నిశ్చితార్థం ఒకరితో..పెళ్ళి వేరొకరితో..

బోడుప్పల్‌/ హైదరాబాద్:
ఒకరితో నిశ్చితార్థం చేసుకొని.. మరొకరిని పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడిని మేడిపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం నల్లగొండ జిల్లా చర్లపల్లికి చెందిన బీపంగి హరబాబు (28) కంప్యూటర్‌ ఆపరేటర్‌. స్థానికంగా మీసేవా కేంద్రాన్ని నిర్వహిస్తుంటాడు. బోడుప్పల్‌ శివపురి కాలనీకి చెందిన యువతితో ఈ ఏడాది ఫిబ్రవరి 22న నిశ్చితార్థం జరిగింది. కట్నకానుకలు అన్నీ మాట్లాడుకున్నారు. నిశ్చితార్థం సందర్భంగా ఖర్చుల నిమిత్తం హరిబాబుకు రూ.50వేలు నగదు సైతం అందజేశారు. మరో రూ.50వేలు యువతి తరఫు వారు ఖర్చుచేశారు. ఆగస్టులో పెళ్లి చేయాలని ఇరు వర్గాల పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. కాగా హరిబాబు తన మీసేవా కేంద్రంలోనే పనిచేసే ఓ యువతి (23)ని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి(నిశ్చితార్థం జరిగిన) బంధువులు హరిబాబును నిలదీయగా సమాధానం చెప్పకుండా ముఖం చాటేశాడు. దీంతో తాను మోసపోయినట్లు బాధితురాలు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏఎస్సై అంజయ్య నిందితుడిని ఆదివారం అదుపులోకి తీసుకొని విచారించారు. ఆరోపణలు నిజమని తేలడంతో కేసు హరిబాబును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్‌ అంజిరెడ్డి తెలిపారు.