నీట్-2018లో తెలుగు విద్యార్థులకు న్యాయం జరుగుతుందా?

ఎస్.కె.జకీర్.
తాజా పరిణామాలతో ‘నీట్ – 2018’ లో తెలుగు విద్యార్థులకు అన్యాయం జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది తమిళంలో నీట్ పరీక్ష రాసిన 24,500 మంది విద్యార్థులకు 196 గ్రేస్ మార్కులు ఇవ్వాలని సీబీఎస్ఈని మద్రాస్ హైకోర్ట్ ఆదేశించింది. 49 ప్రశ్నలకు సంబంధించి 60 అనువాద తప్పులు ఉన్నందువల్ల ఒక్కో ప్రశ్నకి 4 చొప్పుల మార్కులు కేటాయించాలని సూచించింది. రెండు వారాల్లోగా కొత్త ర్యాంకులను ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. జూలై 1 నుంచి ప్రారంభించి ఇప్పటి వరకు జరిపిన అన్ని మెడికల్ కౌన్సిలింగ్ లను ఉపసంహరించాలని చెప్పింది. మద్రాస్ హైకోర్టు తాజా ఆదేశాలతో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నీట్ కటాఫ్ మార్కు. ఏకంగా 24,500 మందికి 196 మార్కులు కలవడంతో కటాఫ్ మార్క్ భారీగా పెరగనుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా మొత్తం ర్యాంకింగ్స్ లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. నీట్ పరీక్షల్లో మరోసారి సత్తా చాటిన తెలుగు విద్యార్థులకు ఇది కొంచెం ఇబ్బంది కలిగించే పరిణామమే. ఎన్నో ఏళ్లు కష్టపడి శ్రమించి సాధించిన మెరిట్ ర్యాంకింగులను హఠాత్తుగా కోల్పోవడం తెలుగు విద్యార్థులకు కచ్చితంగా బాధ కలిగించేదే. అనువాద దోషాలు ఒక్క తమిళానికే పరిమితం కాకపోయి ఉండొచ్చు. ఇతర ప్రాంతీయ భాషల్లో తర్జుమా చేసినపుడు పొరపాట్లు దొర్లవచ్చు. కానీ ఒక్క తమిళ విద్యార్థులకే ప్రయోజనం కలిగించే మద్రాస్ హైకోర్ట్ తీర్పుతో దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులు, ముఖ్యంగా తెలుగు విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.