 13న చనిపోయే వరకూ ఉరితీయడమే సరైన శిక్షని తీర్పిచ్చింది. రామ్ సింగ్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.